ఆనాటి జ్ఞాపకాలు
“మీరు సత్యం తెలుసుకోవడం కోసమే యెహోవా మిమ్మల్ని ఫ్రాన్స్‌కు తీసుకొచ్చాడు”
అంట్వాన్ స్కలెకీ చిన్నప్పుడు బొగ్గుగనిలో పని చేసేవాడు. అతని పని ఏంటంటే, భూమికి సుమారు 500 మీటర్ల అడుగున ఉన్న బొగ్గును గుర్రపుబండిలో వేసుకుని, అంతగా వెలుతురులేని సొరంగాల గుండా ప్రయాణిస్తూ దాన్ని బయటికి తీసుకురావడం. అలా అతను గుర్రంతో కలిసి రోజంతా పని చేసేవాడు. అంట్వాన్ వాళ్ల నాన్న కూడా బొగ్గుగనిలో పని చేసేవాడు. అయితే, ఆయన గనిలో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడడంతో, అంట్వాన్ ఆ పనిలో చేరాల్సివచ్చింది. అక్కడ అతను రోజుకు 9 గంటలు కష్టపడి పనిచేసేవాడు. అలా పనిచేస్తున్నప్పుడు ఓసారి అతను ఓ పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుని బయటపడ్డాడు.
పోలండ్ వాసులు గనుల్లో పనిచేసేటప్పుడు ఉపయోగించిన పరికరాలు, సన్-ల-నోబ్ల దగ్గరున్న డిషీలో అంట్వాన్ పనిచేసిన బొగ్గుగని
ఫ్రాన్స్‌లో స్థిరపడ్డ పోలండ్ దేశస్థుల కుటుంబంలో అంట్వాన్ పుట్టాడు. 1920, 1930లలో చాలామంది పోలండ్ వాసులు ఫ్రాన్స్‌కు వలస వెళ్లారు. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పోలండ్‌కు మళ్లీ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, అధిక జనాభా అక్కడ ఓ పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఆ యుద్ధంలో ఫ్రాన్స్‌కు చెందిన పురుషులు పది లక్షలకుపైగా చనిపోవడంతో, అక్కడి బొగ్గుగనుల్లో పని చేయడానికి కార్మికులు కరువయ్యారు. దాంతో, పోలండ్ దేశస్థులు ఫ్రాన్స్‌కు వలస వెళ్లేందుకు అనుమతిస్తూ ఆ రెండు దేశాలు 1919, సెప్టెంబరులో ఓ ఒప్పందం చేసుకున్నాయి. అలా 1931 కల్లా ఫ్రాన్స్‌లోని పోలండ్ వాసుల సంఖ్య 5,07,800కు చేరింది. వాళ్లలో చాలామంది ఉత్తర ఫ్రాన్స్‌లో బొగ్గుగనులున్న ప్రాంతాల్లో స్థిరపడ్డారు.
వాళ్లు తమ సంస్కృతిని, మత నమ్మకాల్ని కూడా తమతో పాటు ఫ్రాన్స్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం 90 ఏళ్లున్న అంట్వాన్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, ‘మా తాతయ్య జోసెఫ్ పరిశుద్ధ లేఖనాల్ని ఎంతో గౌరవించేవాడు. అలా గౌరవించడం వాళ్ల నాన్న నేర్పించాడు.’ గనుల్లో పనిచేసే పోలండ్ దేశస్థులు, అంతకుముందు తమ దేశంలో చేసినట్లుగా ఇక్కడ కూడా ప్రతీ ఆదివారం మంచి బట్టలు వేసుకుని చర్చీకి వెళ్లేవాళ్లు. కానీ దైవభక్తిలేని కొంతమంది స్థానికులకు అది నచ్చేదికాదు.
పోలండ్ వాసులు మొదటిసారిగా నార్డ్-పాస్-డి-కాలిస్ అనే ప్రాంతంలో సత్యం తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో బైబిలు విద్యార్థులు 1904 నుండి ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. 1915 కల్లా పోలిష్ భాషలో కావలికోట ప్రతీనెల ప్రింట్ అవ్వడం మొదలైంది, 1925లో ది గోల్డెన్ ఏజ్(ప్రస్తుతం తేజరిల్లు!) పత్రిక కూడా ఆ భాషలో అందుబాటులోకి వచ్చింది. ఈ పత్రికల్లో ఉన్న బైబిలు విషయాలతో పాటు, ద హార్ప్ ఆఫ్ గాడ్ పుస్తకంలోని విషయాలు పోలిష్ భాష మాట్లాడే చాలా కుటుంబాలకు నచ్చాయి.
అంట్వాన్ వాళ్ల మామయ్య మొదటిసారిగా 1924లో బైబిలు విద్యార్థుల కూటానికి హాజరయ్యాడు. ఆయన ద్వారానే అంట్వాన్ కుటుంబానికి బైబిలు విద్యార్థుల గురించి తెలిసింది. ఆ సంవత్సరంలోనే బ్రూయే-ఎన్-ఆర్టాయిస్ అనే ప్రాంతంలో, బైబిలు విద్యార్థులు మొదటిసారి పోలిష్ భాషలో సమావేశం జరుపుకున్నారు. అది జరిగిన నెలలోపే అదే ప్రాంతంలో, ప్రపంచ ప్రధాన కార్యాలయ ప్రతినిధి జోసెఫ్. ఎఫ్. రూథర్‌ఫర్డ్ ఓ బహిరంగ కూటం నిర్వహించాడు. ఆ కూటానికి హాజరైన 2,000 మందిలో ఎక్కువమంది పోలండ్ వాసులు ఉండడం చూసి ఆయన ప్రేమగా ఇలా అన్నాడు, “మీరు సత్యం తెలుసుకోవడం కోసమే యెహోవా మిమ్మల్ని ఫ్రాన్స్‌కు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరూ మీ పిల్లలూ ఫ్రాన్స్ దేశస్థులకు సహాయం చేయాలి. ప్రకటనా పని ఇంకా ఎంతో జరగాల్సివుంది, దానికి కావాల్సిన ప్రచారకుల్ని యెహోవా దయచేస్తాడు.”
యెహోవా సరిగ్గా అదే చేశాడు! పోలండ్ వాసులు బొగ్గుగనుల్లో ఎంత కష్టపడి పనిచేసేవాళ్లో, ప్రకటనా పనిని కూడా అంతే మనస్ఫూర్తిగా చేసేవాళ్లు. వాళ్లలో కొంతమంది తాము నేర్చుకున్న విలువైన సత్యాల్ని పంచుకోవడానికి పోలండ్‌కు తిరిగి వెళ్లారు. టియోఫీల్ పియాస్కావ్స్కీ, ష్టిపాన్ కోసీయక్, యాన్ జాబూడా మరితరులు పోలండ్‌కు తిరిగివెళ్లి, చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు.
అయితే, చాలామంది మాత్రం ఫ్రాన్స్‌లోనే ఉండిపోయి, ఫ్రెంచ్ సహోదరసహోదరీలతో కలిసి ఉత్సాహంగా ప్రకటనా పని చేశారు. 1926లో సన్-ల-నోబ్ల అనే ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో, పోలిష్ భాషా కార్యక్రమానికి 1000 మంది, ఫ్రెంచ్ భాషా కార్యక్రమానికి 300 మంది హాజరయ్యారు. ‘ఆ సంవత్సరంలో 332 మంది పోలండ్ దేశస్థులు బాప్తిస్మం తీసుకున్నారు’ అని 1929 వార్షిక పుస్తకం తెలియజేసింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వడానికి ముందు, ఫ్రాన్స్‌లో ఉన్న 84 సంఘాల్లో 32 పోలిష్ భాషా సంఘాలు ఉండేవి.
ఓ సమావేశానికి వెళ్తున్న పోలండ్ సహోదరసహోదరీలు. వాళ్లు పట్టుకున్న బ్యానర్ మీద “యెహోవాసాక్షులు” అని రాసివుంది
తమ దేశస్థుల్ని తిరిగి రమ్మని 1947లో పోలండ్ ప్రభుత్వం ఆహ్వానించడంతో చాలామంది సాక్షులు పోలండ్‌కు తిరిగివెళ్లారు. అయితే వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూడా వాళ్లూ, ఫ్రెంచ్ సహోదరసహోదరీలూ పడిన కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయి. ఆ సంవత్సరం ఫ్రాన్స్‌లో రాజ్యప్రచారకుల సంఖ్య 10 శాతం పెరిగింది. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా అంటే 1948లో 20 శాతం, 1949లో 23 శాతం, 1950లో 40 శాతం పెరిగింది. ఆ కొత్త ప్రచారకులకు సహాయం చేయడానికి ఫ్రాన్స్ బ్రాంచి కార్యాలయం 1948లో మొదటిసారిగా ప్రాంతీయ పర్యవేక్షకుల్ని నియమించింది. అలా నియమించిన ఐదుగురిలో నలుగురు పోలండ్ వాసులే, వాళ్లలో అంట్వాన్ స్కలెకీ ఒకరు.
ఫ్రాన్స్‌లో స్థిరపడ్డ పోలండ్ వాసులు బొగ్గుగనుల్లో అలాగే పరిచర్యలో ఎంతో కష్టపడి పనిచేశారు. వాళ్ల వంశస్థుల్లో చాలామంది ఇప్పటికీ ఫ్రాన్స్‌లో యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారు. నేడు కూడా, ఫ్రాన్స్‌కు వలస వస్తున్న చాలామంది సత్యం తెలుసుకుంటున్నారు. వలస వచ్చినవాళ్లు సత్యం నేర్చుకుని తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయినా లేదా అక్కడే స్థిరపడిపోయినా, ఒకప్పటి పోలండ్ దేశస్థుల్లాగే వాళ్లు కూడా ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తున్నారు.—ఫ్రాన్స్ నుండి సేకరించినవి.