పాఠకుల ప్రశ్నలు
కీర్తనల గ్రంథములోని ఒక్కొక్క కీర్తనకు, వాటిలోని ఒక్కొక్క వచనానికి కేటాయించబడిన సంఖ్యలు వివిధ బైబిలు అనువాదాలలో ఎందుకు విభిన్నంగా ఉంటాయి?
అధ్యాయ, వచన విభజనలు గల మొదటి సంపూర్ణ బైబిలు రాబర్ ఎస్టీన్ 1553లో ప్రచురించిన ఫ్రెంచ్ అనువాదం. అయితే, కీర్తనల గ్రంథములో విభాగాలు అంతకంటే ఎంతో ముందే ఉన్నాయని స్పష్టమవుతోంది, ఎందుకంటే అది పలువురు రచించిన వివిధ కీర్తనల లేక పాటల సంకలనం.
ప్రజలు ఆరాధనలో ఉపయోగించడానికి కొన్ని కీర్తనలను సేకరించేందుకు యెహోవా మొదట దావీదును నిర్దేశించినట్లు తెలుస్తోంది. (1 దినవృత్తాంతములు 15:16-24) ఆ తర్వాత యాజకుడు, “ప్రవీణతగల శాస్త్రి” అయిన ఎజ్రా మొత్తం కీర్తనల గ్రంథమును ఇప్పుడున్న రూపంలోకి సంపుటీకరించాడని విశ్వసించబడుతోంది. (ఎజ్రా 7:6) తత్ఫలితంగా, కీర్తనల గ్రంథము సంపుటీకరించబడినప్పుడు అది వివిధ కీర్తనలతో రూపొందించబడింది.
అపొస్తలుడైన పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో, (పిసిదియలోనున్న) అంతియొకయలోని సమాజమందిరంలో ప్రసంగించేటప్పుడు కీర్తనల గ్రంథములో నుండి ఎత్తిచెబుతూ ఇలా అన్నాడు: “నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.” (అపొస్తలుల కార్యములు 13:32, 33) నేటి బైబిళ్ళలో, ఆ మాటలు ఇప్పటికీ రెండవ కీర్తన, 7వ వచనంలోనే కనిపిస్తాయి. అయితే, వివిధ బైబిలు అనువాదాలలో అనేక కీర్తనలకు కేటాయించబడిన సంఖ్యలలో తేడాలున్నాయి. ఎందుకంటే, కొన్ని అనువాదాలు హీబ్రూ మసొరెటిక్ మూలపాఠం ఆధారంగా అనువదించబడితే మిగతావి గ్రీకు సెప్టాజింట్ ఆధారంగా అనువదించబడ్డాయి, హీబ్రూ లేఖనాల గ్రీకు అనువాదమైన ఈ సెప్టాజింట్ సా.శ.పూ. రెండవ శతాబ్దంలో పూర్తి చేయబడింది. ఉదాహరణకు, కీర్తనలకు సంఖ్యలను కేటాయించే విషయంలో లాటిన్ వల్గేట్—అనేక క్యాథలిక్ బైబిళ్ళు దీని నుండే అనువదించబడ్డాయి—సెప్టాజింట్ ఉన్న విధానాన్నే ఉపయోగిస్తోంది, అయితే నూతన లోక అనువాదము, ఇతర అనువాదాలు హీబ్రూ మసొరెటిక్ మూలపాఠంలోని విధానాన్ని అనుసరిస్తున్నాయి.
నిర్దిష్టమైన తేడాలేమిటి? హీబ్రూ మసొరెటిక్ మూలపాఠంలో మొత్తం 150 కీర్తనలున్నాయి. అయితే సెప్టాజింట్ 9, 10 కీర్తనలను కలిపి ఒక కీర్తనగా, 114, 115 కీర్తనలను కలిపి ఒక కీర్తనగా జతచేస్తోంది. అంతేగాక అది 116, 147 కీర్తనలను ఒక్కోదాన్ని రెండు కీర్తనలుగా విభజిస్తోంది. కాబట్టి మొత్తం సంఖ్యలో మార్పేమి లేకపోయినప్పటికీ సెప్టాజింట్‌లో 10వ కీర్తన నుండి 146వ కీర్తన వరకు కేటాయించబడిన సంఖ్యలలో, హీబ్రూ మసొరెటిక్ మూలపాఠంలో ఉన్న సంఖ్యలకన్నా ఒకటి తక్కువగా ఉంటుంది. అందుకే సుపరిచితమైన 23వ కీర్తన, డుయే వర్షన్‌లో 22వ కీర్తనగా కనిపిస్తుంది, ఈ డుయే వర్షన్, సెప్టాజింట్‌ని సంఖ్యా విధానాన్ని అనుసరించిన లాటిన్ వల్గేట్‌ను అనుసరించింది.
చివరిగా, కొన్ని కీర్తనల్లోని వచనాల సంఖ్యలు కూడా ఒక్కొక్క అనువాదంలో ఒక్కొక్క విధంగా ఉంటుండవచ్చు. ఎందుకు? ఎందుకంటే, మాక్‌క్లింటాక్ అండ్ స్ట్రాంగ్స్ సైక్లోపీడియా చెబుతున్నట్లుగా కొన్ని అనువాదాలు, “పైవిలాసాన్ని మొదటి వచనంగా పరిగణించే యూదా ఆచారాన్ని” అనుసరిస్తాయి, కానీ కొన్ని అనువాదాలు అనుసరించవు. వాస్తవానికి, శీర్షిక గానీ పైవిలాసం గానీ మరీ పెద్దగా ఉంటే తరచూ అది రెండు వచనాలుగా పరిగణించబడుతుంది, తదనుగుణంగానే కీర్తనలోని వచనాల సంఖ్య కూడా పెరుగుతుంది.