‘సహాయం కోసం ఎన్నాళ్లు అర్థించాలి?’
“ఈ నొప్పి భరించలేకపోతున్నాను!” అని జేన్ ఏడ్చింది. ఆమెకు క్యాన్సర్ శరీరమంతా పాకిపోయింది. ఆమె జబ్బు నయంచేసి, ఆ నొప్పిని తీసేయగలిగే శక్తి తమకుంటే బాగుండునని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో కోరుకున్నారు! ఆమెకు సహాయం చేయమని దేవునికి ప్రార్థించారు. ఆయన ఆ ప్రార్థనలు వింటాడా? అసలు పట్టించుకుంటాడా?
ప్ర జలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో దేవునికి తెలుసు. ‘సృష్టి అంతా మూలుగుతూ వేదన పడుతోంది’ అని ఆయన వాక్యమైన బైబిలు చెబుతోంది. (రోమీయులు 8:22) జేన్లా కోట్లాదిమంది ప్రతీరోజు శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నారని దేవునికి తెలుసు. ప్రతీరోజు 80 కోట్లమంది ఖాళీ కడుపుతో నిద్రపోవడం, లక్షలమంది గృహహింసకు బలికావడం, ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు, సంక్షేమం గురించి ఆందోళనపడడం దేవుడు చూస్తున్నాడు. ‘ఈ సమస్యలను పరిష్కరించడానికి దేవుడు ఏమైనా చేస్తాడా’ అని మీకెప్పుడైనా అనిపించిందా? మీకు అనిపించే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇష్టమైనవాళ్లు కష్టాల్లో ఉంటే సహాయం చేయాలని మనమే కోరుకుంటాం. అలాంటప్పుడు తాను సృష్టించిన మనుష్యులకు సహాయం చేయాలని దేవుడు కోరుకోడా?
మీరు కూడా ఈ విషయాల గురించి ఆలోచిస్తుంటే, అలా ఆలోచిస్తున్నది మీరొక్కరే కాదు. ఈ కాలంలో చాలామంది అనుకుంటున్నట్లే 2,600 సంవత్సరాల క్రితం నమ్మకంగా దేవున్ని ఆరాధించిన హబక్కూకు కూడా అనుకున్నాడు. అందుకే ఆయన దేవుణ్ణి ఇలా అడిగాడు: ‘యెహోవా, నేను సహాయం కోసం అర్థిస్తూనే ఉన్నాను. నీవు నా మొర ఎప్పుడు ఆలకిస్తావు? దౌర్జన్యం విషయంలో నేను నీకు మొరపెట్టాను. కాని నీవేమీ చేయలేదు! ప్రజలు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఇతరులను బాధపెడుతున్నారు. ప్రజలు వాదులాడుతూ, కలహిస్తున్నారు. నీవెందుకు నన్ను ఈ భయంకర విషయాలు చూసేలా చేస్తున్నావు?’ (హబక్కూకు 1:2, 3, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఈ హెబ్రీ ప్రవక్త తన కాలంలో, ప్రజలు దౌర్జన్యం చేయడం, పాశవికంగా ప్రవర్తించడం చూశాడు. ఈ రోజుల్లో కూడా మానవత్వం ఉన్న ప్రజలు అలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు ఎంతో బాధపడతారు.
హబక్కూకు అడిగింది పెద్ద విషయమేమీ కాదని దేవుడు కొట్టిపారేశాడా? లేదు. హబక్కూకు అడిగిన ప్రాముఖ్యమైన ప్రశ్నలను దేవుడు విని ఆయనను ఓదార్చి, ప్రోత్సహించాడు. కష్టాలన్నిటినీ తీసేస్తానని మాటిచ్చి యెహోవా దేవుడు హబక్కూకు నమ్మకాన్ని మరింత పెంచాడు. భవిష్యత్తు గురించి దేవుడిస్తున్న మాట జేన్కు, ఆమె కుటుంబానికి ధైర్యాన్నిచ్చినట్లే, మీకు కూడా ధైర్యాన్నిస్తుంది. అయితే, దేవుడు నిజంగా మన క్షేమం గురించి ఆలోచిస్తున్నాడని మనమెలా తెలుసుకోవచ్చు? కష్టాలను తీసేయడానికి దేవుడు ఏమి చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలను తర్వాతి ఆర్టికల్లో తెలుసుకుంటాం. (w09-E 12/01)