ఆనాటి జ్ఞాపకాలు
“శోధనకాలములో” వాళ్లు స్థిరంగా నిలబడ్డారు
పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బైబిలు విద్యార్థుల తటస్థత గురించి ప్రపంచానికి తెలిసింది. (యెష. 2:2-4; యోహా. 18:36; ఎఫె. 6:12) మరప్పుడు, బ్రిటన్‌లో ఉన్న దేవుని సేవకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
హెన్రీ హడ్సన్
1916లో రూపొందిన సైనిక చట్టం ప్రకారం, బ్రిటన్‌లో 18 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న అవివాహిత పురుషులు తప్పనిసరిగా సైన్యంలో చేరాలి. అయితే, నిజంగా “నైతిక లేక మత నమ్మకాలను బట్టి” మాత్రమే దానికి అంగీకరించని వాళ్లకు మినహాయింపు ఉండేది. కానీ ఎవరికి, ఎంతవరకు మినహాయింపు ఇవ్వాలో నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టులను నియమించింది.
అలాంటి మినహాయింపు ఉన్నా, కొద్దికాలంలోనే దాదాపు 40 మంది బైబిలు విద్యార్థులను సైనిక కారాగారాల్లో నిర్బంధించారు, 8 మందిని ఫ్రాన్స్‌లో యుద్ధానికి పంపించారు. ఈ అన్యాయాల్ని నిరసిస్తూ సహోదరులు ఓ లేఖను, దానితో పాటు 5,500 మంది సంతకాలు చేసిన వినతి పత్రాన్ని బ్రిటన్ ప్రధాని హర్బర్ట్ ఆస్క్విత్‌కు సమర్పించారు.
ఆ తర్వాత, ఫ్రాన్స్‌కు పంపిన ఎనిమిది మంది యుద్ధం చేయడానికి నిరాకరించినందుకు వాళ్లను తుపాకీతో కాల్చేయాలని ఉత్తర్వులు జారీ అయినట్లు వార్త వచ్చింది. కానీ, శిక్షను అమలుచేసే బృందం ఎదురుగా ఆ సహోదరులను ఓ వరుసలో నిలబెట్టిన తర్వాత, వాళ్ల శిక్షను పది సంవత్సరాల జైలు శిక్షగా మార్చారు. ఆ శిక్షా కాలాన్ని సాధారణ కారాగారాల్లో పూర్తి చేయడం కోసం వాళ్లను తిరిగి ఇంగ్లాండ్‌కు పంపించేశారు.
జేమ్స్ ఫ్రెడ్రిక్ స్కాట్
యుద్ధ కాలం పెరగడంతో వివాహిత పురుషులకు కూడా సైనిక సేవను తప్పనిసరి చేశారు. ఇంగ్లాండ్‌లోని మాంచెష్టర్ నగరంలో వైద్య వృత్తిలో ఉన్న హెన్రీ హడ్సన్ అనే బైబిలు విద్యార్థి ప్రతివాదిగా ఒక టెస్టు కేసు (ఆ కోవకు చెందిన భవిష్యత్ కేసులకు మాదిరిగా ఉపయోగపడేది) నడిచింది. 1916 ఆగస్టు 3వ తేదీన కోర్టు ఆయనను దోషిగా తేల్చి, జరిమానా విధించి సైన్యానికి అప్పజెప్పింది. అదే సమయంలో స్కాట్లాండ్‌లోని ఎడిన్బర్గ్‌లో మరో టెస్టు కేసు నడిచింది. ఆ కేసులో, 25 సంవత్సరాల జేమ్స్ ఫ్రెడ్రిక్ స్కాట్ అనే కల్‌పోర్చర్ నిర్దోషి అని తేలింది. అప్పుడు, ఆ కేసును పునర్విచారణ జరిపించాలని ప్రభుత్వం కోర్టుకు అప్పీలు చేసుకుంది. కానీ అదే సమయంలో లండన్‌లో మరో టెస్టు కేసు నడుస్తుండడంతో ఆ అప్పీలును ఉపసంహరించుకుంది. ఆ లండన్ టెస్టు కేసులో హెర్బర్ట్ కిప్స్ అనే సహోదరుణ్ణి కోర్టు దోషిగా తేల్చి, జరిమానా విధించి, సైన్యానికి అప్పజెప్పింది.
1916 సెప్టెంబరు నాటికి, మొత్తం 264 మంది సహోదరులు సైనిక సేవ నుండి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఐదుగురికి మినహాయింపు దొరికింది; 154 మందికి రోడ్లు వేయడం-రాళ్లు కొట్టడం వంటి వెట్టిపనులు ఇచ్చారు; 23 మందిని సైన్యంలో యుద్ధేతర పనులకు నియమించారు; 82 మందిని సైనిక సేవకు అప్పగించారు, వీళ్లలో దానికి నిరాకరించిన కొంతమందిని మిలిటరీ కోర్టులో శిక్ష విధించి కారాగారాల్లో వేశారు. వీళ్ల పట్ల సైన్యం క్రూరంగా వ్యవహరించడంపై చాలామంది ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వీళ్లను సైనిక కారాగారాల నుండి పౌరసేవా శిబిరాలకు తరలించింది.
ప్రైస్ హ్యూస్
ప్రైస్ హ్యూస్, ఎడ్గర్ క్లే అనే ఇద్దరు సహోదరులు వేల్స్ ప్రాంతంలోని ఓ ఆనకట్ట నిర్మాణంలో పనిచేశారు. సహోదరుడు ప్రైస్ హ్యూస్ ఆ తర్వాతి కాలంలో బ్రిటన్ బ్రాంచి పర్యవేక్షకునిగా సేవ చేశాడు. మరో వైపున, ఫ్రాన్స్ నుండి తిరిగివచ్చిన ఎనిమిది మందిలో ఒకరైన హెర్బర్ట్ సీన్యర్‌ను యార్క్‌షైర్‌లోని వేక్‌ఫీల్డ్ కారాగారానికి పంపించారు. మరెందరో, అత్యంత దుర్భర పరిస్థితులున్న డార్ట్‌మూర్ కారాగారంలో వెట్టిచాకిరి చేశారు. ఎక్కువమంది సహోదరులు వచ్చి చేరడంతో, మనస్సాక్షిని బట్టి సైనిక సేవను తిరస్కరించిన వాళ్ల అతి పెద్ద గుంపు డార్ట్‌మూర్ కారాగారంలోనే ఏర్పడింది.
యుద్ధేతర పనులు చేయడానికి అంగీకరించిన ఫ్రాంక్ ప్లాట్ అనే బైబిలు విద్యార్థిని యుద్ధం చేయమని ఆజ్ఞాపించినప్పుడు, ఆయన దానికి ఒప్పుకోకపోవడంతో చాలాకాలం పాటు చిత్రహింసలకు గురిచేశారు. సైన్యంలో చేరిన కొద్దికాలానికి సత్యం నేర్చుకున్న ఎట్కన్సన్ పెజెట్ యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు, సైనిక అధికారులు అతణ్ణి కూడా పాశవికంగా హింసించారు.
హెర్బర్ట్ సీన్యర్
దాదాపు ఓ శతాబ్దం క్రితం సహోదరులకు క్రైస్తవ తటస్థత గురించి పూర్తి అవగాహన లేకపోయినా, యెహోవా దేవుణ్ణి సంతోషపర్చే విధంగా జీవించడానికి వాళ్లు ప్రయత్నించారు. ఈ నివేదికలో, పేర్లతో ప్రస్తావించిన సహోదరులు ప్రత్యేకించి క్లిష్టమైన “శోధనకాలములో” క్రైస్తవ తటస్థతను చూపించి మనకు ఆదర్శంగా నిలిచారు. (ప్రక. 3:10)—బ్రిటన్ నుండి సేకరించినవి.