“దేవుని రాజ్యంలో మళ్ళీ కలుద్దాం”
“నా ప్రియమైన స్నేహితుడా! రూపర్ట్, ఈరోజు నాకు మరణశిక్ష విధించబడింది. నా కోసం విలపించవద్దు. నీకూ, ఇంట్లో అందరికీ నా ప్రేమలు. దేవుని రాజ్యంలో మళ్ళీ కలుద్దాం.”
పంతొమ్మిది వందల నలభై రెండు, జూన్ 8న, నాజీ సైనికుల చేతిలో కాల్చి చంపబడడానికి కొన్ని నిమిషాల ముందు ఫ్రాన్ట్స్ డ్రాజ్గ్ వ్రాసిన మాటలివి. ఆయన ఎందుకు చంపబడ్డాడు?
38 ఏండ్ల ఈకమ్మరి, జర్మన్‌లు ఆక్రమించుకునివున్న స్లోవేనియాలోని ఒక జర్మన్ పారామిలిటరీ శిబిరమైన వేర్‌మాన్‌షాఫ్ట్‌లో చేరడానికి నిరాకరించడమే దానికి కారణమని స్లోవేనియాలోని, మారిబోర్‌లోని మ్యూజియమ్ ఆఫ్ నేషనల్ లిబరేషన్‌లో ఉన్న రికార్డులు చూపిస్తున్నాయి. ఆయన ఒక బీబల్‌ఫార్షర్ లేదా బైబిలు విద్యార్థి. అప్పట్లో ఆప్రాంతంలోని యెహోవాసాక్షులు ఆపేరున పిలువబడేవారు. యెషయా 2:4 కు అనుగుణంగా ప్రవర్తిస్తూ, తాను దేవుని రాజ్యపు ప్రజల్లో ఒకరినని చెప్పుకుంటూ, ఆయన నాజీల యుద్ధ ప్రయత్నాలకు మద్దతునివ్వడానికి నిరాకరించేవాడు.—మత్తయి 6:33.
ప్ట్యూ అనే తన సొంత ఊరులో, దేవుని రాజ్య సువార్తను అత్యంతాసక్తితో ప్రకటించేవాడిగా ఫ్రాన్ట్స్ అందరికీ తెలుసు. (మత్తయి 24:14) ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఆయన 1942 మేలో అరెస్టయ్యే వరకూ, సువార్తను పట్టువదలకుండా ప్రకటించాడు.
స్లోవేనియన్‌లైన అనేక మంది యెహోవాసాక్షులు నాజీల చేత తీవ్రంగా హింసించబడ్డారు. తమ మత నమ్మకాల మూలంగా చంపబడిన మొదటివారిలో ఫ్రాన్ట్స్ ఒకరు. “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలె”నన్న మాటలు మొదటి శతాబ్దపు క్రైస్తవులను బలపరచినట్లే, ఆయనను కూడా బలపరచాయి. (అపొస్తలుల కార్యములు 14:22) పరలోక ప్రభుత్వం వాస్తవమైనదన్న ఆయన నమ్మకం “దేవుని రాజ్యంలో మళ్ళీ కలుద్దాం” అని ఆయన అన్న చివరి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
ఫ్రాన్ట్స్ డ్రాజ్గ్: Photo Archive-Museum of National Liberation Maribor, Slovenia; ఉత్తరం: Original kept in Museum of National Liberation Maribor, Slovenia