దేవుని గురించి తెలుసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇప్పటివరకు మనం దేవుడు అంటే ఎవరు? అనే ప్రశ్నకు జవాబును కొద్దికొద్దిగా తెలుసుకున్నాం. మనం బైబిలు ద్వారా దేవుని పేరు యెహోవా అని, ప్రేమ ఆయనకున్న లక్షణాల్లో చాలా ముఖ్యమైనదని తెలుసుకున్నాం. ఆయన ఇప్పటికే చేసిన పనులు, మనుషులందరి ప్రయోజనం కోసం ఆయన ఇంకా చేయబోయే పనులు గురించి కూడా పరిశీలించాం. దేవుని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కానీ అలా తెలుసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అని మీరు ఆలోచిస్తుండవచ్చు.
“ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును” అని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (1 దినవృత్తాంతములు 28:9) మీరు దేవున్ని వెదికి ఆయన గురించి తెలుసుకుంటూ ఉండగా మీకు వచ్చే అద్భుతమైన వరం గురించి, అంటే యెహోవాతో ఉండే మంచి స్నేహం గురించి ఊహించండి! (కీర్తన 25:14) అలాంటి స్నేహం వల్ల మీరు ఏమి పొందుతారు?
నిజమైన సంతోషం. యెహోవాను “సంతోషంగల దేవుడు” అని వర్ణించారు. (1 తిమోతి 1:11) ఆయనకు సన్నిహితంగా ఉండి, ఆయన మార్గాలను అనుసరిస్తే నిజమైన సంతోషాన్ని పొందుతాం, ఆ సంతోషం వల్ల మనం భావోద్వేగంగా, మానసికంగా, శారీరకంగా ప్రయోజనం పొందుతాం. (కీర్తన 33:12) హానికరమైన జీవన విధానానికి దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకుంటూ, ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉంటూ కూడా మీరు సంతోషంగా ఉండే జీవితాన్ని పొందగలుగుతారు. కీర్తనకర్త చెప్పిన మాటల్ని మీరూ ఒప్పుకుంటారు: “నాకైతే దేవుని పొందు ధన్యకరము.”—కీర్తన 73:28.
వ్యక్తిగత శ్రద్ధ, అవధానం. యెహోవా తన సేవకులకు “నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని మాటిచ్చాడు. (కీర్తన 32:8) యెహోవా తన సేవకుల్లో ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తాడు, అతనికి లేదా ఆమెకు సరిగ్గా కావాల్సిన సహాయాన్ని ఇస్తాడు. (కీర్తన 139:1, 2) మీరు యెహోవాతో మంచి సంబంధాన్ని పెంచుకున్న తర్వాత ఆయన ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు.
అద్భుతమైన భవిష్యత్తు. ఇప్పుడు మీరు సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సహాయాన్ని ఇవ్వడంతో పాటు, యెహోవా దేవుడు అద్భుతమైన భవిష్యత్తును మీరు పొందేలా సాధ్యం చేశాడు. (యెషయా 48:17, 18) బైబిలు ఇలా చెప్తుంది: “ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” (యోహాను 17:3) అల్లకల్లోలంగా ఉన్న ఈ కాలాల్లో దేవుడు మనకు ఇచ్చే నిరీక్షణ ఒక లంగరులా పని చేస్తూ మనం నిశ్చయతతో, స్థిరంగా ఉండడానికి సహాయం చేస్తుంది.—హెబ్రీయులు 6:19.
దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి ఉన్న ఎన్నో ముఖ్యమైన కారణాల్లో ఇవి కొన్ని మాత్రమే. మీరు యెహోవాసాక్షులతో కూడా మాట్లాడవచ్చు లేదా jw.org/te వెబ్సైట్ చూసి మీకు ఉపయోగపడే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు.