“మీరు చెప్పింది నిజమే, జీవితం ఆహ్లాదకరమైనది!”
జీవితానికి నిజమైన అర్థమేమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయంలో, పోలాండ్లోని శ్కిట్సీన్ పట్టణంలో నివసిస్తున్న మాగ్దలీనా అనే పద్దెనిమిది సంవత్సరాల ఒక యెహోవాసాక్షి ఉన్నత పాఠశాలలో తనతోపాటు చదువుతున్న కాటార్షీనాకు సహాయం చేసింది. కాటార్షీనా తానొక నాస్తికురాలినని చెప్పుకుంటుంది, అయినప్పటికీ మాగ్దలీనా ఆమెతో బైబిలు గురించి మాట్లాడినప్పుడు యథార్థమైన ఆసక్తి చూపించింది.
మాగ్దలీనా బైబిలు నుండి చెప్పిన విషయాన్ని కాటార్షీనా ఇష్టపడినప్పటికీ ఆమె దాన్ని పూర్తిగా అంగీకరించలేకపోయింది. కాటార్షీనా మాగ్దలీనాతో ఒకసారి నిజమైన స్నేహితుల గురించి మాట్లాడుతూ, “నీ దగ్గర బైబిలుంది; ఏ సూత్రాలను అనుసరించాలి, స్నేహితుల కోసం ఎక్కడ వెతకాలి అన్నది నీకు తెలుసు. కానీ ఇప్పటివరకు ఆ సూత్రాలను అంగీకరించని వారి సంగతి ఏమిటి?” అని అడిగింది.
కాటార్షీనా ఇంగ్లాండ్‌లోని లండన్‌కు వెళ్ళినప్పుడు ఆమెకు ఒక మరపురాని సందర్భం ఎదురయ్యింది. ఆమె అక్కడి యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించింది, అక్కడ ఆమె పట్ల చూపబడిన ఆప్యాయతకు ఆమె కదిలిపోయింది. ఆమె కోసం తలుపు తెరవడం, ఆమె చెబుతున్న దానిని యథార్థమైన శ్రద్ధతో వినడం వంటి చిన్న చిన్న చర్యలే ఆమెను ఎంతగానో ఆకర్షించాయి.
సెప్టెంబరు 2001లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు, కాటార్షీనా క్రమబద్ధమైన బైబిలు అధ్యయనాన్ని చేయడానికి నిశ్చయించుకుంది. ఆమె బైబిలు సూత్రాల పట్ల గౌరవాన్ని అధికం చేసుకుంటూ, వాటిని తన దైనందిన జీవితంలో అన్వయించుకోవడం ప్రారంభించింది. ఇటీవల ఆమె మాగ్దలీనాతో తన మనోభావాలను పంచుకుంటూ “నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లుగా భావిస్తున్నాను” అని అంది. తర్వాత, “ఇవ్వాళ జరిగిన అధ్యయనానికి చాలా ధన్యవాదాలు! మీరు చెప్పింది నిజమే, జీవితం ఆహ్లాదకరమైనది! దాని కోసం మనం ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో తెలుసుకోవడం అద్భుతమైన విషయం” అంటూ ఆమె సెల్యులర్ ఫోన్ ద్వారా ఒక చిన్న సందేశాన్ని కూడా పంపించింది.