నావికుని నుండి ఒక పాఠము
ఒంటరిగా సముద్రయానం చేస్తుంటే ఏర్పడే నిస్సత్తువ వర్ణనాతీతం. దానివల్ల కలిగే అలసట మూలంగా శరీరం స్పర్శాజ్ఞానం కోల్పోయి నావికుడు ఇక పరిమితులు మర్చిపోతాడు, దాంతో పొరబాట్లు చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకని, ప్రతి నావికునికి లంగరు విలువేమిటో తెలుసు. అలసిపోయిన నావికుడు ఆగి కాస్త విశ్రాంతి తీసుకుని, శక్తిని కూడదీసుకునేలా లంగరు సహాయపడుతుంది. లేకపోతే నౌక ఎక్కడెక్కడికో కొట్టుకుపోగలదు. లంగరు వేసినప్పుడు నౌక నిలిచిపోవడమే కాక, దాని ముందుభాగం గాలికీ అలలకూ ఎదురుగా ఉండేలా చేసి అది నౌకను స్థిరంగా నిలుపుతుంది.
నావికులు సముద్రంలో ఎన్నో ప్రమాదాల్ని ఎదుర్కొంటున్నట్లే క్రైస్తవులు కూడా ఈ లోకంలో నిరంతర ఒత్తిళ్ళను ఎదుర్కొంటుంటారు, విశ్రాంతి తీసుకోవాలని వారికీ అన్పిస్తుంది. నిజానికి యేసు ఒకసారి తన శిష్యులకు ఇలా సిఫారసు చేశాడు: “మీరేకాంతముగా అరణ్యప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొను[డి].” (మార్కు 6:31) నేడు కొందరు, కొన్ని వారాలపాటు తమ కుటుంబంతోపాటు వేరే ఎక్కడికన్నా ప్రయాణించటానికో లేదా శని ఆదివారాలు ఎక్కడికైనా వెళ్ళి సరదాగా గడపటానికో ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి ఆటవిడుపు కార్యక్రమాలు ఉపశమనాన్నీ నూతనోత్తేజాన్ని ఇస్తాయి. అయితే, మనం అలాంటి సందర్భాల్లో ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉన్నామని ఎలా రూఢీగా ఉండవచ్చు? మనం ఎక్కడెక్కడికో కొట్టుకుపోకుండా, స్థిరంగా ఉండేందుకు ఆధ్యాత్మిక భావంలో లంగరులా ఏది పనిచేయగలదు?
యెహోవా ఔదార్యంగా మనకు అందుబాటులో ఉండే ఒక ఏర్పాటును చేశాడు. అది ఆయన పరిశుద్ధ వాక్యమైన బైబిలే. దాన్ని ప్రతి రోజు చదవడం ద్వారా మనం యెహోవాకు దగ్గరవగలం, ఎన్నడూ ఆయననుండి తొలగిపోకుండా ఉండగలం. అందులోని సలహాలు మనల్ని స్థిరపర్చి, సాతాను అతని లోకమూ పెట్టే శోధనల్ని తట్టుకునేలా చేస్తాయి. క్రమంగా బైబిలును చదవడం, మనం మన దైనందిన కార్యకలాపాలకు వేరైన పనుల్లో నిమగ్నమైనప్పుడు కూడా మన ఆధ్యాత్మిక లంగరులా పనిచేయగలదు—యెహోషువా 1:7, 8; కొలొస్సయులు 2:6.
“యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు” అని కీర్తనల గ్రంథకర్త మనకు గుర్తుచేస్తున్నాడు. (కీర్తన 1:1, 2) దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదవడం మనకు ‘ధన్యతను’ అంటే సంతోషాన్ని తెస్తుంది, నిజమైన ఉపశమనాన్నీ, నూతనోత్తేజాన్నీ తీసుకువస్తుంది, మనం క్రైస్తవ మార్గంలో కొనసాగడానికి మనలను సంసిద్ధులను చేస్తుంది.