దేవునికి దగ్గరవ్వండి
‘యెహోవా, నేను నీకు తెలుసు’
“తనను ఎవరూ పట్టించుకోవడంలేదని, అర్థంచేసుకోవడం లేదని తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తికి కలిగే బాధను దేనితోనూ పోల్చలేం” అని రచయిత ఆర్థర్ ఎచ్. స్టాన్‌బక్ రాశాడు. మీరు ఆ మాటలను అర్థంచేసుకోగలరా? మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, మీరు పడుతున్న బాధనుగానీ మీ భావాలనుగానీ ఎవరూ అర్థంచేసుకోవడం లేదని మీకెప్పుడైనా అనిపించిందా? అలాగైతే, ఒక విషయం మీకు ఊరటనిస్తుంది, అదేమిటంటే యెహోవా తన ఆరాధకులను పట్టించుకుంటాడు. అందుకే వాళ్ల రోజువారీ జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని తెలుసుకుంటాడు. అదెంత నిజమో 139వ కీర్తనలోని దావీదు మాటల్లో తెలుస్తుంది.
దేవుడు తనను పట్టించుకుంటున్నాడని నమ్మిన దావీదు ఇలా అన్నాడు: ‘యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు.’ (1వ వచనం) దావీదు ఇక్కడ చక్కని పద చిత్రాన్ని వాడాడు. ‘పరిశోధించు’ అని అనువదించబడిన హీబ్రూ క్రియాపదం ముడి ఖనిజం కోసం తవ్వడాన్ని (యోబు 28:3), సంచారం చేసి భూమిని పరిశీలించడాన్ని (న్యాయాధిపతులు 18:2), లేక న్యాయపరమైన విషయాలను పరీక్షించడాన్ని (ద్వితీయోపదేశకాండము 13:13, 14) సూచించవచ్చు. అవును, యెహోవాకు మనం ఎంత బాగా తెలుసంటే, మన జీవితంలోని ప్రతీ విషయం ఆయన పరిశీలించాడు, మన గురించి ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు. దావీదు “నన్ను” అనే పదాన్ని ఉపయోగించి, దేవుడు తన సేవకుల్లో ప్రతీ ఒక్కరిని పట్టించుకుంటాడని చూపించాడు. దేవుడు ప్రతీ ఒక్కరిని పరిశోధించి తెలుసుకుంటాడు.
దేవుడు ఎంతగా పరిశోధిస్తాడో చెబుతూ దావీదు ఇలా అన్నాడు: “నేను ఎప్పుడు కూర్చునేది, ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.” (2వ వచనం, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) ఒక విధంగా చెప్పాలంటే, యెహోవా “దూరంలో” అంటే పరలోకంలో ఉంటాడు. అయినా, బహుశా మనం రోజంతా కష్టపడిన తర్వాత ఎప్పుడు కూర్చునేది, రోజువారీ పనులు మొదలుపెట్టడానికి పొద్దున్నే ఎప్పుడు లేచేది ఆయనకు తెలుసు. మన ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు ఏమిటో కూడా ఆయనకు తెలుసు. యెహోవా తనను అంతగా పరిశోధిస్తున్నందుకు దావీదు భయపడ్డాడా? లేదు. బదులుగా తనను బాగా పరిశోధించమని ఆయన దేవుణ్ణి కోరాడు. (23, 24 వచనాలు) ఎందుకు?
యెహోవా మంచి ఉద్దేశంతోనే తన ఆరాధకులను పరిశోధిస్తాడని దావీదుకు తెలుసు. యెహోవా ఉద్దేశం గురించి చెబుతూ ఆయన ఇలా రాశాడు: ‘నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేశావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకున్నావు.’ (3వ వచనం) ప్రతీరోజు మన చర్యలన్నిటినీ అంటే మనం చేసే తప్పులను, మంచి పనులను యెహోవా చూస్తాడు. ఆయన వేటిమీద శ్రద్ధ పెడతాడు? మంచివాటి మీదనా లేక చెడ్డవాటి మీదనా? “పరిశీలన చేయు” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “జల్లించడం” లేదా “చెరగడం” అని అర్థం. ఒక రైతు ధాన్యం కోసం పనికిరాని పొట్టును చెరగడం లాంటిదే ఇది. “బాగా తెలుసుకోవడం” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “విలువైనదిగా ఎంచడం” అనే అర్థముంది. ప్రతీరోజు యెహోవా తన ఆరాధకుల మాటలను, పనులను పరిశీలిస్తున్నప్పుడు వాళ్లలోని మంచిని విలువైనదిగా ఎంచుతాడు. ఎందుకు? ఎందుకంటే, తనను సంతోషపర్చడానికి వాళ్లు చేసే ప్రయత్నాలను ఆయన ఇష్టపడతాడు.
యెహోవా తన ఆరాధకులను ఎంతో పట్టించుకుంటాడని 139వ కీర్తన చెబుతోంది. రోజువారీ పనులు చేస్తున్నప్పుడు ఆయన వాళ్లను పరిశీలిస్తాడు, వాళ్లను కనిపెట్టుకొని ఉంటాడు. అందుకే వాళ్లు అనుభవించే సమస్యలు ఆయనకు తెలుసు, ఈ కష్టాల వల్ల వాళ్ల మనసు ఎంత బాధపడుతుందో ఆయన అర్థంచేసుకుంటాడు. మనల్ని ఎంతో పట్టించుకునే అలాంటి దేవుణ్ణి ఆరాధించాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే, ‘మీరు చేసిన కార్యాన్ని, తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను’ యెహోవా ఎప్పటికీ మర్చిపోడనే నమ్మకంతో ఉండవచ్చు.—హెబ్రీయులు 6:10. (w11-E 09/01)