మృత సముద్రపు గ్రంథపు చుట్టలు వాటిలో మీరెందుకు ఆసక్తిని కలిగివుండాలి?
మృత సముద్రపు గ్రంథపు చుట్టలు కనుగొనబడడానికి పూర్వం, హీబ్రూ లేఖనాల వ్రాతప్రతుల్లో సా.శ. తొమ్మిదవ పదవ శతాబ్దాలకు చెందినవే అతి పురాతన వ్రాతప్రతులుగా ఉండేవి. హీబ్రూ లేఖనాల వ్రాత అంతకు వెయ్యి సంవత్సరాల పూర్వమే ముగిసిన దృష్ట్యా, దేవుని వాక్యం ఒక తరం నుండి మరో తరానికి నమ్మదగిన రీతిలోనే అందించబడిందని చెప్పడానికి ఈ వ్రాతప్రతులపై ఆధారపడవచ్చునా? మృత సముద్రపు గ్రంథపు చుట్టల అంతర్జాతీయ సంపాదకుల జట్టులోని ఒక సభ్యుడైన ప్రొఫెసర్ హూల్యో ట్రెబోయె బారేరా ఇలా చెబుతున్నాడు: “బైబిలు పాఠాన్ని యూదా నకలువ్రాతగాళ్ళు వెయ్యి సంవత్సరాలకు పైగా కాలంలో ఒక తరం నుండి మరో తరానికి ఎంతో నమ్మదగ్గ రీతిలోను జాగ్రత్తతోను అందించారని [కుమ్రాన్లోని] యెషయా గ్రంథపు చుట్టలు నిర్ద్వంద్వమైన రీతిలో రుజువులనిస్తున్నాయి.”
బారేరా మాట్లాడుతున్న గ్రంథపు చుట్టల్లో యెషయా పుస్తకపు పూర్తి పాఠం ఉంది. నేటికి కుమ్రాన్లో లభించిన 200కుపైగా బైబిలు వ్రాతప్రతుల్లో ఎస్తేరు పుస్తకం మినహా హీబ్రూ లేఖనాల్లోని ప్రతి పుస్తకంలోని చిన్న చిన్న భాగాలు ఉన్నట్లు గుర్తించబడింది. యెషయా గ్రంథపు చుట్టలా కాక వీటిలో అత్యధికం ముక్కల రూపంలోనే ఉన్నాయి; ఆ ముక్కలు ప్రతి పుస్తకం సైజులో పదవ వంతుకన్నా తక్కువ మాత్రమే ఉన్నాయి. కుమ్రాన్ వద్ద లభించినవాటిలో అతి ప్రఖ్యాతమైన పుస్తకాల్లో కీర్తనలు (36 ప్రతులు), ద్వితీయోపదేశకాండము (29 ప్రతులు), యెషయా (21 ప్రతులు) ఉన్నాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అతి ఎక్కువగా ఉదాహరించబడిన పుస్తకాల్లో ఇవి ఉన్నాయి.
బైబిల్లో ఎటువంటి ప్రాధమికమైన మార్పులూ జరగలేదని ఈ గ్రంథపు చుట్టలు చూపిస్తున్నప్పటికీ, రెండవ దేవాలయం కాలంలో యూదులు ఉపయోగించిన హీబ్రూ బైబిలు పాఠపు సంపుటులు కొంతమేరకు ఒకదానికొకటి వేర్వేరుగా ఉన్నాయని కూడా వెల్లడిస్తున్నాయి, ఆ వేర్వేరు హీబ్రూ బైబిలు సంపుటుల్లోని ప్రతిదానిలోను దాని దాని విభిన్నతలున్నాయి. అక్షరక్రమం సంబంధంగా లేక పదక్రమం సంబంధంగా గ్రంథపు చుట్టలన్నీ మసొరెటిక్ పాఠంతో పోలిలేవు. కొన్ని గ్రీకు సెప్టాజింట్కు దగ్గరగా పోలివున్నాయి. సెప్టాజింట్లోని తేడాలకు కారణం అనువాదకుని పొరబాట్లుగానీ కావాలని చేర్చిన తలంపులుగానీ అయివుండవచ్చని పండితులు మునుపు అనుకున్నారు. ఈ తేడాల్లో చాలావాటికి కారణం నిజానికి హీబ్రూ మూలపాఠంలో విభిన్నతలని ఈ గ్రంథపు చుట్టలు ఇప్పుడు వెల్లడిచేశాయి. తొలి క్రైస్తవులు హీబ్రూ లేఖనాల్లోని వచనాల్ని ఎత్తి వ్రాసినప్పుడు వారుపయోగించిన పదాలు కొన్ని సందర్భాల్లో ఎందుకు మసొరెటిక్ పాఠంలోని పదాలకు భిన్నంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు.—నిర్గమకాండము 1:5; అపొస్తలుల కార్యములు 7:14.
అందుచేత, బైబిలు గ్రంథపు చుట్టలు, వాటి చిన్న చిన్న ముక్కలతో కూడిన ఈ ఖజానా హీబ్రూ బైబిలు పాఠం ఒక తరం నుండి మరో తరానికి ఎలా అందించబడిందో పరిశీలించడానికి ఒక అద్భుతమైన ఆధారాన్నిస్తోంది. సెప్టాజింట్, సమారిటన్ పెంటాటుక్ ఈ రెండూ, బైబిలు పాఠాల్ని పోల్చిచూడడానికి ఎంతో విలువైనవన్న విషయాన్ని మృతసముద్రపు గ్రంథపు చుట్టలు ధృవపర్చాయి. బైబిలు అనువాదకులు మసొరెటిక్ పాఠానికి మెరుగులు చేకూర్చే సాధ్యతను పరిగణలోనికి తీసుకోవడానికి వారికివి అదనపు మూలాధారాన్ని అందిస్తాయి. మసొరెటిక్ పాఠం నుండి యెహోవా నామాన్ని తీసేసిన స్థలాల్లో తమ అనువాదంలో తిరిగి పెట్టడానికి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనేక సందర్భాల్లో అవి బలాన్ని చేకూరుస్తాయి.
కుమ్రాన్ తెగవారి నియమాలను గురించీ, వారి నమ్మకాలను గురించీ వర్ణిస్తున్న గ్రంథపు చుట్టలు యేసు కాలంలోని యూదామతంలో అనేక రూపాలున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కుమ్రాన్ తెగలో పరిసయ్యులు సద్దూకయ్యుల ఆచారాలకు భిన్నమైన ఆచారాలున్నాయి. బహుశ ఈ ఆచారాలే వీరు అరణ్యంలోనికి వలసపోవడానికి కారణమైవుండవచ్చు. యెహోవా మార్గాన్ని సిద్ధపరుస్తున్న ఒక వ్యక్తి స్వరం గురించి చెప్తున్న యెషయా 40:3వ వచనం తమలో నెరవేరిందని వారు తప్పుగా అర్థంచేసుకున్నారు. అనేక గ్రంథపు చుట్టల ముక్కల్లో మెస్సీయాను గురించి పేర్కోవడం జరిగింది, ఆయన త్వరలోనే వస్తున్నాడని ఆయా రచయితలు వ్రాశారు. మెస్సీయా వస్తున్నాడని ప్రజలు తమ “హృదయములలో ఆలోచించుకొనుచు”న్నారని లూకా చేసిన వ్యాఖ్యానం దృష్ట్యా ఇది చాలా ఆసక్తికరమైన విషయంగా ఉంది.—లూకా 3:15.
యేసు ప్రకటనా పనిచేసినప్పటి కాలంలోని యూదుల జీవన విధానం గురించి అర్థం చేసుకోవడానికి మృత సముద్రపు గ్రంథపు చుట్టలు కొంతమేరకు సహాయం చేస్తాయి. ప్రాచీన హీబ్రూ భాషలోనూ, బైబిలు పాఠంలోనూ ఉన్న పోలికల్నీ తేడాల్నీ అధ్యయనం చేయడానికి అవసరమైన సమాచారాన్ని అవి అందిస్తాయి. కానీ మృత సముద్రపు గ్రంథపు చుట్టల్లో చాలావాటిని ఇంకా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, ఇంకా క్రొత్త క్రొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంది. అవును, పురావస్తుశాస్త్ర సంబంధంగా 20వ శతాబ్దంలోనే అతి గొప్పదిగా ఉన్న ఈ ఖజానా, మనం 21వ శతాబ్దంలో ముందుకు సాగుతూవుండగా అటు పండితుల్నీ ఇటు బైబిలు విద్యార్థుల్నీ ఉత్తేజపరుస్తూనే ఉంది.
[7వ పేజీలోని చిత్రసౌజన్యం]
కుమ్రన్ తవ్వకాలు: Pictorial Archive (Near Eastern History) Est.; వ్రాతప్రతి: Courtesy of Shrine of the Book, Israel Museum, Jerusalem