పరిశుభ్రత దేవున్ని ఘనపరుస్తుంది
1 పరిశుభ్రత తప్పకుండా ఉండటానికి మోషే ధర్మశాస్త్రం కచ్చితమైన నియమాలను కలిగి ఉంది. అవి ఇశ్రాయేలీయులను తమను తాము భౌతికంగా మరియు ఆత్మీయంగా పరిశుభ్రంగా ఉంచుకొనవలసిన ప్రజలుగా ప్రత్యేక పర్చాయి. (లేవీ. 11:35, 36; 15:1-11; యెష. 52:11) ఈ పరిశుభ్రమైన పరిస్థితి దేవునికి ఘనతను తెచ్చి ఆ జనాంగంయొక్క ఆరోగ్యానికి దోహదపడింది.
2 ఈనాడు కూడ, పరిశుభ్రత యెహోవా ప్రజలను గుర్తించడానికి చిహ్నంగా ఉంది. అయితే యెహోవా ప్రజలను ఇది ఒక గుంపుగా గుర్తిస్తున్నప్పటికి, మనలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయంలో అది వాస్తవమేనా? శుచి మరియు వ్యక్తిగత పరిశుభ్రత విషయమై మనము ఎంతగా శ్రద్ధకలిగి ఉన్నామో అదే మనము యెహోవా కట్టడలను ఎంతగా గుణగ్రహిస్తున్నాము అనే దానిని ప్రతిబింబిస్తుంది.
3 మన ఇల్లు కనపడు తీరు విషయమేంటి? అది మనము తెలియజేసే రాజ్య వర్తమానానికి అవమానాన్ని తెస్తుందా? మన గృహము అశుభ్రంగా, మన పెరడు పిచ్చిగా పెరిగిన గడ్డి మరియు కలుపు మొక్కలతో ఉండి మనము భూమి పరదైసుగా మార్చబడుతుందని చెప్పినప్పుడు, కొందరు మన చిత్తశుద్ధిని ప్రశ్నించడానికి అది అవకాశమిస్తుందా? మన గృహము అస్తవ్యస్తంగా ఉన్నట్లు కనిపించడం లేక అశుభ్రమైన అలవాట్ల వలన అనంగీకారంగా ఉండే దుర్వాసన వస్తూ ఉంటే, మనము “దేవుని రాజ్యము క్రింద ఉండే నూతన ప్రపంచానికి సరిపడే శుభ్రతా పద్ధతులను” పెంపొందించు కున్నామని చెప్పగలమా?—om పేరా 130-1.
4 ప్రాంతీయసేవ కొరకు మనము ఉపయోగించే వాహనాన్ని గురించి ఏమి చెప్పగలము? అది మనము చేసే పనికి సరితూగేంత సహేతుకంగా శుభ్రంగా ఉందా? మన బట్టలు, పుస్తకాల సంచీ, మరియు తల దువ్వుకొనటం విషయమేమిటి? అవి ఇతరులు అభ్యంతరపడనంత శుచిగా, చక్కగా ఉన్నాయా? క్రమంగా స్నానం చేయటం మరియు బట్టలు ఉతుకుకొనటం ద్వారా మనల్ని మన బట్టల్ని శుభ్రంగా ఉంచుకొనటం సహేతుకమే.—w89 6/1 పేరా 16-19.
5 ఒక సహోదరుడు తన వ్యక్తిగత శుభ్రత లేక చుట్టుప్రక్కల విషయాలలో సంఘానికి అవమానాన్ని కలిగించేంత అలక్ష్యంగా ఉంటే విషయమేంటి? వయస్సు లేక అనారోగ్యం వలన అతనికి కేవలం కొంత ప్రేమ పూర్వక సహాయం అవసరం అయ్యుండవచ్చు. అలాగైతే, అతనికి సహాయం చేయటం దయాగుణం అవుతుంది. కొందరికి సమస్య ఉండవచ్చు కానీ వారికి అది ఉందని కూడ తెలియకపోయుండవచ్చు; పరిస్థితిని చక్కబర్చడానికి దయగల సలహా అతనిని ప్రేరేపించవచ్చు. ఈ విషయంలో తదేకంగా హీనమైన ఉదాహరణగా ఉండే వ్యక్తులు, సంఘంలో ఉన్నత ఆధిక్యతలకు అర్హులు కారు. అయితే, పెద్దలు తమ స్వంత వ్యక్తిగత కట్టడలు లేక ఇష్టాలను నియమించకుండా జాగ్రత్తపడాలి.
6 మన రాజ్య మందిరాలలో ఆత్మీయ విందును ఆనందించడానికి క్రొత్తగా ఆసక్తి పెంపొందించుకుంటున్న వ్యక్తులు ఆహ్వానింపబడతారు. సాధారణంగా, మందిరం చాలా ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉంటుంది గనుక మనము ఆహ్వానించడానికి ఆతురత చూపిస్తాము. కాని దానిని అలా ఉంచడానికి పనిచేయవలసి ఉంటుంది. మీ మందిరాన్ని చుట్టూ చూడండి. కుర్చీలు, నేల, మరి గోడలు శుభ్రంగా ఉన్నాయా? మరుగుదొడ్లు క్రమంగా శుభ్రపరచ బడుతున్నాయా? మనము మురికి నేల లేక సున్నం రాలుతున్న గోడలను చూడటానికి అలవాటు పడిపోతే, త్వరలోనే మనము అది మంచిగానే ఉంది అని దృష్టించడం మొదలు పెడతాము. కాని, మొదటిసారిగా దర్శిస్తున్న క్రొత్త వారికి మాత్రం అది అయిష్టమైన అభిప్రాయాన్ని కల్గించవచ్చు. శుభ్రపరచ వలసిన లేక పునస్సజ్జీకరించ (తగిన అలంకరణ చేయ) వలసిన సమయం వచ్చినప్పుడు మన వంతు చేయటం ద్వారా, మందిరాన్ని చక్కగా మరియు ఆకర్షణీయంగా ఉంచడానికి మనము మన శక్తికొలది చేయాలి.
7 మన వ్యక్తిగత రూపం మరియు మన గృహాలు, వాహనాలు, మరియు రాజ్య మందిరాల శుభ్రతద్వారా మనము ఒక్క మాట కూడ మాట్లాడకుండానే దేవున్ని ఘనపరచవచ్చు. మన మంచి ఉదాహరణ ఎవరు కూడ అభ్యంతరపడటానికి కారణం కాక, మన ఆరాధన శుభ్రమైనది మరి సరైనది అనే దానికి సాక్ష్యమిస్తుంది.—1 కొరిం. 10:31, 32; యాకో. 1:27.