దేవుని సంస్థతో సహవసించడానికి బైబిలు విద్యార్థులకు సహాయపడుట
1 లోక రాజకీయాలు, మతాలు, వ్యాపార సంస్థల నుండి వేరుగా ఉండి ఆయన ఇష్టాన్ని పూర్తిగా నిర్వహించడానికి యెహోవాకు ఒకే సంస్థ ఉంది. బైబిలును అర్థం చేసుకుని, దేవుని సంకల్పాన్ని గూర్చిన అంతర్భావాన్ని సంపాదించడమే కాక, యెహోవా దేవుని భూసంస్థను గూర్చి, దాని పనిని గూర్చి బైబిలు విద్యార్థులు అర్థం చేసుకోవడానికి, వారు దానిలోనికి నడిపించబడడానికి సహాయం చేయవలసిన బాధ్యత ఈ సంస్థకుంది.
2 అయినను క్రైస్తవత్వంతో పరిచయం లేని ప్రజలకు, ఒక “సంస్థ”లో చేరినప్పుడు ఎక్కువ ఒత్తిళ్ళు, బాధ్యతలతో వ్యవహరించ వలసి వస్తుందని భావించే ప్రజలకు దేవుని సంస్థను గూర్చి బోధించడం అంత సులభమైన పని కాదు. అంతేకాక, ఇతర కొత్త మతాల వంటిదే యెహోవా సాక్షుల మతమని, రక్తాన్నిగూర్చిన వివాదాంశంతో సహా యెహోవాసాక్షుల సిద్ధాంతాలను గూర్చి ప్రతికూలభావం గల ప్రజలకు సంస్థను గూర్చి వివరించడం కష్టమని భావించే ప్రచారకులు ఉండవచ్చు. అందుకే సంస్థను గూర్చి చాలా వివరంగా చెప్పిన తర్వాత కూడా విద్యార్థిపై ఏ ప్రభావం కలుగక, అతడు కూటాలకు హాజరు కాకుండా, తగిన చర్యలు తీసుకోకుండా ఉండే సందర్భాలు రావచ్చు.
3 విద్యార్థి అభివృద్ధిని, గతాన్ని పరిగణించండి: బైబిలు విద్యార్థుల్లో చాలా మందికి బైబిలుపై, క్రైస్తవత్వంపై ఉన్న ఆసక్తికన్నా ముఖ్యంగా పిల్లలకు తర్ఫీదివ్వడానికి, కుటుంబ జీవితాన్ని గూర్చి నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నందు వల్లే గృహ బైబిలు పఠనానికి ఒప్పుకున్నారు. ఇశ్రాయేలీయుల చరిత్రతో ప్రారంభమయ్యే, జెహోవాస్ విట్నెసెస్-డూయింగ్ గాడ్స్ విల్ అనే బ్రోషూర్‌ను వారితో చదవడం వలన ఈ ప్రజలనుండి ఎక్కువ ఫలితాలు ఆశించడం అత్యాశే అవ్వవచ్చు. అలాంటప్పుడు, మానవులు సంతోషకరమైన కుటుంబ జీవితం గడపాలనే ఉద్దేశంతో దేవుడు మానవజాతిని సృష్టించాడు, మానవజాతికి “మార్గదర్శి”గా బైబిలు ఇచ్చాడని వివరించడానికి మొదట్లో కొంత సమయం గడిపితే అది మరింత ఫలభరితంగా ఉంటుంది. మరొకవైపు, తమ చర్చీని యెహోవాసాక్షుల సంస్థతో పోల్చి, ఏది ఎక్కువగా తొలి శతాబ్దపు క్రైస్తవ సంఘంతో సారూప్యం కలిగి ఉందో తీర్మానించడానికి క్రైస్తవ మతసామ్రాజ్యంలోని ఏదొక చర్చీకి చెందిన వ్యక్తులకు సహాయపడవచ్చును.
4 అందువలన, నిర్వాహకుడు, విద్యార్థి మతసంబంధమైన గతాన్ని పరిగణలోనికి తీసుకుంటే జెహోవాస్ విట్నెసెస్-డూయింగ్ గాడ్స్ విల్ అనే బ్రోషూర్‌ను మొదట్లోనే ఉపయోగించాలో, లేదా గృహ బైబిలు పఠనం కొంత కాలం కొనసాగిన తర్వాత సముచితమైన సమయాన్ని ఎంపిక చేసి ఆ బ్రోషూర్నుండి ప్రారంభించాలో తీర్మానించగలడు.
5 లేదా జెహోవాస్ విట్నెసెస్ ఇన్ ది ట్వెంటీయత్ సెంచరీ అనే బ్రోషూరో, రీజనింగ్ పుస్తకంలోని “జెహోవాస్ విట్నెసెస్,” అనే శీర్షిక కింద ఉన్న భాగమో ఉపయోగించడానికి మీరు కోరుకోవచ్చు. యెహోవాసాక్షుల పరిచర్య ప్రపంచవ్యాప్త బైబిలు విద్యాభ్యాస కార్యక్రమమని, ప్రజలు బైబిలును స్వచ్ఛమైన విధంగా నేర్చుకొనుటకు సహాయపడే గుంపని మీ విద్యార్థి ఇతరులతో ఆత్మ విశ్వాసంతో చెప్పగల్గునట్లు అతనికి సహాయపడండి.
6 తర్వాత వివిధ కూటాలు, సమావేశాల విషయాలు, ఉద్దేశాలు, వాటికి హాజరయ్యే వారికి కల్గే ప్రయోజనాలు సులభంగా మీ విద్యార్థికి అర్థమయ్యే విధంగా వివరించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు విద్యార్థి నేర్చుకొనే సత్యం బైబిలు ఆధారితమైనది, దాన్ని లోకంలోని పుస్తకాలనుండి నేర్చుకోలేరు. అలాగే, కూటములు, బైబిలులో ఆసక్తి ఉన్నవారి కొరకు యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక బైబిలు విద్యాభ్యాస కార్యక్రమాలైయున్నాయి. కాబట్టి, కూటాలనుగూర్చి కేవలం పైపై విషయాలు చెప్పడంతోనే సంతృప్తిపడక, కూటాలకు వచ్చే ప్రజలనుగూర్చి, కూటాలనుండి లభించే ప్రయోజనాలను గూర్చి, కూటాలను వివిధ కోణాలనుండి వివరించండి. మీరింతవరకూ నేర్చుకున్నవాటి, అనుభవించినవాటి ఆధారంగా సజీవంగా చర్చించండి.
7 ఆకర్షణీయమైన చిత్రాలు: పత్రికలోని, లేదా బ్రోషూరులోని చిత్రాలవైపు మీ విద్యార్థి అవధానాన్ని మళ్ళించి, మీరు చెప్పాలనుకున్న అంశం అతనిపై గట్టి ముద్రవేసేలా కృషి చేయండి. విద్యార్థి చిత్రాలను చూసినప్పుడు అతనికి కల్గే భావాలను వ్యక్తపరచడానికి ప్రోత్సహించండి. అనేక మందిని యెహోవా సంస్థలోనికి నడిపించిన ఫలవంతులైన చాలామంది ప్రచారకులు, ఆ లక్ష్యంతో తాము తయారు చేసిన ఆల్బమ్‌లను ఉపయోగిస్తారు.
8 సాధ్యమైనంత త్వరగా మీ విద్యార్థి యెహోవా ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకొనుటకు ఏర్పాటు చేయండి. రాజ్యమందిరములోను, సమావేశాల్లోను అతనికి యెహోవా సాక్షులతో దగ్గరి సంబంధాన్ని కల్గి ఉండే ఏర్పాటు చేయండి, అలాగే యెహోవా ప్రజలు బైబిలును నమ్మి, తమ మెప్పునుబట్టి యెహోవా మార్గాల్లో నడిచే సామాన్యులైన ప్రజలని తెలుసుకోవడానికి అతనికి సహాయం చేయండి. కూటములకు రాజ్యమందిరాన్ని ఉపయోగించని సమయంలో దానిని చూపించి, అది ఎలాంటి స్థలమో వివరిస్తే అదెంతో ఫలప్రదంగా ఉంటుంది. సాధ్యమైతే బేతేలును సందర్శించమని అతనిని ప్రోత్సహించండి.
9 అంతేకాక, యోగ్యులైన మీ స్నేహితులను పఠనమునకు ఆహ్వానించి, యెహోవా ప్రజలు అనుభవించే సంతోషమును వివరించనివ్వండి. ఉదాహరణకు, యౌవనస్థుడైన ఒక ప్రచారకున్ని యెహోవా సంస్థ ఏర్పాటు చేసిన విద్యాభ్యాస కార్యక్రమం ఎలా సహాయకరంగా ఉందో చెప్పమనండి. ఒక కుటుంబ శిరస్సు తన ఇప్పటి ప్రవర్తనను, సాక్షి కాక ముందటి ప్రవర్తనను పోల్చి చూస్తే, తండ్రిగా, భర్తగా తానెలా మారాడో వివరిస్తే, విద్యార్థి, యెహోవాసాక్షులకు, వారి సంస్థకు మరింత దగ్గరి వాడుగా భావించవచ్చు.
10 ఇప్పటివరకూ చేస్తున్నట్లుగానే, పఠనానికి ముందు లేదా తర్వాతనో 10-15 నిమిషాలు చర్చించి, యెహోవా సంస్థ రూపురేఖలను గూర్చి అర్థం చేసుకొనుటకు విద్యార్థికి సహాయపడండి. అంతేకాక, యెహోవా సంస్థను చూసి, దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడులాగున యెహోవా ప్రజలతో సహవసించే సందర్భాలను క్రమేణ వృద్ధిచేయడానికి వివిధ అవకాశాలను ఉపయోగించండి. మీరిలా చేస్తే, విద్యార్థి యెహోవా భూసంస్థను, దాని పనులను అర్థం చేసుకొని, మనతోపాటు యెహోవాను స్తుతించేవాడవుతాడు.