ముఖపత్ర అంశం | చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా?
మృత్యువు కాటేసినప్పుడు . . .
“మరణం” అనే మాట, వినడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని గురించి మాట్లాడడానికి చాలామంది అసలు ఇష్టపడరు. అయినా సరే, ఏదోక రోజు దాని ప్రభావానికి మనం తప్పక గురౌతాం. దాని కాటు చాలా పదునుగా, బాధాకరంగా ఉంటుంది.
తల్లిదండ్రుల్లో ఒకరుగానీ, వివాహ భాగస్వామిగానీ, కన్న బిడ్డగానీ చనిపోతారని తెలిసినప్పుడు ఆ బాధను తట్టుకోవడం చాలాచాలా కష్టం. విషాదం అనేది అనుకోకుండా సంభవించవచ్చు లేదా మెల్లమెల్లగా అలుముకోవచ్చు. ఏదేమైనా, మరణం కలిగించే వేదనను తప్పించుకోవడం అసాధ్యం. చనిపోయినవాళ్లను ఇక చూడలేమనే ఆలోచన మనసును పిండేస్తుంది.
రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన ఆన్టోన్యో ఇలా అంటున్నాడు: “ఎవరో మీ ఇంటికి తాళం వేసి, తాళపుచెవులు తమతో తీసుకువెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. ఒక్క క్షణం కూడా మీరు ఆ ఇంట్లోకి వెళ్లలేరు. మీకు మిగిలేదల్లా ఆ ఇంటి జ్ఞాపకాలే. జరిగింది ముమ్మాటికీ అదే. అది చాలా అన్యాయమని అనిపించడం వల్ల మీరు దాన్ని అంగీకరించలేకపోయినా మీరు చేయగలిగేది ఏమీ ఉండదు.”
డారతీకి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె 47వ ఏట భర్తను కోల్పోయింది. దాంతో, కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని ఆమె తీర్మానించుకుంది. ఆమె ‘సండే స్కూల్’ టీచర్ కాబట్టి, తన భర్త జీవితం అంతటితో ముగిసిపోయిందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆమె ప్రశ్నలకు సరైన జవాబులు మాత్రం దొరకలేదు. “చనిపోయినప్పుడు మనకు ఏం జరుగుతుంది?” అని తోటి ఆంగ్లికన్ చర్చి సభ్యుణ్ణి అడిగింది. దానికి ఆయన ఇలా జవాబిచ్చాడు: “ఎవరికీ సరిగ్గా తెలియదు. ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే.”
‘వేచి చూడడం’ తప్ప మనం ఏమీ చేయలేమా? ‘చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా?’ అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ఎలా? (w14-E 01/01)