దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి
తీర్పు రోజున ఏం జరుగుతుంది?
ఈ ఆర్టికల్ సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.
1. తీర్పు రోజు అంటే ఏమిటి?
ఇక్కడ కుడివైపు చిత్రంలో చూపించినట్టు చాలామంది తీర్పు రోజును ఇలా ఊహించుకుంటారు: వందల కోట్ల ఆత్మలు దేవుని సింహాసనం ముందుకు తీసుకురాబడతాయి. వాళ్లు బ్రతికున్నప్పుడు చేసిన పనుల్ని బట్టి వాళ్లకు తీర్పు ఉంటుంది. కొందరు పరలోక జీవితాన్ని బహుమతిగా పొందుతారు, ఇంకొందరు నరకంలో చిత్రహింసలు పొందుతారు. కానీ బైబిలు ప్రకారం, ప్రజల్ని అన్యాయం నుండి కాపాడడమే తీర్పు రోజు ఉద్దేశం. (కీర్తన 96:13) మనుషుల మధ్య మళ్లీ న్యాయాన్ని స్థాపించడానికి దేవుడు యేసును న్యాయాధిపతిగా నియమించాడు.—యెషయా 11:1-5; అపొస్తలుల కార్యాలు 17:31 చదవండి.
2. తీర్పు రోజు ఎలా న్యాయాన్ని మళ్లీ స్థాపిస్తుంది?
మొదటి మనిషి ఆదాము కావాలని దేవునికి ఎదురు తిరిగినప్పుడు తన పిల్లలందర్నీ పాపానికి, కష్టాలకు, మరణానికి బానిసల్ని చేశాడు. (రోమీయులు 5:12) ఆ అన్యాయాన్ని సరిచేయడానికి యేసు, చనిపోయిన వందల కోట్లమందిని మళ్లీ బ్రతికిస్తాడు. క్రీస్తుయేసు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో ఇది జరుగుతుందని ప్రకటన గ్రంథం చెప్తుంది.—ప్రకటన 20:4, 11, 12 చదవండి.
మళ్లీ బ్రతికినవాళ్లు తాము చనిపోకముందు చేసిన పనుల్ని బట్టి తీర్పు పొందరు. బదులుగా, ప్రకటన 20వ అధ్యాయంలోని “గ్రంథపు చుట్టల్లో” రాసివున్న విషయాలు వెల్లడైనప్పుడు వాళ్లు ఎలా జీవిస్తారనే దాన్నిబట్టి తీర్పు పొందుతారు. (రోమీయులు 6:7) అలా మళ్లీ బ్రతికి, దేవుని గురించి తెలుసుకునే అవకాశం పొందేవాళ్లలో ‘నీతిమంతులు, అనీతిమంతులు’ ఉంటారని అపొస్తలుడైన పౌలు అన్నాడు.—అపొస్తలుల కార్యాలు 24:15 చదవండి.
3. తీర్పు రోజున ఏం జరుగుతుంది?
యెహోవా దేవుణ్ణి తెలుసుకోకుండా, ఆయన్ని సేవించకుండా చనిపోయినవాళ్లకు తమ ప్రవర్తన మార్చుకొని మంచిగా జీవించే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ వాళ్లు అలాచేస్తే, వాళ్లు ‘జీవించడానికి బ్రతికించబడినట్టు.’ అయితే మళ్లీ బ్రతికించబడిన వాళ్లలో కొందరు యెహోవా మార్గాల్ని నేర్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లు ‘తీర్పు పొందడానికి బ్రతికించబడినట్టు.’—యోహాను 5:28, 29; యెషయా 26:10; 65:20 చదవండి.
తీర్పు రోజు వెయ్యేళ్లు ఉంటుంది. అది ముగిసేసరికి యెహోవా తనకు లోబడే మనుషుల్ని మొదట్లో ఉన్నట్టు పరిపూర్ణ స్థితికి తీసుకొస్తాడు. (1 కొరింథీయులు 15:24-28) దేవునికి లోబడి జీవించే వాళ్లందరి కోసం ఎంత అద్భుతమైన భవిష్యత్తు వేచి చూస్తుందో కదా! చివరి పరీక్ష కోసం దేవుడు, వెయ్యేళ్ల పాటు అగాధంలో బంధించబడివున్న అపవాదియైన సాతానును విడుదల చేస్తాడు. అప్పుడు సాతాను మళ్లీ ప్రజల్ని యెహోవా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే సాతానును తిరస్కరించే వాళ్లు భూమ్మీద శాశ్వతకాలం జీవిస్తారు.—యెషయా 25:8; ప్రకటన 20:7-9 చదవండి.
4. ఇంకా ఏ తీర్పు రోజు మనుషులకు మంచి చేస్తుంది?
ఇప్పుడున్న వ్యవస్థను అంతం చేసే సంఘటనను కూడా బైబిలు “తీర్పు రోజు” అని పిలుస్తుంది. ఆ తీర్పు రోజు, ఒక దుష్ట తరం అంతటినీ పూర్తిగా నాశనం చేసిన నోవహు జలప్రళయంలా అకస్మాత్తుగా వస్తుంది. సంతోషకరంగా, రాబోతున్న “భక్తిహీనుల” నాశనం ఒక కొత్త భూ వ్యవస్థకు మార్గం తెరుస్తుంది, దానిలో “ఎప్పుడూ నీతి ఉంటుంది.”—2 పేతురు 3:6, 7, 13 చదవండి.