“కొంచెం నొప్పిగా ఉంటుంది, ఓర్చుకోవాలి మరి!”
ఆమాటల్ని మీరెప్పుడైనా విన్నారా? డాక్టరు గానీ నర్సు గానీ మీకు అవసరమైన చికిత్స చేసే ముందు అలా అనవచ్చు.
నొప్పి కలుగుతుందని మీరు ఆ చికిత్స చేయించుకోకుండా మాత్రం ఉండరు. బదులుగా మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి మీరు ఆ నొప్పిని భరిస్తారు. కొన్ని సీరియస్ కేసుల్లోనైతే అనుకూలంగా లేని చికిత్సను స్వీకరించడం, స్వీకరించకపోవడం అన్నది జీవన్మరణాల మధ్య ఎంపిక చేసుకోవడంలా కూడా ఉండగలదు.
ప్రతి సందర్భంలోనూ మనకు డాక్టరు సలహా అవసరం కాకపోవచ్చు. అయితే, మనము అపరిపూర్ణ మానవులం కాబట్టి, కొన్నిసార్లు బాధకలిగించేదే అయినప్పటికీ, క్రమశిక్షణ లేదా దిద్దుబాటు మాత్రం ఎంతో అవసరం. (యిర్మీయా 10:23) పిల్లల విషయంలో ఈ అవసరాన్ని గురించి నొక్కిచెబుతూ బైబిలు ఇలా అంటోంది: “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును; శిక్షాదండము దానిని దానిలోనుండి తోలివేయును.”—సామెతలు 22:15.
ఈ సందర్భంలో దండము అనేది తల్లిదండ్రుల అధికారానికి సూచనగా ఉంది. పిల్లలు సాధారణంగా క్రమశిక్షణ అంటే ఇష్టపడరన్నది నిజమే. క్రమశిక్షణలో భాగంగా ఏదైనా శిక్ష విధిస్తే వారు దాన్ని తిరస్కార భావంతో దృష్టిస్తుండవచ్చు. అయితే జ్ఞానయుక్తమైన, ప్రేమగల తల్లిదండ్రులు పిల్లల భావాలను గాయపరుస్తామేమోనని చింతించక, వారి సంక్షేమంపైనే దృష్టివుంచుతారు. “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అని చెబుతున్న దేవుని వాక్యము సత్యమని క్రైస్తవ తల్లిదండ్రులకు తెలుసు.—హెబ్రీయులు 12:11; సామెతలు 13:24.
చివరిగా ఒక్కమాట, క్రమశిక్షణ కావలసింది పిల్లలకు మాత్రమే కాదు. అది పెద్దలకు కూడా అవసరమే. ‘ఉపదేశమును [“క్రమశిక్షణను,” NW] విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని పొందియుండుము’ అని బైబిలు చెబుతున్నప్పుడు అది పెద్దలతోనే మాట్లాడుతుంది. (సామెతలు 4:13) అవును, జ్ఞానవంతులైనవారు—పిన్నలైనా పెద్దలైనా—దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా ఇవ్వబడే క్రమశిక్షణను స్వీకరిస్తారు, ఎందుకంటే అలా చేయడం ద్వారా చివరికి తమ జీవాన్నే కాపాడుకుంటారు.