యేసు నరకాగ్ని గురించి మాట్లాడాడా?
నరకాగ్ని సిద్ధాంతాన్ని నమ్మే కొంతమంది మార్కు 9:48లోవున్న యేసు మాటలను పేర్కొంటారు. ఆ వచనంలో ఆయన చావని పురుగుల గురించి, ఆరని అగ్ని గురించి ప్రస్తావించాడు. ఆ మాటల గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరెలా వివరిస్తారు?
ఒక వ్యక్తి తాను ఉపయోగించే బైబిలు భాషాంతరాన్నిబట్టి 44, 46, 48 వచనాలను చూపించవచ్చు (తెలుగు బైబిల్లోని అధఃస్సూచిని చూడండి), ఎందుకంటే కొన్ని భాషాంతరాల్లో అవి ఒకే విధంగా ఉన్నాయి.a తెలుగు బైబిల్లో ఇలా ఉంది: “నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపారవేయుము; రెండు కన్నులు కలిగి నరకములో [‘గెహెన్నాలో,’ NW] పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున [‘గెహెన్నాలో,’ NW] వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.”—మార్కు 9:47, 48.
అయితే, యేసు మాటలు, మరణానంతరం దుష్టులు నిరంతరం బాధించబడతారనే తలంపును సమర్థిస్తున్నాయని కొంతమంది అంటారు. ఉదాహరణకు, నావారా విశ్వవిద్యాలయపు సాగ్రాత్తా బీబ్లియా అనే స్పానిష్ బైబిల్లో ఈ వ్యాఖ్యానం ఉంది: “మన ప్రభువు నరకయాతనల గురించి ప్రస్తావించడానికి [ఈ మాటలను] ఉపయోగించాడు. ‘చావని పురుగు’ నరకశిక్షకు విధించబడినవారు అనుభవించే అంతులేని బాధను సూచిస్తుందని, ‘ఆరని అగ్ని’ వారు పొందే శారీరక బాధను సూచిస్తుందని ప్రజలు సాధారణంగా చెబుతుంటారు.”
అయితే, యేసు మాటలను యెషయా ప్రవచనంలోని చివరి వచనంతో పోల్చండి.b ఆయన యెషయా 66వ అధ్యాయంలోని వచనాన్ని ప్రస్తావిస్తున్నాడని స్పష్టమవ్వడం లేదా? ప్రవక్త అక్కడ “యెరూషలేము గోడ వెలుపటవున్న హిన్నోము లోయకు (గెహెన్నాకు)” వెళ్లడం గురించి మాట్లాడుతున్నాడని స్పష్టమౌతోంది. “ఆ లోయలో ఒకప్పుడు మానవులను బలి ఇచ్చేవారు (యిర్మీ. 7:31), చివరకు అది ఆ పట్టణంలోని చెత్తాచెదారం వేసే స్థలంగా తయారైంది.” (ది జెరోమ్ బిబ్లికల్ కమెంట్రీ) స్పష్టంగా, యెషయా 66:24 లోని సూచనార్థక పోలిక, ప్రజలు యాతనపెట్టబడడం గురించి తెలియజేయడంలేదు కానీ, అది కళేబరముల గురించి మాట్లాడుతోంది. ఆ వచనం, సజీవంగావున్న మానవులు చావరని చెప్పడం లేదు లేదా అమర్త్యమైన ఆత్మల సిద్ధాంతం గురించి చెప్పడంలేదు కానీ, పురుగులు చావవని చెబుతోంది. మరైతే యేసు మాటల భావమేమిటి?
ఎల్ ఇవాన్హెల్యో డి మార్కోస్ అనాలీసిస్ లింగ్విస్టీకో ఈ కోమెంటారియో ఎక్సెహీటీక్యో, అనే క్యాథలిక్ గ్రంథపు రెండవ సంపుటి, మార్కు 9:48పై చేసిన వ్యాఖ్యానాన్ని గమనించండి: “ఆ వాక్యం యెషయా (66, 24) నుండి తీసుకోబడింది. ప్రవక్త ఆ వచనంలో కళేబరాలు సాధారణంగా నాశనంచేయబడే రెండు విధానాల గురించి చెబుతున్నాడు: కుళ్లిపోవడం, కాల్చివేయబడడం . . . ఆ వచనంలో పురుగులు, అగ్ని ఒకేసారి ప్రస్తావించబడడం, నాశనం ఖచ్చితమన్న విషయాన్ని సూచిస్తుంది. . . . ఆ రెండు నాశన శక్తులు శాశ్వతమైనవిగా వర్ణించబడ్డాయి (‘ఆరదు, చావదు’): వాటిని తప్పించుకొనే అవకాశమే లేదు. ఈ సూచనార్థక వర్ణనలో, నాశనం కాకుండా ఉండేవి పురుగు, అగ్ని మాత్రమే గానీ మానవుడు కాదు. ఈ రెండూ వాటికి దొరికే దేనినైనా కబళించేస్తాయి. అందుకే, ఈ వచనం నిత్యయాతన గురించి చెప్పడంలేదు గానీ నిత్యనాశనం గురించి చెబుతోంది, ఎందుకంటే, వారు మళ్లీ ఎన్నడూ పునరుత్థానం చేయబడరు. అది చివరి మరణంతో సమానం. కాబట్టి, [అగ్ని] సమూల నాశనానికి చిహ్నంగా ఉంది.”
సత్యదేవుడు ఎంత ప్రేమగలవాడో ఎంత న్యాయవంతుడో తెలిసిన వారెవరైనా యేసు మాటలను ఆ విధంగా అర్థంచేసుకోవడం ఎంత సహేతుకమో గుర్తించగలగాలి. దుష్టులు నిత్య యాతన అనుభవిస్తారని ఆయన చెప్పడం లేదు. బదులుగా, వారు పునరుత్థాన నిరీక్షణ లేకుండా నిత్యనాశనాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని ఆయన చెబుతున్నాడు.
[అధస్సూచీలు]
a ఎంతో నమ్మదగిన బైబిలు రాతప్రతుల్లో 44, 46 వచనాలు కనిపించవు. ఈ రెండు వచనాలు బహుశా తర్వాత చేర్చబడి ఉండవచ్చని విద్వాంసులు అంగీకరిస్తున్నారు. ప్రొఫెసర్ ఆర్కాబోల్డ్ టి. రాబర్ట్‌సన్ ఇలా రాశాడు: “పురాతనమైన, శ్రేష్ఠమైన రాతప్రతుల్లో ఈ రెండు వచనాలు కనిపించవు. అవి వెస్ట్రన్, సిరియన్ (బైజాంటైన్) వర్గానికి చెందిన రాతప్రతుల్లో చేర్చబడ్డాయి. ఆ రాతప్రతుల్లో 48వ వచనంలోని మాటలే 44, 46 వచనాల్లో కనిపిస్తాయి. కాబట్టి, మేము ప్రామాణికంకాని ఆ వచనాల్లోని మాటలను [తొలగించాం.]”
b “వారు పోయి నామీద తిరుగుబాటుచేసినవారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.”—యెష. 66:24.