మోషే వినయంగల వ్యక్తి
వినయం అంటే ఏమిటి?
గర్వం, అహంకారం లేకపోవడమే వినయం. వినయస్థులు ఇతరుల్ని తమకన్నా తక్కువవారిగా చూడరు. వినయస్థుడైన వ్యక్తి తాను పరిపూర్ణుణ్ణి కానని, తాను చేయలేనివి కూడా ఉంటాయని గుర్తుంచుకుంటాడు.
మోషే వినయాన్ని ఎలా చూపించాడు?
మోషే తన అధికారం చూసుకుని గర్వపడలేదు. సాధారణంగా ఒక వ్యక్తి చేతుల్లోకి కాస్త అధికారం వచ్చిన వెంటనే అతడు వినయస్థుడో గర్విష్టో తేలిపోతుంది. “ఒక వ్యక్తి నిజంగా ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడండి” అని 19వ శతాబ్దపు రచయిత, రాబర్ట్ జి. ఇంగర్సోల్ అన్నాడు. కానీ మోషే మాత్రం వినయం చూపించే విషయంలో ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఎలా?
ఇశ్రాయేలీయుల్ని నడిపించే గొప్ప అధికారాన్ని యెహోవా మోషేకు ఇచ్చాడు. అయినా ఆ అధికారం చూసుకుని ఆయన ఎన్నడూ గర్వపడలేదు. ఉదాహరణకు, పిత్రార్జితానికి సంబంధించి ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు, మోషే వినయంగా ఎలా వ్యవహరించాడో పరిశీలించండి. (సంఖ్యాకాండము 27:1-11) అప్పుడు మోషే తీసుకోబోయే నిర్ణయం ఎంత ప్రాముఖ్యమైనదంటే అది ఆ సందర్భంలోనే కాదుగానీ ముందుముందు ఎదురయ్యే అలాంటి పరిస్థితులకు కూడా వర్తిస్తుంది.
మరి మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల నాయకుడిగా ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసు అనుకున్నాడా? ఆయన తన సొంత సామర్థ్యంపైనో, ఎన్నో సంవత్సరాల తన అనుభవంపైనో, లేక యెహోవా ఆలోచనా విధానం గురించి తనకున్న లోతైన అవగాహనపైనో ఆధారపడ్డాడా?
గర్వం ఉన్న వాళ్లయితే అలాగే చేసివుండేవాళ్లు. కానీ మోషే అలా చేయలేదు. మోషే ఆ విషయం గురించి ‘యెహోవా సన్నిధిలో మనవి చేశాడు’ అని బైబిలు చెబుతోంది. (సంఖ్యాకాండము 27:5) ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద నాయకత్వం వహించిన తర్వాత కూడా, మోషే తన మీద కాక యెహోవా మీదే ఆధారపడ్డాడు. మోషే ఎంత వినయస్థుడో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది.
అధికారం ఎల్లప్పుడూ తన చేతుల్లోనే ఉండాలని మోషే కోరుకోలేదు. యెహోవా తననే కాక ఇతర ఇశ్రాయేలీయుల్ని కూడా ప్రవక్తలుగా నియమించినప్పుడు మోషే సంతోషించాడు. (సంఖ్యాకాండము 11:24-29) కొంత పనిని ఇతరులకు అప్పగించి పనిభారాన్ని తగ్గించుకోమని తన మామ ఇచ్చిన సలహాను మోషే పాటించాడు. (నిర్గమకాండము 18:13-24) తాను చనిపోక ముందే, శారీరకంగా బలంగా ఉన్నప్పుడే, తన స్థానంలో మరో వ్యక్తిని నాయకునిగా నియమించమని మోషే యెహోవాను అడిగాడు. యెహోవా యెహోషువను ఎంపిక చేసినప్పుడు మోషే ఆ యువకుడికి నిండు మనసుతో మద్దతిచ్చాడు, అతని నాయకత్వానికి లోబడమని ఇశ్రాయేలీయులకు ఉపదేశించాడు. (సంఖ్యాకాండము 27:15-18; ద్వితీయోపదేశకాండము 31:3-6; 34:7) ఇశ్రాయేలీయుల్ని యెహోవా ఆరాధనలో నడిపించడం తనకు దొరికిన అరుదైన అవకాశమని మోషే భావించాడు. అలాగని ఇతరుల సంక్షేమం కన్నా తన అధికారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు.
మనం ఏమి నేర్చుకోవచ్చు?
మనం కూడా మన అధికారాన్ని, శక్తిసామర్థ్యాల్ని చూసుకుని గర్వపడకూడదు. మనకు సామర్థ్యం కన్నా వినయం ఎక్కువ ఉంటేనే యెహోవా తన సేవలో మనల్ని బాగా ఉపయోగించుకుంటాడని గుర్తుంచుకోండి. (1 సమూయేలు 15:17) మనం నిజంగా వినయస్థులమైతే, బైబిలు ఇస్తున్న ఈ సలహాను పాటించడానికి కృషి చేస్తాం: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”—సామెతలు 3:5, 6.
మనం హోదాకో అధికారానికో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని కూడా మోషే ఉదాహరణ మనకు బోధిస్తోంది.
వినయం విషయంలో మోషే ఉంచిన మాదిరిని అనుసరించడం వల్ల మనం ప్రయోజనం పొందుతామా? నిస్సందేహంగా! మనం నిజమైన వినయాన్ని అలవర్చుకుంటే మన చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటారు, మనల్ని మరింత ఇష్టపడతారు. మరి ముఖ్యంగా, ఈ చక్కని లక్షణానికి మూలమైన యెహోవా కూడా మనల్ని ఇష్టపడతాడు. (కీర్తన 18:35) “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5) మనం కూడా మోషేలా వినయంగా ఉండడానికి అది ఎంత చక్కటి కారణమో కదా! (w13-E 02/01)