ధైర్యంగాను, నేర్పుగాను సువార్త ప్రకటించుట
1 “వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై” ఉంటారని అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉద్బోధించాడు. (2 తిమో. 4:2, 3) మనము ఈ అంత్యకాలాల్లోని చివరి దినాలకు చేరుకునే కొలది, బైబిలు నందలి హితబోధను వినడానికి అయిష్టత చూపేవారి సంఖ్య వృద్ధియగుచున్నది. పై వాక్యం ఇంకా చెప్పినట్లుగా “తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసి” కోవడానికి ఎన్నుకొంటూ, మనం వారికి అందించే సత్యాలను ఊరకనే నిర్లక్ష్యం చేయడం ద్వారా కొన్నిసార్లు వారు ఈలాంటి దృక్పథాన్ని కనబర్చారు. మరికొన్ని సమయాలలో, వారు గర్వంగా, ఆశానిగ్రహం లేకుండా, క్రూరంగా ఉండడంద్వారా ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తారు, అది మన పనిని సంపూర్తిచేయడాన్ని కష్టతరం చేస్తుంది. మనం ఈ పనిని కొనసాగించాలి గనుక, ఆవశ్యంగా “అసమయమందు” కూడా ధైర్యంగాను, నేర్పుగాను ఎలా ప్రకటించగలము?—2 తిమో. 3:1-3.
2 యెహోవా సేవకులకు వ్యతిరేకత క్రొత్తదేమీ కాదు. తన దైవభక్తి నిమిత్తమై హేబెలు చంపబడినప్పటినుండి, యెహోవా సత్య ఆరాధికులు సాతాను గుంపుచే హింసననుభవిస్తున్నారు. అంతేకాకుండ యేసు శిష్యులు హింసింపబడతారని సూచించే అనేకమైన ప్రవచనాలు లేఖనాల్లో ఉన్నాయి. (మత్త. 23:34) ప్రాముఖ్యంగా ఈ యుగాంతంలో సాతాను ఈ భూపరిధిలోనే వున్నాడు గనుక, “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై” గర్జించు సింహమువలె ప్రవర్తిస్తూ, యెహోవా సేవకులలో సాధ్యమైనంతమందిని మ్రింగడానికి వెదకుచు తిరుగుచున్నాడు. (1 పేతు. 5:8; ప్రక. 12:12) అదే సమయంలో, మనం పరీక్షలననుభవించాల్సి ఉంటుందని ఎరిగినను, అనవసరంగా మనకై మనం హింసలో చిక్కుకోము లేదా సమస్యలను కొనితెచ్చుకోము. అందువల్లనే, మనలను వ్యతిరేకించే వారితో వ్యవహరించేటప్పుడు “పాములవలె వివేకులును . . . మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి,” అని యేసు ఉద్బోధించాడు. మనమెలా ఆవిధంగా ఉండగలం?—మత్త. 10:16.
3 యేసు మాదిరి: విశ్వంలో మొట్టమొదటి సువార్తికునిగా, ధైర్యం, నేర్పు విషయాల్లో యేసు మనకు ఎలాంటి మాదిరినుంచాడు? యెహోవా నియమాలనుండి స్వప్రయోజనం పొందుతూ, దాన్ని లాభార్జనకు ఒక మార్గంగా మలచిన వ్యాపారులను దేవాలయంలోనుండి వెళ్లగొట్టడానికి యేసు భౌతికంగా చర్యతీసుకున్న రెండు సందర్భాలు మీకు జ్ఞాపకమున్నాయా? (యోహా. 2:13-17; మత్త. 21:12, 13. మహాగొప్ప మనిషి పుస్తకంలోని 16, 103 అధ్యాయాలను చూడండి.) ఆరాధనలో వారు యథార్థంగా లేకపోవడంవల్ల, వారి వేషధారణవల్ల ఆయన పరిసయ్యులను, శాస్త్రులను ఎంత తరచుగా బహిరంగంగా నిందించాడంటే, కొన్నిసార్లు ఉపమానాలద్వారా, మరికొన్నిసార్లు అతి స్పష్టమైన మాటలతో నిందించాడు.—మత్త. 16:6, 12; 23 వ అధ్యాయము.
4 అదేరీతిలో ఈనాడు, మనం పరిచర్యలో ధైర్యంగా ఉండాలి. అబద్ధ ఆరాధనకు చెందిన వస్తువులను భౌతికంగా నాశనం చేయడానికి లేదా అలాంటి ఆరాధనలో భాగంవహించే వ్యక్తులను ఖండించడానికి మనకు అధికార మీయబడలేదనుట వాస్తవమే, అయినను అబద్ధమతాన్ని చీల్చిచెండాడుటలో దేవుని వాక్యాన్నుపయోగించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. (ఎఫె. 6:17; హెబ్రీ. 4:12) యెహోవాను ఆత్మతోను సత్యముతోను ఆరాధించడం ద్వారానే కేవలం మానవులు నిత్యజీవం పొందగలరని మనం ధైర్యంగా ప్రకటిస్తాం. మానవులను మెప్పించడం కొరకు మనం ఎన్నడూ దేవుని సందేశాన్ని విలువలేనిదిగా చేయం, లేదా అన్నిరకాల విశ్వాసాల్లో పాలుపంచుకొనే కార్యకలాపాల్లో భాగంవహించడంద్వారా లేదా ఏవిధంగానైనా అబద్ధ ఆరాధనకు మద్దతునివ్వడంద్వారా మన విశ్వాసంతో రాజీపడం. మనతో ఏకీభవించని వ్యక్తులతో ఈ ధైర్యం తరచూ వివాదంలోకి దించుతుంది. అప్పుడేం చేయాలి?
5 నేర్పుగా ఉండుట: మరొకసారి, మనం యేసు మాదిరిని పరిశీలిద్దాం. సబ్బాతు దినమున ఊచచేయిగలవానిని బాగుచేయునేమో అని శాస్త్రులు, పరిసయ్యులు దుర్బుద్ధితో కనిపెడుతున్నారని యేసు ఎరిగిన సంఘటనను గుర్తుచేసుకోండి. యేసు ఆ మనుష్యుని యూదుల సభ “మధ్యకు” ధైర్యంగా పిలిచి, స్వస్థపర్చలేదా? అయితే అప్పుడు వారు “వెఱ్ఱి కోపముతో” నిండుకొని, యేసును ఏమి చేయుదుమా అని యొకనితో నొకడు మాటలాడుకొనుచున్నారని యేసు ఎరిగినప్పుడు, హింసింపబడుటకు తాను సంసిద్ధంగా ఉండాలని ఆలోచిస్తూ ఆయన అక్కడే ఉన్నాడా? లేదు! “యేసు అచ్చటనుండి వెళ్లిపోయెను.”—మత్త. 12:14-17; లూకా 6:6-11. మహాగొప్ప మనిషి పుస్తకంలోని 32, 33 అధ్యాయాలను కూడ చూడండి.
6 ఆ తర్వాత, దేవాలయంలో పరిసయ్యులతో, వారు తమ తండ్రియైన అపవాది సంబంధులని వారిని దృఢంగా నిందించిన సమయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోగలరా? వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తగా, యేసు గర్వంగా నిలబడి, రాళ్లతో కొట్టబడడానికి తనకుతాను అనుమతించలేదు. బదులుగా, యేసు దాగి, ఆ తర్వాత దేవాలయమును విడిచి బయటికి వెళ్లిపోయాడు. (యోహా. 8:37-59) యెహోవాతో తనకుగల సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించినప్పుడు, యూదులు “కొట్టవలెనని రాళ్లు చేతపట్టు” కున్న సందర్భం విషయమేమి? ఆయన వారితో తర్కించాలని ప్రయత్నించాడు, కాని వారు “కొట్టవలెనని మరలా రాళ్లు చేత పట్టుకొనగా” తానక్కడనుండి పారిపోవడం తన హోదాకు తగిందికాదని తలంచలేదుగాని, ఆయన “వారి చేతినుండి తప్పించుకుని” పారిపోయాడు. వాస్తవానికి ఆ సందర్భంలో ఆ ప్రాంతాన్ని మొత్తానికి విడిచిపెట్టడం మంచిదని ఆయన తలంచాడు.—యోహా. 10:24-42; మత్త. 10:23 ను పోల్చండి. మహాగొప్ప మనిషి పుస్తకంలోని 69, 81 అధ్యాయాలను చూడండి.
7 మన ప్రాంతంలో: రాజ్య సువార్తను ప్రకటించడంలో మనం యేసు అడుగుజాడలను అనుకరిస్తుండగా, మనం ఎంత నేర్పుగా మన సందేశాన్ని అందించినప్పటికి, మన పనికి అభ్యంతరం తెల్పే గృహస్థులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన విశ్వాసాన్ని గౌరవప్రదంగా వివరించినప్పుడు ఆ వ్యక్తి దృక్పథంలో మార్పులేనట్లైతే, మర్యాదగా సంభాషణను ఆపి, తర్వాతి ఇంటికి వెళ్లడం సాధారణంగా మంచిది.—మత్త. 10:14.
8 అయినను అప్పుడప్పుడు, తలుపుదగ్గరే అరవడం ప్రారంభించే ఎవరొకర్ని మనం కలుసుకుంటాం. అలాంటి పరిస్థితిలో ఆ ప్రాంతాన్ని ఆరోజుకు విడిచిపెట్టి, ఆ తర్వాత వారి పొరుగువారిని సందర్శించడానికి తిరిగివెళ్లవచ్చును. మరి అలాంటి అనుభవం అదే ప్రాంతంలో అనేకసార్లు మనం పొందితే ఏంచేయాలి? బహుశ బెదిరించడానికి గుంపుగా కూడి, మనకు హాని చేయాలని దూషిస్తున్నట్లైతే? అల్లరి సద్దుమణిగే వరకూ కొన్ని వారాలు, ఒకవేళ కొన్ని నెలల వరకు ఆ ప్రాంతంలో ప్రకటించడం మానివేయడం జ్ఞానయుక్తమై యుంటుంది. ఆ వ్యక్తుల దృక్పథం మారి, ఒకవేళ వారు మన సందేశం యెడల మరెక్కువ అనుకూలంగా ఉన్నారాయని చూడడానికి కొంతకాలం తర్వాత జాగ్రత్తగా సేవచేయడానికి మనం ప్రయత్నించవచ్చు.—ప్రత్యేకంగా సందర్శించవద్దని చెప్పిన వ్యక్తులున్నచోట, లేదా అలాంటి ఉద్దేశంతోనే తమ తలుపులపై సూచనలు అంటించినచోట ఎలా వ్యవహరించాలనే విషయంలో సలహాల కొరకు, మనరాజ్య పరిచర్య ఈ సంచికలోని ప్రశ్నా భాగాన్ని చూడండి.
9 ప్రారంభంలోనే కేవలం మనం ఎక్కువ నేర్పుగా ఉండటంద్వారా తరచూ అలాంటి సంఘటనలకు దూరంకావచ్చు. అనేకమంది ప్రజలు తమ స్వంత మతానికి మద్దతునిచ్చుటలో ఎక్కువ పోరాడుతున్నారని మనకు తెలుసు. అలాంటి వ్యక్తులు అధికంగా ఉన్న ప్రాంతాలు మనకు తెలిసినట్లైతే, లేదా మతాన్ని ప్రకటిస్తూ, పొగడుతూ వున్న అనేక నినాదాలు, స్టిక్కర్లను మనం గమనించినప్పుడు, మనం బహుజాగ్రత్తగా మన మాటలను తూచి చెప్పాల్సి ఉంటుంది. ‘బైబిలు’ లేదా ఒక ‘క్రైస్తవ’ సంస్థనుండి వస్తున్నామని మనకై మనం పరిచయం చేసుకోవడానికి బదులు, మన సేవయొక్క విద్యాసంబంధ స్థితిని మనం ఉన్నతపర్చవచ్చు. దేవుని వాక్యాన్ని చూపెట్టడాన్ని, దాన్ని చదవడాన్ని మనమెన్నడూ విడిచిపెట్టనప్పటికి, బైబిలును ఉపయోగించాలా, ఏ లేఖనాలను చూపెట్టాలి, యింకా అలాంటివేవైనా వుంటే వాటిని పరిస్థితులకు అనుగుణంగా మనం చేయవచ్చు. ఆలాగే వాళ్లను నొప్పిస్తాయని మనకు తెలిసిన పదాలను అంటే ‘మిషనరీ,’ ‘సువార్తప్రకటన,’ ప్రాముఖ్యంగా ‘మారుమనస్సు’ అనే పదాలను కూడ మనం అనవసరంగా ఉపయోగించకుండా ఉండాలి.
10 మనం జాగ్రత్తవహించాల్సిన మరొక విషయానికి ఇది మనలను తెస్తుంది. ప్రవచించినట్లుగా, అన్ని వర్గాలనుండి, భాషలనుండి, రాష్ట్రాలనుండి—మతాలనుండి ప్రజలు, మహిమపర్చబడిన యెహోవా ఆరాధనకు ప్రవాహంలా వస్తున్నారు. (యెష. 2:2, 3; ప్రక. 7:9) మనం దీనిని ఆయన ఆశీర్వాదానికి సూచనగా భావించి, ఒంటరియైనవాడు వేయిమందిగా, ఎన్నికలేనివాడు బలమైన జనముగా తయారగుచుండగా మనం ఆనందిస్తాము. (యెష. 60:22) అదే సమయంలో, సత్యారాధన పక్షానికి వచ్చిన వారెవరైనా తమ గత మత పూర్వరంగాలను ఎక్కువగా ప్రస్తావించవలసిన పనిలేదు.
11 సాధారణంగా అనేకమంది సహోదరులు ఇంటింటి సేవలోను మరితర స్థలాల్లోను క్రొత్త ప్రచారకులను పరిచయం చేస్తూ, ప్రత్యేకంగా వారి పాత మతాన్ని గూర్చి వివరిస్తూ, వారు చేసుకున్న మార్పుపై గృహస్థుని అవధానాన్ని మళ్లిస్తుంటారు. ఇది గృహస్థుడు అభ్యంతరపడడానికి కారణమై, మన ఉద్దేశం కేవలం ఒక ప్రత్యేక మతమున్న వ్యక్తులను క్రైస్తవత్వానికి ‘మార్పిడి’ చేయడమే అనే అభిప్రాయాన్నివ్వగలదు. దేవుడు పక్షపాతికాడు—తమ గత మతమేదైనప్పటికి, అందరికీ నిరీక్షణా సందేశాన్ని ఆయన అందిస్తున్నాడు, మరి అన్ని జాతులవారు దానిని అంగీకరిస్తున్నారు. (అపొ. 10:34, 35) ఎవరైనా ఒకరు యెహోవా ఆరాధికునిగా తయారైతే మనం ఆనందిస్తాం, మరి అతని గత మతమేదైనప్పటికీ అతనిని మనం ఆహ్వానిస్తాం, కాని అతని పాత మతాన్ని, ఆయన చేసుకున్న మార్పుల గొప్పతనాన్ని ఏదో ఒక ప్రత్యేకమైందిగా విస్తారంగా ప్రకటించాల్సిన పనిలేదు.
12 అంతము సమీపించిన కొలది, మనం మరెక్కువగా హింసింపబడతామనీ, మనుష్యుల ప్రవర్తన దిగజారిపోతుందని ఎదురుచూడగలం. (2 తిమో. 3:12, 13) మన సహ దాసులైన వారనేకమంది చరిత్రంతటిలో విజయవంత మయ్యారనే విషయం, ఆలాగే మనం కూడా యెహోవా ఆత్మ సహాయంతో చేయగలమనే విశ్వాసాన్ని మనకు ఇస్తుంది. ఈలోగా మనం ధైర్యంగాను, నేర్పుగాను సువార్త ప్రకటించడంద్వారా, “సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప” ను ప్రకటించుటలో కొనసాగుదాము.—తీతు 2:11.