“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”
ముందు, తర్వాత ఆమె మారడానికి కావలసిన శక్తిని పొందింది
మెక్సికోకు చెందిన సాండ్రా అనే స్త్రీ, తాను తన కుటుంబ ప్రమాణాలకు తగిన విధంగా జీవించేదాన్ని కాదని చెబుతోంది. యౌవనస్థురాలిగా ఆమె నిరాదరణకు, అనురాగరాహిత్యానికి గురయ్యింది. “నేను నా యౌవనమంతటిలో శూన్యభావాన్ని అనుభవించాను, నా ఉనికి గురించి నా జీవితం గురించి నాకెన్నో సందేహాలుండేవి.”
సాండ్రా ఉన్నత పాఠశాలలో చదువుకునేటప్పుడు తన తండ్రి ఇంట్లో తెచ్చిపెట్టుకున్న వైన్ త్రాగడం మొదలుపెట్టింది. త్వరలోనే ఆమె తన సొంతగా సీసాలు కొనుక్కోవడం ప్రారంభించి, త్రాగుబోతుగా మారింది. “నాకు జీవించాలన్న ఆశే ఉండేది కాదు” అని ఆమె అంగీకరిస్తోంది. నిరాశతో ఆమె మాదకద్రవ్యాలకు అలవాటుపడింది. “నా సమస్యల్ని మర్చిపోవడానికి నాకు సహాయం చేసినవల్లా నేనెప్పుడూ నా పర్సులో పెట్టుకునే సీసా, కొన్ని మాదకద్రవ్యాలు లేదా కొంచెం మారిజూనా.”
సాండ్రా మెడికల్ స్కూల్లో తన విద్య ముగించిన తర్వాత త్రాగుడుకు మరింతగా బానిసయ్యింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ బ్రతికి బయటపడింది.
సాండ్రా ఆధ్యాత్మిక సహాయం కోసం, భావోద్వేగపరమైన మద్దతు కోసం అనేక విభిన్న మతాల్ని అన్వేషించి విఫలమైంది. ఆమె ఆశలన్నీ కోల్పోయి నిరాశకు లోనై, “ఎక్కడున్నావు? నాకెందుకు సహాయం చేయడం లేదు” అని దేవునికి పదే పదే మొరపెట్టుకుంది. ఆమె స్వాభిమానం పూర్తిగా దిగజారిపోయే స్థితికొస్తున్న సమయంలో యెహోవాసాక్షులు ఆమెతో మాట్లాడారు. దానితో ఆమె వ్యక్తిగత బైబిలు అధ్యయనం ప్రారంభించింది. “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు” అని తెలుసుకుని సాండ్రా ఎంతో చలించిపోయింది.—కీర్తన 34:18.
సాండ్రాతో బైబిలు అధ్యయనం చేసిన సాక్షి, ఆదాము నుండి వారసత్వంగా పొందిన పాప అపరిపూర్ణతల మూలంగా మనం బలహీనంగా ఉన్నామనే విషయం యెహోవా దేవునికి తెలుసని అర్థం చేసుకోవడానికి ఆమెకు సహాయం చేసింది. నీతియుక్తమైన ప్రమాణాలకు మనం పరిపూర్ణంగా సరితూగలేమని దేవుడు అర్థం చేసుకుంటాడని సాండ్రా గ్రహించింది. (కీర్తన 51:5; రోమీయులు 3:23; 5:12, 18) యెహోవా మన బలహీనతలపైనే తన అవధానాన్ని కేంద్రీకరించడనీ మనం చేయగలిగినదానికన్నా ఎక్కువ ఆశించడనీ తెలుసుకుని ఆమె ఎంతో సంతోషించింది. కీర్తనకర్త ఇలా అడిగాడు, “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?”—కీర్తన 130:3.
సాండ్రా హృదయంలో కృతజ్ఞతను నింపిన ఒక ప్రాముఖ్యమైన బైబిలు సత్యం, యేసుక్రీస్తు చెల్లించిన విమోచన క్రయధన బలి. దాని ద్వారా, యెహోవా విధేయులైన మానవుల్లో అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ వారికి నీతియుక్తమైన స్థానాన్ని దయతో అనుగ్రహిస్తాడు. (1 యోహాను 2:2; 4:9, 10) అవును “మన అపరాధములకు క్షమాపణ” పొంది తద్వారా, మనం విలువలేని వారమనే భావాలను అధిగమించడానికి సహాయాన్ని పొందవచ్చు.—ఎఫెసీయులు 1:7.
అపొస్తలుడైన పౌలు ఉదాహరణ నుండి సాండ్రా విలువైన పాఠాలు నేర్చుకుంది. తన గత పొరపాట్లను దయతో క్షమించడంలోనూ మళ్ళీ మళ్ళీ తలెత్తే బలహీనతలను అధిగమించడానికి తాను చేస్తున్న తీవ్రమైన పోరాటానికి మద్దతునివ్వడంలోనూ దేవుడు చూపించిన కనికరాన్ని ఆయన ఎంతో విలువైనదిగా ఎంచాడు. (రోమీయులు 7:15-25; 1 కొరింథీయులు 15:9, 10) పౌలు తన జీవిత విధానాన్ని సరిచేసుకుని, దేవుడు ఆమోదించే మార్గంలో ఉండడానికి ‘తన శరీరమును నలగగొట్టి దానిని లోబరచుకున్నాడు.’ (1 కొరింథీయులు 9:27) తన పాపభరితమైన కోరికలు తనను లోబరచుకోవడానికి ఆయన అనుమతించలేదు.
సాండ్రా బలహీనతలు ఆమెను చాలా పీడించాయి కానీ ఆమె వాటితో పోరాడడం కొనసాగించింది. వాటిని అధిగమించడానికి యెహోవా సహాయం కోసం ఆమె పట్టుదలతో ప్రార్థించి ఆయన కనికరాన్ని వెదకింది. (కీర్తన 55:22; యాకోబు 4:8) దేవునికి వ్యక్తిగతంగా తన పట్ల ఆసక్తి ఉందనే విషయాన్ని గ్రహించిన సాండ్రా తన జీవిత విధానాన్ని మార్చుకోగలిగింది. “ఇతరులకు పూర్తికాలం బైబిలు బోధించడం వల్ల కలిగే ఆనందాన్ని నేను పొందుతున్నాను” అంటోంది సాండ్రా. తన అక్కకు, చెల్లికి యెహోవా గురించి తెలుసుకునేందుకు సహాయం చేసే ఆధిక్యత సాండ్రాకు లభించింది. ఆమె అలా ‘మేలు చేస్తూ’ అదే సమయంలో యెహోవాసాక్షుల సమావేశాల్లో వైద్యపరంగా తనకున్న నైపుణ్యాలను స్వచ్ఛందంగా అందజేస్తోంది.—గలతీయులు 6:10.
సాండ్రా వ్యసనాల మాటేమిటి? ఆమె ధైర్యంగా ఇలా చెబుతోంది: “నా మనస్సు చాలా నిర్మలంగా ఉంది. నేనిప్పుడిక మత్తుపానీయాలు త్రాగను, పొగ త్రాగను, మాదకద్రవ్యాలు తీసుకోను. నాకిప్పుడవి అవసరం లేదు. నేను దేని కోసం ఎదురు చూస్తున్నానో అది నాకు లభించింది.”
[9వ పేజీలోని బ్లర్బ్]
“నేను దేని కోసం ఎదురు చూస్తున్నానో అది నాకు లభించింది”
[9వ పేజీలోని బాక్సు]
సహాయపడే బైబిలు సూత్రాలు
కలుషితం చేసే వ్యసనాలను మానుకోవడానికి సహాయం చేసిన బైబిలు సూత్రాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:
“దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” (2 కొరింథీయులు 7:1) అపరిశుభ్రమైన అలవాట్లను మానుకుని, కల్మషము నుండి తమను తాము పవిత్రులను చేసుకునే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు.
“యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే.” (సామెతలు 8:13) దేవుని పట్ల భక్తిపూర్వకమైన భయం కలిగివున్నట్లయితే, మాదకద్రవ్యాల దుర్వినియోగంతో సహా చెడ్డ అలవాట్లను మానుకోవడానికి అది సహాయం చేస్తుంది. మారిన వ్యక్తి యెహోవాకు సంతోషం కలిగించడమే గాక భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా తప్పించుకుంటాడు.
‘అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులై ఉండుడి.’ (తీతు 3:1) అనేక ప్రాంతాల్లో, కొన్ని మందులను కలిగివుండడం లేదా ఉపయోగించడం చట్టవ్యతిరేకం. నిజ క్రైస్తవులు చట్టవిరుద్ధమైన మందులను తమ దగ్గర ఉంచుకోరు లేదా ఉపయోగించరు.