ముఖపత్ర అంశం | ఎందుకు మంచివాళ్లకు ఈ కష్టాలు?
అన్నీ కష్టాలే!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో, స్మితa అనే 35 ఏళ్ల మహిళ ఉండేది. ఆమె అందర్నీ ప్రేమించేది, వాళ్ల బాగోగులు పట్టించుకునేది. కష్టపడి పనిచేస్తూ భర్తతో కలిసి సంతోషంగా జీవించేది. దేవుని గురించి తాను తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకునేది. అందుకే, తెలిసిన వాళ్లందరూ ఆమెను బాగా ఇష్టపడేవాళ్లు. అలాంటామె ఉన్నట్టుండి జబ్బుపడి, వారం రోజుల్లోనే చనిపోయేసరికి ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు!
జేమ్స్, ఆయన భార్య న్యూయార్క్‌లో ఉండేవాళ్లు. వయసు 30 - 40 మధ్య ఉంటుంది. స్మితకు ఉన్నట్లే వాళ్లకు కూడా మంచి పేరుంది. ఓసారి వేసవిలో వాళ్లు అమెరికా పశ్చిమ తీరప్రాంతంలో ఉన్న తమ స్నేహితులను కలవడానికి వెళ్లారు. కానీ తిరిగిరాలేదు. అక్కడ జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో వాళ్లు చనిపోయారు. దాంతో వాళ్ల బంధుమిత్రులు, సహోద్యోగులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.
లోకంలో చెడు, బాధలు పెరిగిపోతున్నాయని తెలుసుకోవడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. యుద్ధాలు, సైనికులతో పాటు సామాన్యుల్ని కూడా పొట్టన పెట్టుకుంటున్నాయి. నేరం, హింస వల్ల అమాయక ప్రజలు బలౌతున్నారు. ఘోర ప్రమాదాలు, వ్యాధులు వయసు-హోదా తేడా లేకుండా అందర్నీ బాధపెడుతున్నాయి. ప్రకృతి విపత్తులు విచక్షణ లేకుండా ఊళ్లకుఊళ్లనే తుడిచిపెడుతున్నాయి. దురభిమానం, అన్యాయం సర్వసాధారణం అయిపోయాయి. వాటిలో ఏదోక దానివల్ల బహుశా మీరూ బాధపడే ఉంటారు.
మనకు ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం:
మంచివాళ్లకు ఎందుకు ఈ కష్టాలు?
వాటికి దేవుడే కారణమా?
విపత్తులు అనుకోకుండా జరుగుతున్నాయా? లేక మనుషులే వాటికి కారణమా?
కర్మ సిద్ధాంతం చెబుతున్నట్లు, గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇప్పుడు కష్టాలు పడుతున్నామా?
దేవుడు సర్వశక్తిగలవాడైతే, మంచివాళ్లకు కష్టాలు రాకుండా ఎందుకు ఆపడం లేదు?
నేరాలు, బాధలు లేని రోజు ఎప్పటికైనా వస్తుందా?
వీటికి జవాబులు తెలుసుకోవాలంటే, ఈ రెండు విషయాలను అర్థం చేసుకోవాలి: అసలు చెడు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ విషయంలో దేవుడు ఏమి చేయబోతున్నాడు? (w14-E 07/01)
a అసలు పేర్లు కావు.