కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 మే పేజీలు 31-32
  • “ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 మే పేజీలు 31-32
1922⁠లో, ఒహాయోలోని సిడార్‌పాయింట్‌లో జరుగుతున్న సమావేశానికి వచ్చిన జనంతో నిండిపోయిన ఆడిటోరియం

ఆనాటి జ్ఞాపకాలు

“ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో”

అది 1922 సెప్టెంబరు నెల, శుక్రవారం ఉదయం. 8,000 మందితో నిండిన ఆడిటోరియం లోపల అప్పటికే చాలా వేడిగా ఉంది. అయితే, ఆ సమావేశం మొదలయ్యాక ఎవరైనా కావాలనుకుంటే హాలు బయటకు వెళ్లవచ్చుగానీ, మళ్లీ లోపలికి రావడం కుదరదని సమావేశ ఛైర్మన్‌ ఒక ప్రకటన చేశాడు.

మొదటిగా పాటలతో “సేవను స్తుతించడం” ప్రారంభించిన తర్వాత సహోదరుడు జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ప్రసంగీకుని మైకు దగ్గరకు వచ్చాడు. కూర్చున్న ప్రేక్షకుల్లో చాలామంది, తర్వాత ఏమి జరుగుతుందోనని చూస్తున్నారు. కొంతమంది మాత్రం లోపలి వేడికి అటూఇటూ తిరుగుతున్నారు. ప్రసంగీకుడు వాళ్లను కూర్చొని, వినమని గట్టిగా చెప్పాడు. ప్రసంగం మొదలైంది, ఇంతకీ స్టేజీకి పైన చక్కగా చుట్టి, తాళ్లతో కట్టి ఉన్న పెద్ద బ్యానర్‌ని ఎవరైనా చూశారా?

‘పరలోకరాజ్యం సమీపించింది’ అనే అంశం మీద సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రసంగించాడు. దాదాపు గంటన్నర ఉన్న ఆ ప్రసంగంలో బైబిలు కాలాల్లోని ప్రవక్తలు దేవుని రాజ్యం రాబోతున్న విషయాన్ని ఎలా ధైర్యంగా ప్రకటించారో అతను వివరించాడు. అతని గంభీరమైన స్వరంతో ఆ హాలంతా దద్దరిల్లిపోయింది. తన ప్రసంగం చివర్లో సహోదరుడు, “మహిమగల రాజు తన పరిపాలనను ప్రారంభించాడని మీరు నమ్ముతున్నారా” అని అడిగాడు. అందుకు ప్రేక్షకులు, “అవును” అని గట్టిగా జవాబిచ్చారు.

“అలాగైతే ఓ సర్వోన్నత దేవుని కుమారులారా, తిరిగి సేవకు వెళ్లండి! ఇదిగో, రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అని సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ గంభీరంగా చెప్పాడు.

అప్పుడు, స్టేజీ పైభాగంలో చుట్టి ఉన్న ఆ బ్యానర్‌ చక్కగా విప్పుకుంది. దానిమీద ఇలా రాసివుంది, “రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి.”

“ప్రేక్షకుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి” అని రే బోప్‌ చెప్పాడు. “వాళ్ల చప్పట్లకు దూలాలు దద్దరిల్లాయి” అని ఆన గార్డనర్‌ వివరించింది. “అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు” అని ఫ్రెడ్‌ ట్వారోష్‌ చెప్పాడు. “ఏదో బలమైన శక్తి మమ్మల్ని మా సీట్లలో నుండి లేపినట్టు అనిపించింది. అంతేకాదు మా అందరి కళ్లు చెమర్చాయి” అని ఎవాన్‌జెలోస్‌ స్కూఫస్‌ చెప్పాడు.

సమావేశంలో చాలామంది అప్పటికే రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తున్నారు. కానీ, ఇప్పుడు వాళ్ల పనికి ఒక కొత్త అర్థం చేకూరినట్లు వాళ్లకు అనిపించింది. “ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో నిండిన హృదయాలతో” బైబిలు విద్యార్థులు ఇంటికి వెళ్లారని ఎతల్‌ బెనకోఫ్‌ చెప్పింది. అప్పటికి 18 ఏళ్లు ఉన్న ఓడెసా టక్‌, “నేను ఎవని పంపెదను?” అనే ఆహ్వానానికి ప్రతిస్పందనగా సేవ చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించుకుంది. అయితే “ఎక్కడ, ఎలా, ఏమి ప్రకటించాలో నాకు తెలియలేదు. నాకు తెలిసిందల్లా, ‘చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు’ అని చెప్పిన యెషయాలా ఉండడమే” అని ఆమె చెప్పింది. (యెష. 6:8) “ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనాపని నిజంగా మొదలైంది ఆ రోజే” అని రాల్ఫ్‌ లెఫ్లర్‌ అన్నాడు.

1922, ఒహాయోలోని సిడార్‌పాయింట్‌లో జరిగిన ఈ సమావేశం దేవుని ప్రజల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పడంలో ఆశ్చర్యంలేదు. “ఆ సమావేశానికి హాజరైనప్పటి నుండి ప్రతీ సమావేశానికి ఖచ్చితంగా వెళ్లాలనే కోరిక నాలో కలిగింది” అని జార్జ్‌ గ్యాంగస్‌ చెప్పాడు. అతనికి గుర్తున్నంతవరకు అతను అన్నీ సమావేశాలకు వెళ్లాడు. జూల్య విల్కాక్స్‌ ఇలా రాసింది, “1922 సిడార్‌పాయింట్‌ గురించి మన ప్రచురణల్లో చూసిన ప్రతీసారి నాకు ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందో నేను చెప్పలేను. ‘యెహోవా, ఆ రోజున సమావేశానికి హాజరయ్యే అవకాశమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు’ అని నాకెప్పుడూ చెప్పాలనిపిస్తుంది.”

మనలో చాలామందికి కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఉండివుంటాయి. ముఖ్యంగా మనకు సంతోషాన్ని కలిగించి, మన గొప్ప దేవుడైన యెహోవాపట్ల, రాజైన యేసుపట్ల మనలో ఉత్సాహాన్ని ప్రేమను నింపిన సమావేశాలు గుర్తుండిపోతాయి. అలాంటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నప్పుడు మనం కూడా ఇలా చెప్తాం, “యెహోవా, ఆ రోజున సమావేశానికి హాజరయ్యే అవకాశమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు.”

అంతుచిక్కని ఆ అక్షరాల అర్థం

చెట్లమీద, బిల్డింగుల మీద, చివరికి సమావేశ ప్రోగ్రామ్‌ షీట్‌మీద ప్రతీచోట “ADV” అనే అక్షరాలు ఉన్నాయి. సమావేశానికి వచ్చిన వాళ్లు వాటిని చూసినప్పుడు వాటి అర్థం ఏమైవుంటుందోననే కుతూహలం వాళ్లలో ఎక్కువైంది.a

“ప్రతీ స్తంభం మీద, గుమ్మం దగ్గర పెట్టి ఉన్న తెల్లటి కార్డులపై ADV అనే నల్లటి అక్షరాలు పెద్ద అచ్చులో ప్రింట్‌ చేసి ఉన్నాయి. మేము వాటి అర్థం ఏమిటని అడిగినప్పుడు, ఎవ్వరికీ వాటి అర్థం తెలీదని అనిపించింది. ఒకవేళ తెలిసినా వాళ్లు చెప్పరు.”—ఏడత్‌ బ్రెనసన్‌.

a నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఆ అక్షరాల అర్థమేమిటో ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఈరోజు వరకు కూడా వాటి ఫోటోలు దొరకలేదు.

ఓ ప్రార్థనకు తెరవెనుక జవాబు దొరికింది

ఆథర్‌, నెలీ క్లాస్‌ మంచి సీట్ల కోసం ముందుగానే వచ్చారు. “ప్రతీ పదాన్ని జాగ్రత్తగా వింటున్నాను” అని ఆథర్‌ చెప్పాడు. కానీ ఉన్నట్టుండి అతనికి కడుపు నొప్పి మొదలైంది. ఒకవేళ బయటికి వెళ్తే, మళ్లీ హాలు లోపలికి రావడం కుదరని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అతను బయటకు వెళ్లాడు. “ఇలాంటి సమయంలో నువ్వు బయటకు ఎలా వెళ్తున్నావు?” అని ఒక అటెండెంటు అతన్ని అడిగాడు. కానీ తాను వెళ్లక తప్పదని ఆథర్‌కి తెలుసు.

అతను మళ్లీ హాల్లోకి రాబోతుండగా లోపల నుండి గట్టిగా చప్పట్లు వినిపించాయి. హాలు బయట నిలబడే లోపల ఏమి చెప్తున్నారో వినేందుకు ఒక చోటు కోసం వెతుకుతూ ఆథర్‌ హాలు పైకప్పు ఎక్కాడు. అతను దాదాపు 16 అడుగులు ఎత్తు ఎక్కాడు. చివరికి పైకప్పుమీద తెరిచి ఉన్న ఒక పెద్ద కిటికీ దగ్గరకు వెళ్లాడు.

అక్కడ కొంతమంది సహోదరులు కూడా ఉన్నారు. వాళ్లు ప్రసంగీకుని వైపు అయోమయంతో చూస్తూ ఉన్నారు. స్టేజి పై భాగంలో చుట్టి ఉన్న బ్యానర్‌ తాళ్లను వాళ్లందరూ ఒకేసారి కోసి ఉడదీయాలనే నిర్దేశం ఇవ్వబడింది. కానీ తాళ్లన్నిటినీ ఒకేసారి విప్పాలంటే, ఇంకొక కత్తి అవసరమైంది. మరి ఆథర్‌ దగ్గర పదునైన కత్తి ఉందా? ఉంది! కాబట్టి, ఆథర్‌ అలాగే మిగతా సహోదరులు తాళ్లను కోయమనే నిర్దేశం కోసం ఎదురుచూస్తూ సిద్ధంగా ఉన్నారు. సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ “ప్రకటించండి” అనే పదాన్ని రెండవసారి పలకగానే వాళ్లు తాళ్లను కోయాలి.

మూడు రంగుల ఆ బ్యానర్‌ ఎంత చక్కగా విప్పుకుందో దాన్ని కళ్లారా చూసినవాళ్లు వివరించారు. ఆ బ్యానర్‌ మధ్యలో చిత్రించిన యేసు బొమ్మ ఉంది.

తర్వాత, అసలు ఏమి జరిగిందో సహోదరులు ఆథర్‌కు వివరించారు. వాళ్లు నిచ్చెన వేసుకుని పైకప్పు మీదకు ఎక్కిన తర్వాత నిచ్చెన తీసేశారని, తీరా మరో కత్తి అవసరమైనట్టు తెలిసిందని చెప్పారు. దాంతో ఏమి చేయాలో తెలియక ఒక కత్తి ఉన్న సహోదరుడిని పంపించమని యెహోవాకు ప్రార్థించారని వాళ్లు చెప్పారు. అయితే, యెహోవా వాళ్ల ప్రార్థనకు చాలా ఆసక్తికరమైన విధానంలో జవాబిచ్చినట్టు అర్థమైందని చెప్పారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి