“ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని తీసుకువచ్చేదిదే”
తువాలు ఒక సుందరమైన దేశం. అది దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న తొమ్మిది దీవులతో రూపొందించబడింది. దాని జనాభా దాదాపు 10, 500 మంది. అయినప్పటికీ, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” దేవుడు “యిచ్ఛయించుచున్నా”డన్న విషయాన్ని గ్రహించినవారై స్థానిక యెహోవాసాక్షులు, తమ స్వంత భాషలో బైబిలు ప్రచురణలను కలిగివుండాలని పరితపించిపోయారు. (1 తిమోతి 2:4) ఆ భాషలో నిఘంటువు లేకపోవడం మూలంగా అది ఒక సవాలుగా పరిణమించింది. 1979 లో, తువాలులో సేవ చేస్తున్న యెహోవాసాక్షుల్లోని ఒక మిషనరీ ఆ సవాలును చేపట్టాడు. ఆయనా ఆయన భార్య ఒక స్థానిక కుటుంబంతో పాటు జీవిస్తూ వాళ్ల భాషను నేర్చుకున్నారు. క్రమేణా తువాలియన్ పదకోశాన్ని రూపొందించారు. 1984 లో మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని తువాలియన్ భాషలో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు ప్రచురించారు.
తువాలు దేశ మాజీ ప్రధాన మంత్రియైన డాక్టర్. టి. పూవాపూవ, నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ప్రచురించినందుకు మెప్పుదలను వ్యక్తపరుస్తూ ఒక ఉత్తరాన్ని వ్రాశాడు. “ఈ పుస్తకం, తువాలు దేశానికి అవసరమైన ‘వారసత్వ సంపద’కు కొత్తదీ, కీలకమైనదీ అయిన మరొక చేర్పు. మీరు నిర్వహించిన పాత్రను బట్టి అంటే ఈ దేశ ప్రజల ఆధ్యాత్మిక జీవనాన్ని నిర్మించడంలో మీరు పోషించిన చక్కని పాత్రనుబట్టి మీరు ఎంతో సంతోషించాలి. విద్యా సంబంధిత పుస్తకాల ముద్రణ విషయానికి వస్తే ఆ పని, తువాలు దేశ చరిత్రలో లిఖించబడుతుందని నా నమ్మకం. . . . ఇది [మీరు సాధించినది] ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని తీసుకురావాలి” అని వ్రాశాడు.
ఆ అనువాదకుడు సేకరించిన ఆ పదాల పట్టిక, 1993 లో తువాలియన్-ఇంగ్లీష్ నిఘంటువును ప్రచురించడానికి నడిపించింది. ఆ భాషలో సాధారణ ప్రజానీకం కోసం ప్రచురించబడిన మొట్ట మొదటి నిఘంటువు అదే. తమ మొదటి స్వభాషా నిఘంటువును తయారుచేయడంలో ఆ నిఘంటువును ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వమని నేషనల్ లాంగ్వెజ్ బోర్డ్ ఆఫ్ తువాలు ఇటీవల అడిగింది.
జనవరి 1, 1989 నుంచీ కావలికోట పత్రిక, తువాలియన్ భాషలో మాసపత్రికగా ప్రచురించబడుతోంది. ఈ పత్రికను మీరు మీ ద్వితీయభాషలో చదువుతుంటుంటే, ఈ పత్రిక ప్రచురించబడుతున్న భాషల్లో మీ మాతృభాష చేరివుందో లేదో చూడడానికి 2వ పేజీకి త్రిప్పి ఎందుకు పరిశీలించకూడదు? ఈ పత్రికను మీ మాతృభాషలో చదవడం, నిస్సందేహంగా మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది.