టెట్రగ్రామటన్ అంటే దేవుని పవిత్ర పేరు యెహోవా హీబ్రూ అక్షరాల్లో, కుడి నుండి ఎడమకు చదువుతారు
హీబ్రూ అక్షరాల్లో చిన్న అక్షరం మనకు బలమైన భరోసా ఇస్తుంది
దేవుని వాగ్దానాలన్నీ నెరవేరుతాయని నిజంగా నమ్మవచ్చా? యేసుకు ఆ నమ్మకం ఉంది, ఆయన బోధలు విన్నవాళ్లలో కూడా ఆ నమ్మకం పెరిగింది. మత్తయి 5:18 లో ఉన్న కొండ మీద ప్రసంగంలో యేసు చెప్పిన ఈ ఉదాహరణను పరిశీలించండి. “నేను నిజంగా మీతో చెప్తున్నాను. ఒకవేళ ఆకాశం, భూమి నాశనమైనా, ధర్మశాస్త్రమంతా పూర్తిగా నెరవేరేవరకు దానిలోని ఒక చిన్న అక్షరంగానీ, పొల్లుగానీ తప్పిపోదు.”
హీబ్రూ అక్షరాల్లో అతి చిన్నది י (యోద్), ఇది టెట్రగ్రామటన్లో అంటే దేవుని పవిత్ర పేరైన యెహోవాలో మొదటి అక్షరం.a పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రంలో పదాలు, అక్షరాలతో పాటు అక్షరాల్లో ఉండే ప్రతి చిన్న గుర్తును కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా చూసేవాళ్లు.
ఆకాశం, భూమి నాశనమైనా, ధర్మశాస్త్రంలో చిన్న విషయం కూడా నెరవేరకుండా ఉండదని యేసు చెప్తున్నాడు. అయితే ఆకాశం, భూమి శాశ్వతంగా ఉంటాయని లేఖనాలు మనకు భరోసా ఇస్తున్నాయి. (కీర్తన 78:69) కాబట్టి ఈ బలమైన మాటలు ధర్మశాస్త్రంలో ఒక చిన్న విషయం కూడా నెరవేరకుండా ఉండదని చూపిస్తున్నాయి.
యెహోవా దేవుడు చిన్నచిన్న వివరాలను కూడా పట్టించుకుంటాడా? అవును, పట్టించుకుంటాడు. దీన్ని పరిశీలించండి: పస్కా గొర్రెపిల్ల ఎముకల్లో ఒక్కటి కూడా విరగొట్టకూడదని ఇశ్రాయేలీయులకు చెప్పబడింది. (నిర్గమకాండము 12:46) ఇది చాలా చిన్న విషయమే అనిపించవచ్చు. దేవుడు ఒక్క ఎముక కూడా విరగొట్టకూడదని ఎందుకు చెప్పాడో వాళ్లకు అర్థమై ఉంటుందా? అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఈ చిన్న విషయం, భవిష్యత్తులో మెస్సీయను హింసాకొయ్య మీద చంపినప్పుడు ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగొట్టరు అనే ప్రవచనానికి సంబంధించినదని యెహోవా దేవునికి తెలుసు.—కీర్తన 34:20; యోహాను 19:31-33, 36.
యేసు మాటలు మనకు ఏమి బోధిస్తున్నాయి? యెహోవా దేవుడు చేసిన వాగ్దానాలన్నీ చిన్నచిన్న వివరాలతో సహా ఖచ్చితంగా జరుగుతాయని మనం కూడా పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. హీబ్రూ అక్షరాల్లో చిన్న అక్షరం మనకు ఎంత బలమైన భరోసా ఇస్తుందో కదా!
a గ్రీకు అక్షరాలలో అతి చిన్నదైన అయోటా హీబ్రూ అక్షరమైన י (యోద్) లానే ఉంటుంది. మోషే ధర్మశాస్త్రం మొదటినుండి హీబ్రూలోనే రాయబడుతూ వచ్చింది కాబట్టి యేసు ఆ భాషలో అక్షరం గురించే చెప్పి ఉంటాడు.