ఆంతరంగిక అందానికే శాశ్వత విలువ ఉంది
“అందము సుగుణము రెండూ సమానమేనని పురుషుడు భావిస్తాడు” అని ఒక నమ్మకస్థుడైన వృద్ధ క్రైస్తవుడు వ్యాఖ్యానించాడు.
అవును, పురుషుడు ఎంతోకాలంగా పైపై అందానికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూవచ్చాడు, కానీ తరచుగా ఆంతరంగిక లక్షణాలను గురించి తప్పుడు నిర్ణయాలకు వచ్చేశాడు. మన సృష్టికర్త, బాహ్య రూపాన్ని కాక మన అంతరంగంలో మనమేమిటన్నదాన్ని చూస్తాడు. ఈ విధంగా పరిణతితో కూడిన నిర్ణయాన్ని తీసుకోవడంలో ఆయన అతి గొప్ప మాదిరిని ఉంచాడు. బైబిలు ప్రకారం దేవుడే ఇలా చెప్పాడు: “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”—1 సమూయేలు 16:7.
మనిషిలోని నిజమైన అందానికి దేవుడు మూలమైవున్నాడు, ఒక వ్యక్తి యొక్క నిజమైన విలువను నిర్ధారించడంలో ఆధ్యాత్మిక లక్షణాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా ఉంటాయని ఆయన వాక్యం వెల్లడి చేస్తుంది. బైబిలు ఇలా చెప్తుంది: “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.” (సామెతలు 31:30) వాస్తవానికి, బాహ్యాకర్షణ ఆంతరంగిక వికారాన్ని కప్పిపెట్టవచ్చు. (ఎస్తేరు 1:10-12; సామెతలు 11:22) సమయం గడిచేకొలది భౌతిక అందం తగ్గిపోవచ్చు కానీ ఆంతరంగిక అందం అంటే హృదయం యొక్క లక్షణాలు అంతకంతకూ వృద్ధి అవుతాయి అంతేకాక చివరి వరకూ నిలిచివుంటాయి.
అందుకే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి లక్షణాలను అలవర్చుకోవడం ఎంత జ్ఞానయుక్తమైనదో కదా! (గలతీయులు 5:22, 23) అలా మనం నిరంతరం నిలిచే విలువను కలిగివున్న ఆంతరంగిక అందాన్ని సంపాదించగలం.—1 పేతురు 3:3, 4.