ఎన్నటికీ పునరావృతంకాని పనిలో భాగం వహించండి
1 మానవజాతి చరిత్రంతటిలోనూ వివిధ సమయాల్లో, తన శత్రువులపై యెహోవా తీర్పుతీర్చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, తన కనికరాన్నిబట్టి రక్షణను పొందే అవకాశాన్ని ఆయన నీతిమంతులకు ఏర్పాటు చేశాడు. (కీర్త. 103:13) వారి పర్యవసానం ఎలా ఉంటుందో దాని విషయంలో వారి ప్రతిస్పందన నిర్ణయిస్తుంది.
2 ఉదాహరణకు, సా.శ.పూ. 2370లో జలప్రళయం రాకముందు నోవహు “నీతిని ప్రకటిం”చాడు. ఆ దైవిక హెచ్చరికను అలక్ష్యం చేసినవారు నాశనమయ్యారు. (2 పేతు. 2:5; హెబ్రీ. 11:7) సా.శ. 70లో యెరూషలేము నాశనం కాకముందు, ఆ పట్టణం మీదికి రానైవున్న వినాశనాన్ని తప్పించుకోవాలనుకునేవారెవరైనా తీసుకోవల్సిన చర్యను గూర్చి యేసు స్పష్టంగా సూచించాడు. ఆయన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన వారందరూ తీవ్రమైన పరిణామాలను అనుభవించారు. (లూకా 21:20-24) అలాంటి దైవిక హెచ్చరికలూ తీర్పులూ చరిత్రంతటిలోనూ అనేక మార్లు ఇవ్వడం జరిగింది.
3 ఆధునిక దిన హెచ్చరికా పని: నేటి దుష్ట విధానంపై తన కోపాన్ని కుమ్మరిస్తాననీ, మరి దీనులు మాత్రమే తప్పించుకుంటారనీ యెహోవా ఎంతో కాలం క్రితమే ప్రకటించాడు. (జెఫ. 2:2, 3; 3:8) ఈ హెచ్చరికా సందేశాన్ని ప్రకటించేందుకు మిగిలివున్న సమయం ఎంత త్వరగా గతించిపోతోందో! ‘మహా శ్రమ’ ముందుంది, మరి ఇప్పుడు దీనులను సమకూర్చడం జరుగుతోంది. నిజంగానే, ‘పొలములు . . . తెల్లబారి కోతకు వచ్చియున్నవి.’ కనుక, ఈ పనికున్న ప్రాముఖ్యత గానీ అత్యావశ్యకత గానీ మరింకే పనికి కూడా లేదు.—మత్త. 24:14, 21, 22; యోహా. 4:35.
4 ఇతరులు “వినినను వినకపోయినను” ఆధునిక దిన హెచ్చరికను వారికి వినిపించడంలో మనం తప్పక పాలుపంచుకోవాలి. ఇది దేవుడిచ్చిన నియామకము, దీన్ని మనం అలక్ష్యంచేయకూడదు. (యెహె. 2:4, 5; 3:17, 18) ఈ పనిలో మనం పూర్తిగా భాగంవహించడం, దేవుని ఎడల మనకు ప్రగాఢమైన ప్రేమ ఉందనీ మన పొరుగువారి విషయంలో మనకు యథార్థమైన శ్రద్ధ ఉందనీ మన రక్షకుడైన యేసుక్రీస్తుయందు మనకు అచంచలమైన విశ్వాసం ఉందని ప్రదర్శిస్తుంది.
5 చర్య గైకొనవలసిన సమయం ఇదే: సాతానూ అతని దయ్యాలు ఇంకా చురుకుగా ఉన్నాయి కనుక గతంలో యెహోవా తీర్పులిచ్చిన తర్వాత ప్రతిసారీ దుష్టత్వం మరలా ప్రారంభమైంది. అయితే ఈసారి అలా జరగదు. సాతాను ప్రభావం తీసివేయడం జరుగుతుంది. రాబోయే “మహాశ్రమల”ను గూర్చిన భౌగోళిక హెచ్చరికను ఇవ్వాల్సిన అవసరం ఇక ఎన్నడూ ఉండదు. (ప్రక. 7:14; రోమా. 16:20) మరెన్నడూ పునరావృతంకాని పనిలో భాగంవహించే ఆధిక్యత మనకుంది. మనకున్న ఈ అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకునే సమయం ఇదే.
6 అపొస్తలుడైన పౌలు తన ప్రకటనా పనిని గూర్చి ఎంతో విశ్వాసంతో ఇలా అన్నాడు: “అందరి రక్తము విషయమైనను నేను నిర్దోషిని.” (అపొ. 20:26 అధఃసూచి) ఆ హెచ్చరికను ఇవ్వకపోవడంవల్ల తాను రక్తాపరాధి అయినట్లు ఆయన ఎన్నడూ భావించలేదు. ఎందుకని? ఎందుకంటే “నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను” అని ఆయన తన పరిచర్యను గూర్చి చెప్పగలిగాడు. (కొలొ. 1:29) ఎన్నడూ మరలా చేయబడని పనిలో సాధ్యమైనంత సంపూర్ణంగా భాగంవహించే తృప్తిని మనం అనుభవిద్దాము!—2 తిమో. 2:15.