“మాకున్న ప్రేమ అధికమయ్యింది”
జపానులోని హొక్కాయిడోలో 23 సంవత్సరాలనుండి నిద్రాణమై ఉన్న ఊసు పర్వతం ఉన్నట్టుండి 2000, మార్చి 31 శుక్రవారంనాడు ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ప్రమాద ప్రాంతంనుంచి వేలాదిమంది నివాసులు బలవంతంగా పంపించివేయబడ్డారు. చాలామంది తమ ఇళ్ళను, ఉద్యోగాలను పోగొట్టుకున్నారు, కానీ ఎవ్వరు తమ ప్రాణాలను పోగొట్టుకోలేదన్నది సంతోషకరమైన విషయం. ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చినవారిలో 46 మంది యెహోవాసాక్షులు ఉన్నారు. అయితే వారు ఏ సహాయం లేకుండా అలా వదిలివేయబడలేదు.
ప్రేలుడు జరిగిన రోజే, ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న క్రైస్తవ ప్రయాణ సేవకుడి సహాయంతో సహాయక చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. త్వరలోనే చుట్టు ప్రక్కల సంఘాలనుంచి సహాయక సామగ్రి రావడం మొదలయ్యింది. జపాను బ్రాంచి పర్యవేక్షణ క్రింద వెంటనే ఒక సహాయక కమిటీ స్థాపించబడింది, జపానులోని అన్ని ప్రాంతాల్లోనున్న యెహోవాసాక్షుల దగ్గరినుంచి విరాళాలు విస్తారంగా సహాయక నిధిలో వచ్చి పడ్డాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి, ప్రేలుడువల్ల అత్యధికంగా ప్రభావితమైన సంఘానికి, యెహోవాసాక్షుల పూర్తికాల సేవకులను పంపించడం జరిగింది. ప్రాంతీయ పైవిచారణకర్త, వారికి భావోద్వేగపరమైన ఆధ్యాత్మికమైన సహాయాన్ని అందించడానికి ఆ ప్రాంతాన్ని పదే పదే సందర్శించాడు.
ప్రేలుడు వల్ల ప్రభావితమైన ప్రాంతానికి చెందిన సాక్షులు, ఆ కష్ట సమయంలో కూడా సురక్షిత స్థలంలో ఉన్న సహోదరుల వ్యక్తిగత గృహాలలో క్రైస్తవ కూటాలను జరుపుకోవడం కొనసాగించారు. రాజ్యమందిరం ఉన్న చోటనుంచి, ఆ ప్రాంతాన్ని ఖాళీచేయమన్న ఆజ్ఞ తీసివేసిన తర్వాత, సహోదరులు వెళ్ళి చూసినప్పుడు అక్కడ వారికి బీటలు వారి, ప్రక్కకు ఒరిగి పోయి, బాగా దెబ్బతిన్న భవనం కనిపించింది. రాజ్యమందిరానికి దగ్గర్లో, అగ్ని పర్వత శిఖరం మీద క్రొత్తగా ఏర్పడ్డ బిలం నుంచి ఇంకా దట్టమైన పొగ లేస్తూనే వుంది. ఆ సాక్షులు ‘ఇలాంటి స్థలంలో కూటాలు జరుపుకోవడం సమంజసమేనా? రాజ్యమందిరాన్ని బాగుచేయగలమా?’ అన్న ఆలోచనలో పడ్డారు.
దగ్గర్లో ఉన్న సురక్షితమైన ప్రాంతంలో క్రొత్త రాజ్యమందిరం నిర్మించాలని నిర్ణయించబడింది. అందుకు కావల్సిన సహాయాన్ని రీజనల్ బిల్డింగ్ కమిటీ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న సాక్షులు విరాళంగా ఇచ్చిన డబ్బు ఈ నిర్మాణానికి ఉపయోగించబడింది. తొందర్లోనే వారు స్థలాన్ని కొని, వందలాది స్వచ్ఛంద సేవకుల సహాయంతో తక్కువ సమయంలోనే క్రొత్త రాజ్యమందిరాన్ని పూర్తిచేశారు. క్రొత్తగా కట్టిన రాజ్యమందిరంలో 2000, జూలై 23న ఆదివారంనాడు నిర్వహించబడ్డ మొదటి కూటానికి 75 మంది హాజరయ్యారు. హాజరైనవారిలో చాలామంది ఆనందబాష్పాలు రాల్చారు. అదే సంవత్సరం అక్టోబరు నెలలో ఆ రాజ్యమందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు, స్థానిక సంఘానికి చెందిన ఒక పెద్ద ఇలా అనడానికి కదిలించబడ్డాడు: “ఈ ప్రేలుడు కష్టాలను బాధను కలిగించింది. అయినప్పటికీ, ఈ నిర్మాణం మా భయాన్ని ఆనందంగా మార్చివేసింది. యెహోవాపట్ల, మా ప్రియమైన క్రైస్తవ సహోదరుల పట్ల మాకున్న ప్రేమ అధికమయ్యింది!”
[19వ పేజీలోని చిత్రసౌజన్యం]
ఊసు పర్వత విస్ఫోటనం: AP Photo/Koji Sasahara