కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w19 ఏప్రిల్‌ పేజీలు 26-30
  • ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ మేము కనుగొన్నాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ మేము కనుగొన్నాం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ద్వీపాలన్నీ సంతోషించుగాక’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
w19 ఏప్రిల్‌ పేజీలు 26-30
యౌవనులుగా ఉన్నప్పుడు విన్‌స్టన్‌, ప్యామ్‌లు సముద్రం ఒడ్డున బండ మీద కూర్చున్న చిత్రం

జీవిత కథ

‘ఎంతో విలువైన ముత్యాన్ని’ మేము కనుగొన్నాం

విన్‌స్టన్‌, పామల పేన్‌ చెప్పినది

విన్‌స్టన్‌, పామల (ప్యామ్‌) పేన్‌ ఆస్ట్రలేషియా బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్నారు. వాళ్ల జీవితం ఎంతో సంతోషంగా సాగినప్పటికీ వాళ్లు కొన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. వాళ్లు రకరకాల సంస్కృతులకు అలవాటు పడాల్సి వచ్చింది, గర్భంలోనే బిడ్డను పోగొట్టుకున్న దుఃఖాన్ని దిగమింగాల్సి వచ్చింది. అయినా యెహోవా మీద, ఆయన ప్రజల మీద వాళ్లకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు పరిచర్యలో కూడా వాళ్లు సంతోషాన్ని కోల్పోలేదు. ఈ ఇంటర్వ్యూలో, వాళ్లకు ఎదురైన కొన్ని అనుభవాల్ని మాతో పంచుకోమని ఆహ్వానించాం.

విన్‌స్టన్‌, మీరు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో మాకు చెప్తారా?

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఒక పొలంలో మా ఇల్లు ఉండేది. మా ఇంట్లో వాళ్లెవ్వరికీ మతం మీద ఆసక్తి ఉండేది కాదు. మేము ఎక్కడికీ వెళ్లేవాళ్లం కాదు కాబట్టి, నా కుటుంబ సభ్యులతో తప్పా ఇంకెవ్వరితో నాకు పరిచయం ఉండేది కాదు. నాకు సుమారు 12 ఏళ్లు ఉన్నప్పుడు, దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. నాకు తన గురించిన సత్యం తెలియజేయమని దేవునికి ప్రార్థించాను. కొంతకాలానికి నేను మా ఇంటిని వదిలి, దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ అనే ప్రాంతానికి వెళ్లాను. అక్కడే నాకు ఉద్యోగం దొరికింది. నా 21వ ఏట, సరదాగా సమయం గడపడానికి సిడ్నీకి వెళ్లినప్పుడు ప్యామ్‌ని కలిశాను. ఆమె నాకు బ్రిటీష్‌-ఇజ్రాయిల్‌ అనే మత గుంపు గురించి చెప్పింది. తప్పిపోయిన ఇశ్రాయేలు గోత్రాల వంశస్థులు బ్రిటీష్‌వాళ్లేనని ఆ గుంపు నమ్మేది. అంతేకాదు క్రీ.పూ. 8వ శతాబ్దంలో చెరగా తీసుకోబడిన ఉత్తర రాజ్యానికి చెందిన పది గోత్రాలే ఆ తప్పిపోయిన ఇశ్రాయేలు గోత్రాలని ఆ గుంపువాళ్లు చెప్పేవాళ్లు. కాబట్టి, నేను అడిలైడ్‌కి తిరిగొచ్చినప్పుడు నా తోటి ఉద్యోగితో ఆ విషయం గురించి మాట్లాడాను, అతను అప్పటికే యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకుంటున్నాడు. మేము ముఖ్యంగా యెహోవాసాక్షుల నమ్మకాల గురించి మాట్లాడుకున్నాం. నేను అతనితో కొన్ని గంటలు మాట్లాడిన తర్వాత, నేను చిన్నప్పుడు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని నాకు అర్థమైంది. నా సృష్టికర్త గురించిన, ఆయన రాజ్యం గురించిన సత్యాన్ని తెలుసుకున్నాను! నేను, ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కనుగొన్నాను.—మత్త. 13:45, 46.

ప్యామ్‌, మీరు కూడా చిన్నవయసులోనే ఆ ముత్యాన్ని వెదకడం మొదలుపెట్టారు కదా, మరి మీరెలా కనుగొన్నారు?

నేను న్యూ సౌత్‌ వేల్స్‌లోని కోఫస్స్‌ హార్బర్‌ అనే పట్టణంలో పెరిగాను. మా కుటుంబానికి మతం మీద ఆసక్తి ఉండేది. మా తల్లిదండ్రులు, అమ్మమ్మ-తాతయ్య బ్రిటీష్‌-ఇజ్రాయిల్‌ గుంపు బోధల్ని నమ్మేవాళ్లు. మా తమ్ముడు, అక్క, నేనూ, ఇంకొంతమంది బంధువులం (మా అమ్మ తరఫువాళ్లు), దేవుడు బ్రిటీష్‌ వంశస్థులను ప్రత్యేకంగా చూస్తాడనే బోధ వింటూ పెరిగాం. కానీ నేను దాన్ని నమ్మలేదు, అంతేకాదు నాలో ఆధ్యాత్మికంగా ఏదో వెలితి ఉన్నట్టు అనిపించేది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు ఆంగ్లికన్‌, బాప్టిస్ట్‌, సెవెంత్‌ డే అడ్వెంటిస్ట్‌ చర్చీలతో సహా స్థానికంగా ఉన్న చాలా చర్చీలకు వెళ్లాను. అయినా నా ఆధ్యాత్మిక ఆకలి తీరలేదు.

కొంతకాలానికి మా కుటుంబమంతా సిడ్నీకి వెళ్లిపోయాం. అక్కడే నేను విన్‌స్టన్‌ని కలిశాను. అతను అక్కడికి కొన్నిరోజులు సరదాగా గడపడానికి వచ్చాడు. విన్‌స్టన్‌ ఇందాక చెప్పినట్టు, మతం గురించి మేము అప్పట్లో మాట్లాడుకున్న విషయాల కారణంగా అతను కొంతకాలానికి యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతను నాకు రాసిన ఉత్తరాల్లో ఎక్కువ లేఖనాలే ఉండేవి! నిజం చెప్పాలంటే, మొదట్లో విన్‌స్టన్‌ చెప్పేవాటికి నేను కంగారుపడ్డాను, కోపం కూడా వచ్చింది. కానీ మెల్లమెల్లగా, అదే సత్యమని గుర్తించాను.

1962లో నేను విన్‌స్టన్‌కు దగ్గరగా ఉండాలని అడిలైడ్‌కు వెళ్లిపోయాను. యెహోవాసాక్షులైన థామస్‌, జానస్‌ స్లోమన్‌ అనే దంపతుల ఇంట్లో నేను ఉండేలా విన్‌స్టన్‌ ఏర్పాటు చేశాడు. వాళ్లిద్దరూ పాపువా న్యూగినిలో మిషనరీలుగా సేవచేశారు. వాళ్లు నా మీద ఎంతో దయ చూపించారు. నాకు అప్పుడు 18 ఏళ్లే, నేను యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవడానికి వాళ్లు చాలా సహాయం చేశారు. దాంతో నేను కూడా బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాను. కొంతకాలానికే, సత్యాన్ని కనుగొన్నాననే నమ్మకం కుదిరింది. విన్‌స్టన్‌, నేనూ పెళ్లి చేసుకున్న వెంటనే పూర్తికాల సేవ మొదలుపెట్టాం. మాకు కొన్ని కష్టాలు ఎదురైనా, ఆ సేవవల్ల ఎన్నో దీవెనలు పొందాం. అంతేకాదు మాకు దొరికిన ముత్యం పట్ల కృతజ్ఞత కూడా పెరిగింది.

విన్‌స్టన్‌, యెహోవా సేవలో మీ తొలి అనుభవాల్ని చెప్తారా?

విన్‌స్టన్‌ ప్రాంతీయ సేవలో ఉన్నప్పుడు ప్రయాణించిన ప్రాంతాల మ్యాప్‌; కొన్ని ద్వీపాలకు చెందిన పోస్టల్‌ స్టాంపులు; తువాలులో ఉండే ఫూనాఫూటీ ద్వీపం

A. మేము ప్రాంతీయ సేవలో తిరిగిన ద్వీపాల మ్యాప్‌

B. కొన్ని ద్వీపాల పోస్టల్‌ స్టాంపులు. అంతకుముందు కిరిబాటిని గిల్బర్ట్‌ ద్వీపమని, తువాలుని ఎల్లిస్‌ ద్వీపమని పిలిచేవాళ్లు

C. తువాలులో ఉండే ఒక అందమైన ద్వీపం, ఫూనాఫూటీ ద్వీపం. మిషనరీల్ని నియమించకముందు మేము వెళ్లిన చాలా ద్వీపాల్లో అది ఒకటి

మా పెళ్లయిన కొంతకాలానికే, యెహోవా తన సేవలో మాకు ప్రత్యేక నియామకాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. (1 కొరిం. 16:9) మా చిన్న సంఘానికి ప్రాంతీయ పర్యవేక్షకునిగా వచ్చే జాక్‌ పోర్టర్‌ అనే సహోదరుడే మొదటి నియామకానికి మార్గం చూపించాడు. (ఇప్పుడు ఆయన నాతోపాటు ఆస్ట్రలేషియా బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్నాడు.) జాక్‌, అతని భార్య రోజ్‌లిన్‌ మమ్మల్ని క్రమ పయినీరు సేవ చేయమని ప్రోత్సహించారు. ఐదు సంవత్సరాలు మేము ఆ సేవలో ఆనందించాం. నాకు 29 ఏళ్లు ఉన్నప్పుడు నన్నూ, ప్యామ్‌ని దక్షిణ పసిఫిక్‌ ద్వీపాల్లో ప్రాంతీయ సేవకు నియమించారు. అప్పట్లో అది ఫిజి బ్రాంచి పర్యవేక్షణలో ఉండేది. ఆ ద్వీపాలు ఏవంటే: అమెరికన్‌ సమోవా, కిరిబాటి, టోకలావూ, టోంగా, నావోరూ, న్యూయి, తువాలు, వనౌటు, సమోవా.

ఆ రోజుల్లో, కొన్ని మారుమూల ద్వీపాల్లో ఉండే ప్రజలు యెహోవాసాక్షుల్ని అనుమానంగా చూసేవాళ్లు. అందుకే మేము జాగ్రత్తగా, వివేచనతో ఉండాల్సి వచ్చింది. (మత్త. 10:16) అక్కడ సంఘాలు చిన్నవి, కొన్ని సంఘాల్లో సహోదరసహోదరీలు మాకు వసతి ఏర్పాటు చేయలేని స్థితిలో ఉండేవాళ్లు. అందుకే స్థానిక ప్రజల్ని అడిగి, వాళ్ల ఇళ్లలో ఉండేవాళ్లం. ఆ ప్రజలు మాపట్ల ఎప్పుడూ దయ చూపించేవాళ్లు.

విన్‌స్టన్‌, మీకు అనువాద పనంటే చాలా ఆసక్తి కదా, దేనివల్ల మీకు ఆ ఆసక్తి కలిగింది?

సమోవాలో సంఘపెద్దల పాఠశాల నిర్వహిస్తున్న విన్‌స్టన్‌ పేన్‌

సమోవాలో సంఘపెద్దల పాఠశాల నిర్వహిస్తూ

ఆ రోజుల్లో, టోంగా ద్వీపంలో ఉండే సహోదరుల దగ్గర టోంగన్‌ భాషలో కేవలం కొన్ని కరపత్రాలు, చిన్న పుస్తకాలే ఉండేవి. వాళ్లు బైబిలు స్టడీలు చేసేటప్పుడు ఇంగ్లీష్‌లో ఉండే నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని ఉపయోగించేవాళ్లు. కాబట్టి, నాలుగు వారాలపాటు జరిగిన సంఘపెద్దల పాఠశాల సమయంలో, కొద్దోగొప్పో ఇంగ్లీషు వచ్చిన ముగ్గురు స్థానిక పెద్దలు సత్యము పుస్తకాన్ని టోంగన్‌ భాషలోకి అనువదించడానికి ఒప్పుకున్నారు. వాళ్లు చేత్తో అనువదించినదాన్ని ప్యామ్‌ టైప్‌ చేసింది. మేము దాన్ని ప్రింటింగ్‌ కోసం అమెరికా బ్రాంచికి పంపించాం. పుస్తకమంతా అనువదించడానికి దాదాపు ఎనిమిది వారాలు పట్టింది. ఆ అనువాదం అంత బాగా లేకపోయినా, టోంగన్‌ భాష మాట్లాడే చాలామంది సత్యం నేర్చుకోవడానికి అది సహాయం చేసింది. నేనూ, ప్యామ్‌ అనువాదకులం కాకపోయినా ఆ అనుభవం వల్లే ఈ పనిమీద ఆసక్తి పెరిగింది.

ప్యామ్‌, ఆస్ట్రేలియాలో ఉన్న జీవితంతో పోలిస్తే ద్వీపాల్లో మీ జీవితం ఎలా అనిపించింది?

ఒక బస్సు పక్కన నిలబడివున్న విన్‌స్టన్‌, ప్యామ్‌లు, ప్రాంతీయ సేవలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో వాళ్ల ఇల్లు ఇదే

ప్రాంతీయ సేవలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో మా ఇల్లు ఇదే

అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది! కొన్నిచోట్ల ఎక్కువ దోమలతో బాగా వేడితో, ఉక్కపోతతో, ఎలుకలతో, అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాం. కొన్నిసార్లు సరిపడా ఆహారం ఉండేది కాదు. కానీ, రోజూ సాయంత్రం మా ఇంట్లో నుండి మహాసముద్రం వైపు చూసినప్పుడు సేదదీర్పుగా అనిపించేది. మా ఇంటికి గడ్డితో చేసిన పైకప్పు ఉండేది, చుట్టూ గోడలు ఉండేవి కావు. అలాంటి ఇళ్లను సమోవన్‌లో ఫేల్‌ అని పిలుస్తారు. కొన్నిసార్లు చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉండేవాడంటే, ఆ వెన్నెల్లో కొబ్బరి చెట్లు స్పష్టంగా కనిపించేవి. అలాగే చంద్రుని ప్రతిబింబం మహాసముద్రం నీళ్ల మీద కనిపించేది. ఆహ్లాదకరమైన ఆ క్షణాల్లో మేము ధ్యానించేవాళ్లం, ప్రార్థించేవాళ్లం. అది ప్రతికూల విషయాల గురించి కాకుండా మంచి విషయాల గురించి ఆలోచించేలా మాకు సహాయం చేసింది.

అక్కడి పిల్లలు చాలా సరదాగా ఉండేవాళ్లు, వాళ్లంటే మాకు ఇష్టం. తెల్ల జాతీయులైన మమ్మల్ని చూసినప్పుడు వాళ్లు చాలా కుతూహలంతో ఉండేవాళ్లు. ఒకసారి న్యూయి ద్వీపాన్ని సందర్శించినప్పుడు ఒక పిల్లవాడు వచ్చి, విన్‌స్టన్‌ చేతికున్న వెంట్రుకల్ని నిమురుతూ, “నీ ఈకలు బాగున్నాయి” అన్నాడు. ఆ పిల్లవాడు, వెంట్రుకలున్న చేతుల్ని ముందెప్పుడూ చూడలేదు కాబట్టి వాటిని ఏమనాలో అతనికి తెలియలేదు!

ప్రజలు ఎంత పేదరికంలో జీవిస్తున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో చూసినప్పుడు మాకు చాలా బాధనిపించింది. వాళ్ల చుట్టూ అందమైన వాతావరణం ఉండేది గానీ మంచి వైద్య సదుపాయాలు, సరిపడా మంచినీరు ఉండేవి కావు. అయినా సహోదరులు ఆందోళనపడేవాళ్లు కాదు. ఎందుకంటే అది వాళ్లకు మామూలే. వాళ్ల కుటుంబ సభ్యులు వాళ్లతో ఉన్నందుకు, వాళ్లకు ఆరాధన కోసం ఒక స్థలం ఉన్నందుకు, వాళ్లు యెహోవాను స్తుతించగలుగుతున్నందుకు సంతోషపడేవాళ్లు. వాళ్ల ఆదర్శం వల్ల మేము అత్యంత ప్రాముఖ్యమైన వాటిమీద మనసుపెట్టగలిగాం, మా జీవితాన్ని సాదాసీదాగా ఉంచుకోగలిగాం.

ప్యామ్‌, కొన్నిసార్లు మీరే నీళ్లను తెచ్చుకొని పూర్తిగా కొత్త పరిస్థితుల్లో వంట చేసుకోవాల్సి వచ్చేది కదా, దాన్ని మీరెలా చేయగలిగారు?

టోంగాలో, టబ్బు బకెట్‌ సహాయంతో బట్టలు ఉతుకుతున్న ప్యామ్‌

టోంగాలో మా బట్టలు ఉతుకుతున్న ప్యామ్‌

ఈ విషయంలో నేను మా నాన్నకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మంట ఎలా వెలిగించాలో, దానిమీద వంట ఎలా చేయాలో, తక్కువ వస్తువులతో ఎలా జీవించాలో వంటి ఎన్నో ఉపయోగపడే పనులు నాన్న నాకు నేర్పించాడు. మేము ఒకసారి కిరిబాటిని సందర్శించినప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉన్నాం. దానికి గడ్డితో చేసిన పైకప్పు, గులకరాళ్లు పేర్చిన నేల, వెదురు బొంగులతో చేసిన గోడలు ఉన్నాయి. నేను వంట చేయడం కోసం ముందు ఒక గుంట తవ్వి, కొబ్బరి పీచును దానిలో పెట్టి మంట వెలిగించాను. నీళ్ల కోసం అక్కడి స్త్రీలతో పాటు బావి దగ్గర లైన్లో నిలబడ్డాను. అక్కడి ప్రజలు నీళ్లు తోడుకోవడానికి, సుమారు ఆరు అడుగుల కర్రకు ఒక సన్నని తాడు కట్టేవాళ్లు, అది చూడ్డానికి చేపలుపట్టే గాలంలా ఉండేది. అయితే ఆ తాడు చివర కొక్కెం బదులు ఒక క్యాన్‌ను కట్టేవాళ్లు. ఆ స్త్రీలలో ప్రతీ ఒక్కరు తమ వంతు వచ్చినప్పుడు కర్రకు కట్టిన ఆ క్యాన్‌ను బావిలో వేసి క్యాన్‌ మునిగేలా చేతిని కదిపేవాళ్లు. అప్పుడు ఆ క్యాన్‌లోకి నీళ్లు వచ్చేవి. అది చూడ్డానికి చాలా తేలిగ్గా అనిపించింది, కానీ నా వంతు వచ్చాక తెలిసింది అది ఎంత కష్టమో. నేను చాలాసార్లు ఆ క్యాన్‌ను నీళ్లలో వేశాను కానీ అది మునగకుండా పైకి తేలుతూ ఉంది. నన్ను చూసి అందరూ నవ్వారు, తర్వాత ఒకామె నాకు సహాయం చేసింది. స్థానిక ప్రజలు చాలావరకు సహాయం చేసేవాళ్లు, దయగా ఉండేవాళ్లు.

ఆ ద్వీపాల్లో సేవ చేయడం మీకు బాగా నచ్చింది కదా, అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కొన్ని సంఘటనల్ని మాతో పంచుకోగలరా?

విన్‌స్టన్‌: కొన్ని పద్ధతుల్ని అర్థంచేసుకోవడానికి మాకు కాస్త సమయం పట్టింది. ఉదాహరణకు, సహోదరులు మమ్మల్ని భోజనానికి పిలిచినప్పుడు, వాళ్లు వండినదంతా మా ముందు పెట్టేవాళ్లు. మొదట్లో, వాళ్లకోసం కూడా కొంత మిగల్చాలని తెలియక మేము పెట్టిందంతా తినేసేవాళ్లం! కానీ ఆ విషయం తెలిశాక, వాళ్లకోసం కూడా మిగిల్చేవాళ్లం. మేము పొరపాట్లు చేసినా సహోదరులు మమ్మల్ని అర్థంచేసుకున్నారు. అంతేకాదు ప్రాంతీయ పనిలో భాగంగా ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వాళ్లను కలిసినప్పుడు మమ్మల్ని చూసి చాలా సంతోషించేవాళ్లు. అప్పట్లో, స్థానికంగా ఉండే తోటి సహోదరులూ, మేమూ తప్పా వాళ్లకు వేరే యెహోవాసాక్షులెవ్వరూ తెలియదు.

న్యూయి ద్వీపంలో ఒక గుంపును పరిచర్యకు తీసుకువెళ్తున్న విన్‌స్టన్‌, అందరూ మోటర్‌ సైకిళ్ల మీద వెళ్తున్నారు

న్యూయి ద్వీపంలో ఒక గుంపును పరిచర్యకు తీసుకెళ్తూ

మా సందర్శనాలు స్థానిక ప్రజలకు కూడా మంచి సాక్ష్యం ఇచ్చేవి. అక్కడి సహోదరులది వాళ్లు సొంతగా స్థాపించుకున్న ఒక మతమని స్థానికులు అనుకునేవాళ్లు. అందుకే, సహోదరుల్ని కలవడానికి వేరే దేశం నుండి సాక్షులు రావడం చూసినప్పుడు, మన సహోదరులు ఒక నిజమైన సంస్థలో భాగమని స్థానికులు అర్థం చేసుకోవడమే కాదు, ముగ్ధులయ్యారు కూడా.

ప్యామ్‌: నాకు బాగా గుర్తుండిపోయిన విషయం కిరిబాటిలో జరిగిన ఒక సంఘటన. అక్కడున్న సంఘంలో కొద్దిమంది సహోదరసహోదరీలే ఉండేవాళ్లు. ఆ సంఘానికి ఏకైక సంఘపెద్ద అయిన స్టినకై మటెర, మా బాగోగులు చూసుకోవడానికి చేయగలిగినదంతా చేశాడు. ఆయన ఒకరోజు మా దగ్గరకు ఒక బుట్ట పట్టుకొని వచ్చాడు, దానిలో ఒకేఒక్క కోడి గుడ్డు ఉంది. “ఇది మీకే” అన్నాడు. అప్పట్లో కోడి గుడ్డు దొరకడం చాలా గొప్ప విషయం. ఆయన ఉదారతతో చేసిన ఆ చిన్న పని మా హృదయాల్ని తాకింది.

ప్యామ్‌, కొన్ని సంవత్సరాల తర్వాత గర్భంలోనే మీ బిడ్డ చనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకోవడానికి మీకేది సహాయం చేసింది?

మేము 1973లో దక్షిణ పసిఫిక్‌లో ఉన్నప్పుడు నేను గర్భవతిని అయ్యాను. దాంతో తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చేశాం. అక్కడ నాలుగు నెలలు ఉన్న తర్వాత నా బిడ్డ గర్భంలోనే చనిపోయింది. అప్పుడు నేనూ, విన్‌స్టన్‌ చాలా బాధపడ్డాం. కాలం గడుస్తుండగా నా బాధ తగ్గుతూ వచ్చింది. కానీ 2009, ఏప్రిల్‌ 15 కావలికోట మా చేతికి అందాక మా బాధ పూర్తిగా పోయింది. ఆ సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” అనే ఆర్టికల్‌లో, “తల్లి గర్భంలోనే చనిపోయిన బిడ్డ పునరుత్థానం చేయబడుతుందా?” అనే ప్రశ్న గురించి ఉంది. దానికి జవాబిస్తూ, ఎల్లప్పుడు సరైనది చేసే యెహోవాకు ఆ విషయం వదిలేయబడిందని ఆ ఆర్టికల్‌ అభయమిచ్చింది. యెహోవా ‘అపవాది పనుల్ని నాశనం చేయమని’ ప్రేమతో తన కుమారుణ్ణి నిర్దేశిస్తూ, ఈ చెడ్డ లోకంలోని జీవితం వల్ల మనకు కలిగిన బాధనంతటినీ తీసేస్తాడు. (1 యోహా. 3:8) యెహోవా ప్రజలముగా మా దగ్గరున్న “ముత్యాన్ని” మేము ఇంకా విలువైనదిగా చూసేలా ఆ ఆర్టికల్‌ సహాయం చేసింది. అవును, రాజ్య నిరీక్షణ లేకపోతే మనం అసలు ఉండగలమా?

మా బిడ్డను కోల్పోయాక, మేము మళ్లీ పూర్తికాల సేవను ప్రారంభించాం. కొన్ని నెలలు ఆస్ట్రేలియా బెతెల్‌లో సేవచేశాం, ఆ తర్వాత తిరిగి ప్రాంతీయ సేవలో అడుగుపెట్టాం. న్యూ సౌత్‌ వేల్స్‌లో అలాగే సిడ్నీలో నాలుగు సంవత్సరాలు సేవ చేశాక, 1981లో మమ్మల్ని ఆస్ట్రేలియా బ్రాంచికి ఆహ్వానించారు, అప్పట్లో దాన్ని అలా పిలిచేవాళ్లు. అప్పటి నుండి మేము ఇక్కడే సేవ చేస్తున్నాం.

విన్‌స్టన్‌, దక్షిణ పసిఫిక్‌ ద్వీపాల్లో మీరు సంపాదించుకున్న అనుభవం, ఆస్ట్రలేషియా బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవ చేయడానికి సహాయం చేసిందా?

చాలా విధాలుగా సహాయం చేసింది. మొదట్లో అమెరికన్‌ సమోవా, సమోవా ద్వీపాలు ఆస్ట్రేలియా పర్యవేక్షణ కిందకి వచ్చాయి. ఆ తర్వాత, న్యూజిలాండ్‌ బ్రాంచిని ఆస్ట్రేలియా బ్రాంచితో కలిపేయడంతో అది ఆస్ట్రలేషియా బ్రాంచి అయ్యింది. ఇప్పుడు ఆస్ట్రలేషియా బ్రాంచి క్షేత్రం కిందకి ఏవి వస్తాయంటే: ఆస్ట్రేలియా, అమెరికన్‌ సమోవా, కుక్‌, న్యూజిలాండ్‌, న్యూయి, టీమర్‌ లెస్ట్‌, టోకలా, టోంగా, సమోవా. వాటిలో చాలా ద్వీపాలకు బ్రాంచి ప్రతినిధిగా వెళ్లే అవకాశం నాకు దొరికింది. ఆ ద్వీపాల్లోని నమ్మకమైన సహోదరసహోదరీలతో కలిసి పనిచేసిన అనుభవం, ఇప్పుడు బ్రాంచి కార్యాలయం నుండి వాళ్లకోసం పనిచేయడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఆస్ట్రలేషియా బ్రాంచిలో విన్‌స్టన్‌, ప్యామ్‌

అస్ట్రలేషియా బ్రాంచిలో విన్‌స్టన్‌, ప్యామ్‌

చివరిగా, మేము ఇన్నేళ్లలో గ్రహించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మా వ్యక్తిగత అనుభవం కూడా తెలియజేస్తున్నట్లు, దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించేది కేవలం పెద్దవాళ్లు మాత్రమే కాదు. యౌవనులు కూడా తమ కుటుంబం సభ్యులు ఒప్పుకోకపోయినా ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కోరుకుంటారు. (2 రాజు. 5:2, 3; 2 దిన. 34:1-3) యెహోవా ప్రేమగల దేవుడు అనడంలో సందేహమే లేదు, పెద్దలు-యౌవనులు, అందరూ జీవాన్ని సంపాదించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.

నేనూ, ప్యామ్‌ 50 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు, అవి మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాయో మాకు తెలీదు. నిస్సందేహంగా, రాజ్య సత్యం వెలకట్టలేని ముత్యం! మా పూర్తి బలంతో ఆ విలువైన ముత్యాన్ని గట్టిగా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి