పత్రిక ముఖ్యాంశం | సృష్టికర్తకు దగ్గరవ్వడం సాధ్యమే!
మీరు దేవునితో మాట్లాడుతున్నారా?
పరిస్థితుల్ని బట్టి స్నేహితులు కలుసుకుని, ఫోన్లో, ఇంటర్నెట్లో, వీడియోల్లో, ఉత్తరాల్లో మాట్లాడుకుంటారు. దేవునికి దగ్గరవ్వాలంటే కూడా మనం ఎప్పుడూ దేవునితో మాట్లాడుతూ ఉండాలి. కానీ ఎలా?
యెహోవాతో మనం ప్రార్థన ద్వారా మాట్లాడవచ్చు. కానీ దేవునికి ప్రార్థన చేయడం అంటే అందరితో మామూలుగా మాట్లాడినట్టు కాదు. ప్రార్థన చేసేటప్పుడు సృష్టికర్తతో అంటే విశ్వసర్వాధిపతితో మాట్లాడుతున్నామని గుర్తుంచుకోవాలి. అప్పుడు పూర్తి గౌరవంతో, భక్తితో ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు దేవుడు వినాలంటే మనం కొన్ని విషయాలు పాటించాలి. వాటిలో మూడు చూద్దాం.
మొదటిది, ప్రార్థనలు యెహోవా దేవునికి మాత్రమే చేయాలి—యేసుకు, “సెయింట్”లకు లేదా గురువులకు, విగ్రహాలకు కాదు. (నిర్గమకాండము 20:4, 5) “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని బైబిల్లో స్పష్టంగా ఉంది. (ఫిలిప్పీయులు 4:6) రెండవది, ప్రార్థనలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చేయాలి. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” (యోహాను 14:6) మూడవది, మన ప్రార్థనలు దేవుని ఇష్టానికి తగినట్లు ఉండాలి.a ‘ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా మన మనవి ఆలకిస్తాడు’ అని బైబిల్లో ఉంది.—1 యోహాను 5:14.
స్నేహితులు వీలైనప్పుడల్లా మాట్లాడుకుంటారు
ఎప్పుడూ ఒక్కళ్లే మాట్లాడుతూ ఉంటే స్నేహితులు ఒకరికొకరు దగ్గరవ్వలేరు. స్నేహితులిద్దరు ఒకరితోఒకరు మాట్లాడుకున్నట్లే, దేవునికి కూడా మనతో మాట్లాడే అవకాశమివ్వాలి, ఆయన చెప్తుంటే వినాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో మీకు తెలుసా?
నేడు, యెహోవా దేవుడు ఆయన రాయించిన బైబిలు ద్వారా మనతో “మాట్లాడుతున్నాడు.” (2 తిమోతి 3:16, 17) ఎలా? ఉదాహరణకు మీ ప్రాణ స్నేహితుని దగ్గర నుండి మీకో ఉత్తరం వచ్చిందనుకోండి. అది చదివాక, అందరితో చాలా సంతోషంగా “నా స్నేహితుడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు!” అని చెప్తారు. అతనితో మీరు నిజంగా మాట్లాడలేదు కాని, ఉత్తరంలో అతను రాసింది చదివారు. అలాగే మీరు బైబిలు చదివితే, మీతో మాట్లాడడానికి యెహోవాకు అవకాశం ఇస్తారు. అందుకే మొదట్లో మనం చూసిన జీన ఇలా అంది: “దేవుడు నన్ను ఆయన స్నేహితురాలిగా చూడాలంటే ఆయన మనకు రాసిన ‘ఉత్తరం’ బైబిలును చదవాలని నాకనిపిస్తుంది.” ఆమె ఇంకా ఇలా అంది: “ప్రతీరోజు బైబిలు చదవడం నన్ను దేవునికి దగ్గర చేసింది.” మీరు కూడా ప్రతీరోజు ఆయన వాక్యమైన బైబిలు చదువుతూ మీతో మాట్లాడే అవకాశం యెహోవాకు ఇస్తున్నారా? అలా చేస్తే దేవునికి దగ్గరైనట్లు మీకనిపిస్తుంది. (w14-E 12/01)
a ప్రార్థన ద్వారా దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చో ఇంకా తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తుంది? పుస్తకంలో 17వ అధ్యాయం చూడండి.