పాఠకుల ప్రశ్నలు
బైబిలు టోస్టింగ్ (గ్లాసులు పైకెత్తి, మద్యం త్రాగడం ద్వారా ఎవరినైనా లేక దేన్నైనా గౌరవించడానికి ఆహ్వానించడం) గురించి ప్రస్తావించకపోయినా, యెహోవాసాక్షులు దానిలో ఎందుకు పాల్గొనరు?
ద్రాక్షారసంతో లేదా (మరో మద్యపానీయంతో) టోస్టింగ్ చేయడం అనాదిగా వస్తున్న, విస్తృతంగా వ్యాపించిన ఆచారం, అయితే అదెలా చేస్తారనేది ప్రాంతాన్నిబట్టి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు టోస్టింగ్ చేసేవారు తమ గ్లాసుల అంచులను ఒకదానికొకటి తాకిస్తారు. టోస్ట్‌ను ప్రతిపాదించే వ్యక్తి సాధారణంగా మరొకరి సంతోషం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఇతరత్రా విషయాలను గురించి విన్నవిస్తాడు లేదా కోరతాడు. దానిలో పాల్గొనే ఇతరులు కూడా తమ మాటల ద్వారా లేదా తమ గ్లాసులు పైకెత్తి కొంత ద్రాక్షారసాన్ని సేవించడం ద్వారా తమ అంగీకారాన్ని తెల్పుతారు. చాలామందికి ఆ ఆచారం నిరపాయకరమైనదిగా, ఇతరుల సంక్షేమార్థం చేసేదిగా అనిపించవచ్చు. అయితే, యెహోవాసాక్షులు అందులో పాల్గొనకపోవడానికి మంచి కారణాలే ఉన్నాయి.
ఇతరులు సంతోషంగా ఉండాలని లేక మంచి ఆరోగ్యంతో ఉండాలని క్రైస్తవులు కోరుకోరని దానర్థం కాదు. మొదటి శతాబ్దపు పరిపాలక సభ సంఘాలకు వ్రాసిన ఒక ఉత్తరాన్ని, “మీకు క్షేమము కలుగునుగాక,” “క్షేమముగా ఉండండి” అని అనువదించబడిన మాటలతో ముగించింది. (అపొస్తలుల కార్యములు 15:28) అంతేకాదు, కొందరు సత్యారాధకులు మానవ పరిపాలకులను, “రాజు . . . సదాకాలము బ్రదుకును గాక,” “రాజు చిరంజీవి యగునుగాక” అని దీవించేవారు.—1 రాజులు 1:31; నెహెమ్యా 2:3.
మరి టోస్టింగ్ ఆచారం యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? కావలికోట (ఆంగ్లం) జనవరి 1, 1968వ సంచిక ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1910), 13వ సంపుటి 121వ పేజీ నుంచి ఉల్లేఖిస్తూ ఇలా వ్రాసింది: “జీవించివున్నవారి ‘ఆరోగ్య’ సంక్షేమార్థం మద్యం సేవించే ఆచారం, బహుశా దేవుళ్ల కోసం, చనిపోయినవారి కోసం మద్యం సేవించే ప్రాచీన మత సంప్రదాయం నుంచే వచ్చివుండవచ్చు. గ్రీసు దేశస్థులు, రోమన్లు భోజన సమయాల్లో తమ దేవుళ్లకు జలాంజలి అర్పించేవారు, ఆచారబద్ధమైన విందుల్లో దేవుళ్ల కోసం మృతిచెందిన వారికోసం మద్యం సేవించేవారు.” ఆ ఎన్‌సైక్లోపీడియా ఇంకా ఇలా చెబుతోంది: “అర్పణ పేరుతో మద్యం సేవించే ఈ ఆచారానికి, బ్రతికివున్నవారి ఆరోగ్యం కోసం మద్యం సేవించే టోస్టింగ్ ఆచారానికి చాలా దగ్గర సంబంధం ఉంది.”
అది ఇప్పటికీ వర్తిస్తుందా? ఇంటర్‌నేషనల్ హాండ్‌బుక్ ఆన్ ఆల్కహాల్ ఎండ్ కల్చర్ 1995 ఇలా చెబుతోంది: “దేవుళ్లకు పవిత్ర జలాన్ని అందించే జలాంజలి అర్పణల మతేతర శేషభాగమే [టోస్టింగ్] అయ్యుండవచ్చు. ప్రజలు ‘దీర్ఘాయుష్షు కలుగునుగాక!’ లేక ‘మీ ఆరోగ్యం కోసం’ లాంటి పదాలతో కూడిన సంక్షిప్త ప్రార్థనలు చేసి, వాటిని తీర్చేందుకు తమ దేవుళ్లకు రక్తం లేదా ద్రాక్షారసం అర్పించేవారు.”
ఒక వస్తువు, రూపం లేదా ఆచారం ప్రాచీన అబద్ధ మతాలనుండి వచ్చినంత మాత్రాన లేక వాటితో పోలికలున్నంత మాత్రాన సత్యారాధకునికి అవి అనంగీకారమైనవని ఖచ్చితంగా చెప్పలేమనేది నిజమే. దానిమ్మ పండునే తీసుకోండి. ఒక ప్రఖ్యాత బైబిలు సర్వసంగ్రహ నిఘంటువు ఇలా చెబుతోంది: “అన్య మతాల్లో దానిమ్మ పండును కూడా పవిత్ర చిహ్నంగా ఉపయోగించినట్లు కనిపిస్తోంది.” అయినా, దేవుడు ప్రధానయాజకుని వస్త్రాల అంచులకు దారంతో చేసిన దానిమ్మ పండ్లను కుట్టాలని, సొలొమోను ఆలయపు ఇత్తడి స్తంభాలను దానిమ్మ పండ్లతో అలంకరించాలని చెప్పాడు. (నిర్గమకాండము 28:33; 2 రాజులు 25:17) అంతేకాక, ఒకప్పుడు వివాహపు ఉంగరాలకు కూడా మతసంబంధమైన ప్రాముఖ్యత ఉండేది. కానీ నేడు అనేకమందికి ఆ విషయమే తెలియదు, వారు వివాహపు ఉంగరాల్ని తమకు వివాహం జరిగిందని సూచించడానికే పెట్టుకుంటారు.
అయితే, మతాచారాలకు సంబంధించి ద్రాక్షారసాన్ని ఉపయోగించే విషయమేమిటి? ఉదాహరణకు, బయలు దేవతను ఆరాధించే, షెకెముకు చెందిన పురుషులు ఒకసారి “తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు” గిద్యోను కుమారుడైన ‘అబీమెలెకును దూషించారు.’ (న్యాయాధిపతులు 9:22-28) యెహోవాకు విశ్వసనీయుడైన వ్యక్తి, అబీమెలెకుకు వ్యతిరేకంగా అబద్ధ దేవుని ప్రభావం ఉండాలనే సంకల్పంతో బహుశా అలా మద్యం సేవించి ఉండేవాడని మీరు అనుకుంటున్నారా? అనేకమంది ఇశ్రాయేలీయులు యెహోవాకు ఎదురు తిరిగిన సమయాన్ని గురించి వర్ణిస్తూ ఆమోసు ఇలా వ్రాశాడు: “వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు, జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.” (ఆమోసు 2:8) దేవుళ్లకు జలాంజలిగా అర్పించబడిన లేదా దానికి సంబంధించిన ఆచారంలో భాగంగా ద్రాక్షారసాన్ని త్రాగడంలో సత్యారాధకులు పాల్గొని ఉండేవారా? (యిర్మీయా 7:18) ఒకరి భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించాలని లేదా ఆయనకు సంతోషకరమైన భవిష్యత్తు ఉండాలని సత్యారాధకుడు తన ద్రాక్షారసపు గ్లాసులు పైకెత్తి కోరగలడా?
ఆసక్తికరంగా, యెహోవా ఆరాధకుల్లో కొందరు కొన్ని సందర్భాల్లో చేతులెత్తి మంచి జరగాలని వేడుకున్నారు. వారు తమ చేతులను సత్య దేవునివైపు ఎత్తారు. మనమిలా చదువుతాం: “సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి యిట్లనెను—‘యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, . . . నీవంటి దేవుడొకడును లేడు; . . . నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.’” (1 రాజులు 8:22, 23, 30) అదే విధంగా, “ఎజ్రా . . . యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి—‘ఆమేన్ ఆమేన్’ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి.” (నెహెమ్యా 8:6; 1 తిమోతి 2:8) ఆ నమ్మకస్థులు ఏదో అదృష్ట దేవతనుండి వరం పొందడం కోసం ఆకాశం వైపు తమ చేతులు ఎత్తలేదనేది స్పష్టం.—యెషయా 65:11.
నేడు టోస్టింగ్‌లో పాల్గొనే అనేకమంది ఏదో దేవుణ్ణి దీవెనల కోసం కోరుతున్నామని అనుకోకపోవచ్చు, అయితే వారు తమ ద్రాక్షారసపు గ్లాసులను ఆకాశంవైపు ఎందుకు ఎత్తుతున్నారో కూడా చెప్పలేరు. వారు ఆ విషయాన్ని గంభీరంగా తీసుకోనంత మాత్రాన నిజ క్రైస్తవులు వారు చేసేదాన్ని అనుకరించాలనుకోవడం సహేతుకం కాదు.
ఇతర విషయాల్లో కూడా ప్రజలు సాధారణంగా చేసే సంజ్ఞలను యెహోవాసాక్షులు చేయకుండా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు, అనేకమంది జాతీయ చిహ్నాలకు లేదా జెండాలకు నమస్కరిస్తారు, అలా చేయడం వారికి ఆరాధన కాకపోవచ్చు. నిజ క్రైస్తవులు అలా చేసేవారిని అడ్డుకోరు, కానీ వారు వ్యక్తిగతంగా అలాంటి క్రియల్లో పాల్గొనరు. అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయో ముందే తెలుసుకొని, ఇతరులను అభ్యంతరపెట్టకుండా ఉండేలా చాలామంది సాక్షులు యుక్తిగా ప్రవర్తించారు. ఏది ఏమైనా, వారు బైబిలుకు విరుద్ధమైన, జాతీయతను సమర్థించే ఎలాంటి క్రియలు చేయకూడదనే తీర్మానంతో ఉంటారు. (నిర్గమకాండము 20:4, 5; 1 యోహాను 5:21) టోస్టింగ్‌ను నేడు చాలామంది మత సంబంధమైన ఆచారంగా పరిగణించకపోవచ్చు. అయినా నిజ క్రైస్తవులు టోస్టింగ్ చేయడాన్ని నివారించేందుకు సరైన కారణాలే ఉన్నాయి ఎందుకంటే దానికి మతసంబంధమైన నేపథ్యం ఉంది, అది ఇప్పటికీ దీవెన కోసం ‘ఆకాశాన్ని’ లేదా సహాయం కోసం మానవాతీత శక్తిని అర్థిస్తున్నట్లే అవుతుంది.—నిర్గమకాండము 23:2.