మీరు ఎలాంటిపేరు సంపాదించుకుంటున్నారు?
మీరెప్పుడైనా మీ స్థానిక వార్తా పత్రికలో సంస్మరణ కాలమ్ చదివారా లేక మరణించిన ఒక వ్యక్తి జీవిత చరిత్ర, ఆయన సాధించినవాటిని గురించి తెలియజేసే ఓ పెద్ద నివేదిక చూశారా. ‘ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకుంటారు’ అని మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా? తమ మరణం తర్వాత తమనెలా గుర్తుచేసుకుంటారు అని అసలు ఎంతమంది ఆలోచిస్తారు? అందువల్ల, సూటియైన ఈ ప్రశ్నలను పరిశీలించండి: నిన్న మీరు మరణించి ఉంటే నేడు మీ గురించి ప్రజలేం మాట్లాడుకుంటారు? మీరెలాంటి పేరు సంపాదించుకుంటున్నారు? మిమ్మల్ని ఎరిగినవారు అలాగే దేవుడు, మీరెలాంటి వారని గుర్తుంచుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు?
బైబిలు పుస్తకమైన ప్రసంగి వ్రాసిన జ్ఞాని ఇలా అన్నాడు: “సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒక వ్యక్తి జన్మ దినముకంటె మరణదినమే మేలు.” (ప్రసంగి 7:1) ఒకని జన్మ దినంకంటె మరణదినమే ఎందుకు మేలు? ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతనికి ఎలాంటి పేరుప్రతిష్ఠలు ఉండవు. అతని వ్యక్తిగత ఫలకం ఖాళీగా ఉంటుంది. అతని జీవన విధానంవల్ల అతనికి మంచిపేరు లేదా చెడ్డపేరు రావచ్చు. సంవత్సరాలు గడిచేకొలది మంచిపేరు సంపాదించుకున్న వారికి నిజానికి, జన్మ దినంకంటే మరణదినమే మేలు.
కాబట్టి ఎంపిక మనచేతిలో ఉంది. వాస్తవానికి, మరణించే నాటికి మనమెలాంటి పేరు సంపాదించుకుంటామో, ప్రత్యేకంగా దేవుడు మనల్నెలా గుర్తుంచుకుంటాడో నిర్ణయించే అనేక ఎంపికలు దైనందిన జీవితంలో మనకు ఎదురౌతుంటాయి. అందుకే, జ్ఞానియైన ఆ హెబ్రీయుడే ఇలా వ్రాశాడు: “నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును.” (సామెతలు 10:7) ఆశీర్వదించేందుకు దేవుడు మనల్ని గుర్తుంచుకోవడం ఎంతటి భాగ్యమో గదా!
మనం జ్ఞానులమైతే, దేవుని కట్టడలకు అనుగుణంగా జీవిస్తాము ఆయనను ప్రీతిపరచాలన్నదే మన లక్ష్యమై ఉంటుంది. అంటే క్రీస్తు వ్యక్తంచేసిన ఈ ప్రాథమిక సూత్రాలను అనుసరించడమని దాని భావం: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.”—మత్తయి 22:37-40.
కొందరు మహాదాతలుగా, మానవతావాదులుగా, పౌరహక్కుల పరిరక్షకులుగా లేదా వ్యాపార, వైజ్ఞానిక, వైద్య, లేదా ఇతర రంగాల్లో వారు సాధించిన వాటినిబట్టి గుర్తుచేసుకోబడుతున్నారు. అయితే, మీరెలా గుర్తుచేసుకోబడాలని కోరుకుంటున్నారు?
మనల్ని ఇతరులు చూసినట్లుగా మనల్ని మనం చూసుకొనే వరం దేవుడు మనకిస్తే బాగుంటుందనే ఆకాంక్షను స్కాట్లండుదేశ కవి రాబర్ట్ బర్న్స్ (1759-96) వ్యక్తంచేశాడు. నిశితంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, ఇతరులతో, దేవునితో మీకు మంచి పేరుందని మీరు చెప్పగలరా? క్రీడా లేదా వ్యాపార ప్రపంచంలో మనం సాధించే అల్పకాల సాఫల్యాలకన్నా ఇతరులతో మన సంబంధాలే నిశ్చయంగా చివరకు మరి విశేషమైనవై ఉంటాయి. కాబట్టి ప్రశ్నేమంటే: మనం ఇతరులతో వ్యవహరించే విధానం అంటే మన సంభాషణ, మన సంస్కారం, మన శరీర భాష వారిపై ప్రభావం చూపుతుందా? మనల్ని వారెలా దృష్టిస్తారు, సమీపింపదగిన వారిగానా లేక దూరదూరంగా ఉండే వారిగానా? దయగల వారిగానా లేక కఠినస్థులుగానా? మృదుస్వభావిగానా లేక ఖండించే వారిగానా? ప్రేమ, దయ గలవారిగానా లేక ప్రేమరహితమైన, ఎలాంటి భావాలు లేని వ్యక్తిగానా? నిరుత్సాహపరిచే విమర్శకునిగానా లేక క్షేమాభివృద్ధి కలిగించే సలహాదారునిగానా? మనమెలా మంచిపేరు సంపాదించుకోగలమో చూసేందుకు ప్రాచీన, ఆధునిక కాలాల్లోని కొన్ని ఉదాహరణలు మనం పరిశీలిద్దాం.
[3వ పేజీలోని చిత్రం]
మనల్ని ఇతరులు చూసినట్లుగా మనల్ని మనం చూసుకొనే వరం దేవుడు మనకిస్తే బాగుంటుందని రాబర్ట్ బర్న్స్ ఆకాంక్షించాడు
[చిత్రసౌజన్యం]
From the book A History of England