పాఠకుల ప్రశ్నలు
తల్లి గర్భంలోనే చనిపోయిన బిడ్డ పునరుత్థానం చేయబడుతుందా?
తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రుల భావాలు ఎలా ఉంటాయో అలా బిడ్డను పోగొట్టుకోనివారు ఊహించడం కష్టం కావచ్చు. కొంతమంది తల్లిదండ్రులు అలా బిడ్డను పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖిస్తారు. ఒక తల్లి ఐదుగురు పిల్లలను అలా పోగొట్టుకుంది. కొంతకాలానికి ఆమెకు ఆరోగ్యంగావున్న ఇద్దరు కుమారులు కలిగారు. అయినా ఆమె తాను పోగొట్టుకున్న పిల్లలను ఎంతో గుర్తుచేసుకుంటుంది. ఆ పిల్లలు బ్రతికివుంటే ఈపాటికి ఈ వయసులో ఉండేవారని ఆమె జీవితాంతం గుర్తుచేసుకుంటూనేవుంది. అలాంటి క్రైస్తవులు తాము పోగొట్టుకున్న పిల్లలను పునరుత్థానం ద్వారా తిరిగి పొందుతామని నిరీక్షించడానికి ఆధారమేమైనా ఉందా?
దానికి సరళమైన సమాధానం ఏమిటంటే, ఆ విషయం మనకు తెలియదు. తల్లి గర్భంలోనే చనిపోయిన పిల్లలు పునరుత్థానం చేయబడతారా లేదా అనే విషయం గురించి బైబిలు సూటిగా చెప్పడం లేదు. అయినప్పటికీ ఈ ప్రశ్నకు సంబంధించిన, కొంత ఓదార్పునిచ్చే సూత్రాలు దేవుని వాక్యంలో ఉన్నాయి.
దీనికి సంబంధించిన రెండు ప్రశ్నలను మనం పరిశీలిద్దాం. మొదటిగా, యెహోవా దృక్కోణం నుండి ఒక వ్యక్తి జీవం ఎప్పుడు ప్రారంభమౌతుంది, గర్భధారణ సమయంలోనా లేక బిడ్డ పుట్టినప్పుడా? రెండవదిగా, ఇంకా పుట్టని శిశువును యెహోవా ఎలా దృష్టిస్తాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానా లేక స్త్రీ గర్భంలోవున్న కణసముదాయంగానా? ఈ రెండు ప్రశ్నలకు బైబిలు సూత్రాలు స్పష్టమైన సమాధానాలు ఇస్తున్నాయి.
బిడ్డ పుట్టినప్పుడు కాదుగానీ అంతకంటే ఎంతోముందే జీవం ప్రారంభమౌతుందని మోషే ధర్మశాస్త్రం స్పష్టంగా వెల్లడిచేసింది. అదెలా? గర్భస్థ పిండాన్ని చంపితే మరణశిక్ష విధించబడుతుందని అది చూపించింది. ‘ప్రాణమునకు ప్రాణము చెల్లించవలెను’ అనే కట్టడను గమనించండి.a (నిర్గ. 21:22, 23) కాబట్టి, గర్భంలోవున్న శిశువు సజీవమైనదిగా, ఒక వ్యక్తిగా పరిగణించబడుతుంది. లక్షలాదిమంది క్రైస్తవులు ఈ తిరుగులేని సత్యాన్ని అర్థంచేసుకొని, గర్భస్రావం చేయించుకోవడాన్ని దేవుని ఎదుట గంభీరమైన పాపంగా దృష్టిస్తూ, గర్భస్రావం చేయించుకోవడం లేదు.
ఇంకా పుట్టని శిశువు సజీవమైనదన్న విషయం వాస్తవమే, అయితే ఆ జీవాన్ని యెహోవా ఎంత విలువైనదిగా పరిగణిస్తాడు? ఇంకా పుట్టని శిశువు మరణానికి కారణమైన వ్యక్తి చంపబడాలని పైన పేర్కొనబడిన చట్టం చెబుతుంది. కాబట్టి ఇంకా జన్మించని శిశువు జీవాన్ని దేవుడు ఎంతో విలువైనదిగా ఎంచుతాడని స్పష్టమౌతుంది. అంతేగాక యెహోవా, ఇంకా పుట్టని శిశువును ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణిస్తాడని అనేకానేక లేఖనాలు వెల్లడిచేస్తున్నాయి. ఉదాహరణకు, దావీదు రాజు యెహోవా గురించి ఇలా చెప్పేలా ప్రేరేపించబడ్డాడు, “నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. . . . నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను.”—కీర్త. 139:13-16; యోబు 31:14, 15.
ఇంకా జన్మించని శిశువులకు విభిన్న లక్షణాలు ఉంటాయని, వారికి ఎంతో భవిష్యత్తు ఉంటుందని కూడా యెహోవాకు తెలుసు. ఇస్సాకు భార్యయైన రిబ్కా గర్భంలో కవల పిల్లలు ఉన్నప్పుడు ఆమె గర్భంలో పోరాడుతున్న ఇద్దరు మగ పిల్లల గురించి యెహోవా ఒక ప్రవచనం చెబుతూ భవిష్యత్తులో చాలామందిపై ప్రభావం చూపించే లక్షణాలు అప్పటికే వారిలో ఉన్నాయని తాను గమనించినట్లు సూచించాడు.—ఆది. 25:22, 23; రోమా. 9:10-13.
అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను విషయం కూడా ఆసక్తికరమైనదే. సువార్త వృత్తాంతం ఇలా చెబుతోంది, “ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనెను.” (లూకా 1:41) ఈ సంఘటనను వర్ణిస్తూ వైద్యుడైన లూకా ఉపయోగించిన గ్రీకు పదం గర్భంలోవున్న పిండాన్ని గానీ పుట్టిన బిడ్డను గానీ సూచించవచ్చు. పశువుల తొట్టిలో పడుకొనివున్న శిశువైన యేసు గురించి చెప్పడానికి కూడా ఆయన అదే పదాన్ని ఉపయోగించాడు.—లూకా 2:12, 16; 18:15.
మొత్తానికి గర్భంలోవున్న శిశువుకు, అప్పుడే జన్మించిన శిశువుకు మధ్య చాలా పెద్ద తేడా ఉందని చెప్పడానికి బైబిలు మనకు ఏదైనా ఆధారాన్నిస్తుందా? అలా ఇవ్వడం లేదు. ఈ విషయం, ఆధునిక విజ్ఞానశాస్త్రం కనుగొంటున్న విషయాలతో పొందిక కలిగివుంది. ఉదాహరణకు గర్భంలోవున్న శిశువు బయట జరుగుతున్న వాటిని గ్రహించి వాటికి ప్రతిస్పందించగలదని పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి కాబోయే తల్లి తన గర్భంలో ఎదుగుతున్న బిడ్డతో అంత సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకుంటుందంటే అందులో ఆశ్చర్యమేమీలేదు.
గర్భంలోవున్న శిశువులందరూ ఒకే కాల పరిమితిలో జన్మించరు. ఈ ఉదాహరణ పరిశీలించండి, ఒక తల్లి నెలలు నిండకముందే ఒక శిశువుకు జన్మనిస్తుంది, ఆ శిశువు కొద్దిరోజుల తర్వాత చనిపోతుంది. మరో తల్లికి నెలలు నిండుతాయి కానీ ఆ బిడ్డ పుట్టబోయేముందు గర్భంలోనే చనిపోతుంది. పుట్టిన తర్వాత చనిపోయిన మొదటి శిశువు కేవలం పుట్టిన కారణాన్ని బట్టి పునరుత్థానం చేయబడుతుందా, మరైతే పుట్టకముందే చనిపోయిన రెండవ శిశువు పునరుత్థానం చేయబడదా?
కాబట్టి సమీకరించి చెప్పాలంటే, గర్భధారణ సమయంలోనే జీవం ప్రారంభమౌతుందనీ, ఇంకా పుట్టని శిశువును యెహోవా ఒక ప్రత్యేకమైన, విలువైన వ్యక్తిగా పరిగణిస్తాడనీ బైబిలు స్పష్టంగా బోధిస్తోంది. ఈ లేఖన సత్యాల వెలుగులో, గర్భంలోనే చనిపోయిన బిడ్డ పునరుత్థానం చేయబడే అవకాశం లేదన్న వాదన కొంతమందికి అసమంజసమైనదిగా అనిపించవచ్చు. నిజానికి అలాంటి వాదన మూలంగా, లేఖనానుసారంగా గర్భస్రావం తప్పు అనే మన నిర్ణయం సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతుందని వాళ్ళు భావించవచ్చు, నిజానికి ఈ నిర్ణయానికి ఆధారం ఆ సత్యాలే.
గతంలో ఈ పత్రిక గర్భంలోనే చనిపోయిన పిల్లలు ఎలా పునరుత్థానం చేయబడతారనే దాని గురించి కొన్ని ప్రశ్నలు లేవదీసింది, ఈ ప్రశ్నలు అలాంటి పునరుత్థానాలు జరిగే సాధ్యత గురించి సందేహాలు తలెత్తేలా చేశాయి. ఉదాహరణకు దేవుడు పరదైసులో, పూర్తిగా ఎదగని పిండాన్ని ఒక స్త్రీ గర్భంలో ప్రవేశపెడతాడా? అయితే పరిపాలక సభ ఆ విషయంపై మరింత అధ్యయనం చేసి, ప్రార్థనాపూర్వకంగా దాని గురించి ఆలోచించినప్పుడు, అలాంటి విషయాలు పునరుత్థాన నిరీక్షణపై నిజానికి ఏ విధమైన ప్రభావమూ చూపించవనే ముగింపుకు వచ్చింది. “దేవునికి సమస్తమును సాధ్యమే” అని యేసు చెప్పాడు. (మార్కు 10:27) ఆ వ్యాఖ్యానం ఎంత సత్యవంతమైనదో యేసు స్వంత అనుభవం చూపిస్తుంది, ఆయన జీవం పరలోకం నుండి కన్య గర్భంలోకి మార్చబడింది, ఇది మానవ దృక్కోణం నుండి చూస్తే పూర్తిగా అసాధ్యం.
కాబట్టి గర్భంలోనే చనిపోయే పిల్లలు పునరుత్థానం చేయబడతారని బైబిలు బోధిస్తోందని దీనంతటి భావమా? ఆ ప్రశ్నకు బైబిలు సూటిగా సమాధానం ఇవ్వడంలేదని నొక్కిచెప్పవలసిందే, కాబట్టి ఈ విషయంలో ఫలానా విధంగానే జరుగుతుందని మానవులు మొండిగా పట్టుపట్టడానికి ఆధారమేమీలేదు. ఈ విషయం గురించి దాదాపు అంతులేని రకాలైన ప్రశ్నలు తలెత్తవచ్చు. అయితే నిజానికి ఊహాకల్పనలు చేయకపోవడం మంచిది. మనకు తెలిసినదల్లా ఇదే: సమస్తం యెహోవా దేవుని చేతుల్లో ఉంది, ఆయన ఎంతో కృప, కనికరం గలవాడు. (కీర్త. 86:15) పునరుత్థానం ద్వారా మరణాన్ని నిర్మూలించాలని ఆయన హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. (యోబు 14:14, 15) ఆయన ఎప్పుడూ సరైనదే చేస్తాడని మనం నమ్మవచ్చు. ఆయన “అపవాది యొక్క క్రియలను లయపరచ[మని]” తన కుమారుణ్ణి ప్రేమపూర్వకంగా నిర్దేశించడం ద్వారా, ఈ దుష్టవిధానంలో జీవించడం మూలంగా మనకు కలిగే ఎన్నో గాయాలను స్వస్థపరుస్తాడు.—1 యోహా. 3:8.
[అధస్సూచి]
a ఈ వచనం కొన్నిసార్లు, తల్లి మరణించినప్పుడు మాత్రమే మరణశిక్ష విధించబడుతుందనే భావమిచ్చే విధంగా అనువదించబడింది. అయితే తల్లికి గానీ, ఆమె గర్భంలోవున్న బిడ్డకు గానీ హాని జరగడం గురించి ధర్మశాస్త్రం మాట్లాడుతుందని ఆదిమ హెబ్రీ మూలపాఠం చూపిస్తుంది.
[13వ పేజీలోని చిత్రం]
మనకు కలిగే బాధాకరమైన అనుభవాలన్నింటి నుండి యెహోవా మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు