“ఊదారంగు త్రికోణం దేన్ని సూచిస్తుంది?”
“కొన్నిరోజుల క్రితం ఒక యెహోవాసాక్షి నాకొక కావలికోట ప్రతిక ఇచ్చింది” అని రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోవున్న సియోల్‌లోని న్యాయశాఖలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వోద్యోగి వ్రాశాడు. ఆయనింకా ఇలా వ్రాశాడు: “అది చదివి, నాజీ, కమ్యూనిస్టు పాలనల్లో యెహోవాసాక్షులు అనుభవించిన హింస గురించిన కొన్ని వాస్తవాలను నేను తెలుసుకున్నాను. కానీ నాకో సందేహం ఉంది. ముఖచిత్రంలో, యెహోవాసాక్షులు ధరించిన చొక్కాయిలమీద ఎడమవైపున తలక్రిందులుగావున్న ఊదారంగు త్రికోణం చూపించబడింది. ఆ ఊదారంగు త్రికోణం దేన్ని సూచిస్తుంది?”
జర్మనీలో నాజీ పరిపాలన క్రింద యెహోవాసాక్షులు హిట్లర్‌కు జైకొట్టడానికి నిరాకరిస్తూ రాజకీయ, సైనిక వ్యవహారాల్లో తమ తటస్థతను కాపాడుకున్నారు. దానితో నాజీలు వారిని క్రూరంగా హింసించారు, దాదాపు 12,000 మంది సాక్షులను వివిధ శిక్షాకాలాలతో చెరసాలల్లో, నిర్బంధ శిబిరాల్లో ఖైదుచేశారు. వారిలో దాదాపు 2,000 మంది మరణించారు, వందలాదిమంది ఉరితీయబడ్డారు.
వాళ్ళ చెరసాల దుస్తులపై ఉన్న ఆ ఊదారంగు త్రికోణం దేనిని సూచించింది? అనాటమీ ఆఫ్ ద ఎస్ ఎస్ స్టేట్ అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “[నాజీ] క్యాంపుల్లోని వివిధ వర్గాల ఖైదీలకు ప్రత్యేకమైన గుర్తింపు చిహ్నాలుండేవి. యుద్ధానికి ముందు ప్రవేశపెట్టబడిన గుర్తింపు చిహ్నాలు వేసే ఈ ప్రమాణం ప్రకారం, ఒక్కో ఖైదీ దుస్తుల మీద అతడు ఏ వర్గానికి చెందుతాడనే దానినిబట్టి ఒక్కో రంగు త్రికోణాకారపు చిన్నగుడ్డ కుట్టబడింది: రాజకీయ ఖైదీలకు ఎరుపురంగు; యెహోవాసాక్షులకు ఊదారంగు; సంఘవిద్రోహులకు నలుపురంగు; నేరస్థులకు ఆకుపచ్చరంగు; స్వలింగసంపర్కులకు గులాబిరంగు; వలసదారులకు నీలంరంగు. యూదా ఖైదీలు మాత్రం, ఆ త్రికోణం ఏ రంగులోవున్నా దాని మీదే, షట్భుజాకారంలో దావీదు నక్షత్రంలా కనిపించేలా మరో పసుపురంగు త్రికోణం కుట్టిన బట్టలు వేసుకోవాలి.”
జాన్ కె. రోత్ అనే పండితుడు హోలోకాస్ట్ పాలిటిక్స్ అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “ఊదారంగు త్రికోణాన్ని దాని నైతిక ప్రాముఖ్యతకు భవిష్యత్తులో విస్తృతంగా గుర్తుంచుకోబడినప్పుడు, ఆ భవిష్యత్తులోనూ అది విపత్తుకు వ్యతిరేకంగా ఒక రక్షణలా ఉండగలదు, దాని మూడు కోణాలు, మానవ మన్ననకు ఎంతో అర్హమైన మంచివైపుకు మన అవధానాన్ని మళ్లించడమే కాక, మన బాధ్యతనూ గుర్తుచేస్తాయి.” యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు (ఆంగ్లం) అనే, అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీని యెహోవాసాక్షులు తయారుచేశారు. ఈ వీడియో చూసే అవకాశం కల్పించమని మీరు యెహోవాసాక్షుల్లో ఒకరిని ఎందుకు అడగకూడదు?