“దేవుడున్నాడని నేను ఈ రోజు నుండి నమ్ముతున్నాను”
ఛె క్ రిపబ్లిక్‌లోని, ప్రేగ్ నగరంలో నివసిస్తున్న ఆల్యిక్సాండ్రా అనే యూక్రేన్ దేశస్థురాలు, ఉద్యోగ స్థలం నుండి ఇంటికి వెళ్తోంది. స్ట్రీట్‌కార్ నిలిపేస్థలంవద్ద, నేలపై ఉన్న ఒక చిన్న పర్సును దారిలో వెళ్తున్నవారు తన్నుకుంటూ పోవడాన్ని ఆమె గమనించింది. పర్సును తీసుకొని చూసినప్పుడు, తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. దానిలో 5,000 కొరూనా నోట్లు ఉన్నాయి! చుట్టూ ఉన్నవారెవరూ ఆ పర్సు కోసం వెదుకుతున్నట్లు ఆమెకు అనిపించలేదు. ఆల్యిక్సాండ్రా ఛెక్ రిపబ్లిక్లో నివసిస్తున్న విదేశీయురాలు కాబట్టి, జీవనోపాధి సంపాదించుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. మరి దొరికిన డబ్బుతో ఆమె ఏమి చేసింది?
ఇంటికి వచ్చిన తర్వాత, ఆల్యిక్సాండ్రా ఆ పర్సును తన కూతురు విక్టోరియాకు చూపించింది. యజమాని పేరు, అడ్రస్ కోసం ఆ పర్సులో వెతికారు, కానీ వారికేమీ దొరకలేదు. అయితే, ఆ పర్సులో కొన్ని నంబర్లు వ్రాసివున్న ఒక చిన్న కాగితం ఉంది. కాగితానికి ఒకవైపు ఓ అక్కౌంటు నంబరు, మరోవైపు మరిన్ని నంబర్లు వ్రాసివున్నాయి. ఆ పర్సులో, దగ్గర్లోవున్న బ్యాంక్‌కు వెళ్ళడానికి నిర్దేశాలు, “330,000 కొరూనిలు” (4,50,000 రూపాయలు) అని తెలియజేసే చీటి కూడా ఉంది. పర్సులో సరిగ్గా అంతే డబ్బు ఉంది.
ఫోన్ నంబర్లాగా కనిపించిన నంబర్‌తో బ్యాంక్‌కు ఫోన్ చేయడానికి ఆల్యిక్సాండ్రా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందుకే ఆమె, ఆమె కూతురు బ్యాంక్‌కు వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. పర్సులో వారికి దొరికిన అక్కౌంట్ నంబరు గురించిన వివరాలు అడిగారు. అయితే, బ్యాంక్‌వారి దగ్గర ఆ అక్కౌంట్‌కు సంబంధించిన వివరాలేమీ లేవు. తర్వాతిరోజు, ఆల్యిక్సాండ్రా పర్సులో ఉన్న మరో నంబరును తీసుకొని వచ్చింది. ఆ బ్యాంక్‌లో ఆ అక్కౌంట్ నంబరుతో ఉన్న ఒక మహిళ ఖాతాదారు ఉంది. ఆల్యిక్సాండ్రా, విక్టోరియా ఆ స్త్రీకి ఫోన్‌చేసి, ఆమె డబ్బేమైనా పోగొట్టుకుందేమోనని అడిగారు. చివరికి వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు, ఆ స్త్రీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి, “నా డబ్బును తిరిగి ఇచ్చేందుకు మీ షరతులు ఏమిటి?” అని అడిగింది.
దానికి విక్టోరియా “అలాంటి షరతులేమీ లేవు. డబ్బు కావాలనుకుంటే మేము దాన్ని మా దగ్గరే ఉంచుకొనేవాళ్లం” అని జవాబిచ్చింది. తనకు వచ్చీరాని ఛెక్ భాషలో, ఆమె ఇలా వివరించింది: “మేము యెహోవాసాక్షులం కాబట్టే ఈ డబ్బును మీకు తిరిగి ఇస్తున్నాం. మాకు చెందనిది ఉంచుకొనేందుకు మా బైబిలు శిక్షిత మనస్సాక్షి ఒప్పుకోదు.” (హెబ్రీయులు 13:18) దాంతో ఆ స్త్రీ సంతోషంగా, “దేవుడున్నాడని నేను ఈ రోజు నుండి నమ్ముతున్నాను” అని అన్నది.