దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవడం సాధ్యమేనా?
ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తిని పేరుతో సంబోధించి, పలకరించగలగడం గొప్ప ఘనతే. పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లను మనం తరచూ “ముఖ్యమంత్రిగారు” “అధ్యక్ష” లేదా “యువర్ ఆనర్” అని మర్యాదపూర్వకంగా సంబోధిస్తాం. ఉన్నతస్థానంలో ఉన్నవాళ్లెవరైనా మనతో “ఫర్వాలేదు, నన్ను పేరుపెట్టి పిలువు” అంటే మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది.
సత్య దేవుడు బైబిల్లో ఇలా చెప్తున్నాడు, “యెహోవాను నేనే; ఇదే నా నామము.” (యెషయా 42:8) ఆయనకు “సృష్టికర్త,” “సర్వశక్తిగలవాడు,” “పరిశద్ధ తండ్రి” అనే వివిధ రకాల బిరుదులున్నా, తనను పేరుతో సంబోధించే అవకాశాన్ని తన నమ్మకమైన సేవకులకు ఇచ్చి వాళ్లను ఘనపర్చాడు.
ఉదాహరణకు, సొలొమోను రాజు యెరూషలేములోని ఆలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, “యెహోవా” అంటూ తన ప్రార్థనను మొదలుపెట్టాడు. (1 రాజులు 8:22, 23) “యెహోవా, నా ప్రార్థన ఆలకించుము” అని ఏలీయా ప్రవక్త కూడా దేవుణ్ణి వేడుకున్నాడు. (1 రాజులు 18:37) యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయుల తరఫున దేవునితో మాట్లాడుతూ “యెహోవా, నీవే మా తండ్రివి” అన్నాడు. (యెషయా 63:16) వీటన్నిటినిబట్టి, పరలోకంలోవున్న మన తండ్రి తనను పేరుతో సంబోధించమని కోరుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
యెహోవాను పేరుతో సంబోధించడం చాలా ముఖ్యమే అయినా దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవాలంటే మనమింకా ఎక్కువే చేయాలి. యెహోవా తనను ప్రేమించి, తనమీద నమ్మకముంచే వాళ్ల గురించి ఇలా మాటిస్తున్నాడు, ‘నా పేరు వాళ్లకు తెలుసు కాబట్టి నేను వాళ్లను కాపాడతాను.’ (కీర్తన 91:14, ఈజీ-టు-రీడ్ వర్షన్) దేవుడు మనల్ని కాపాడాలంటే ఆయన పేరు తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం కాబట్టి ఆయన పేరుకు చాలా అర్థముందని స్పష్టమవుతోంది. అయితే, యెహోవాను పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవాలంటే మనమేమి చేయాలి? (w10-E 07/01)