మంచి పనులు దేవునికి మహిమను తీసుకువస్తాయి
దేవుడ్ని ప్రేమించే వాళ్ళు ఆయన వాక్యమైన బైబిలులో నుండి ఆధ్యాత్మిక వెలుగును ప్రతిఫలింపజేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ విధంగా వాళ్ళు యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞను పాటిస్తారు: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్తయి 5:16) నిజాయితీ గల ప్రవర్తన, అలాగే మాట్లాడే మాటలు దేవునికి మహిమను తీసుకురాగలవు.
యెహోవాసాక్షులు బైబిలుకు అనుగుణ్యంగా నడుచుకోవడం ద్వారా, ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేసేందుకు కృషి చేయడం ద్వారా, దేవునిని సంతోషపరచటానికి ప్రయత్నిస్తారు. తమ బహిరంగ పరిచర్య ఇంకా చట్టబద్ధంగా నమోదు చేయబడని దేశాల్లో కూడా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అలాంటి దేశాల్లోని ఒక రాజధాని నగరంలో సాక్షులు వార్షిక సమావేశాలను జరుపుకుంటున్నారు, వాటికి ఇంచుమించు 6,000 నుండి 9,000 వరకూ హాజరయ్యారు. అలాంటి సమావేశాల కోసం ఎగ్జిబిషన్ జరిగే హాళ్ళను అద్దెకు తీసుకుంటున్నారు. గత సంవత్సరాల్లో జరిగిన సమావేశాల్లోలానే 1999 లో కూడా తమ సమావేశం జరగడానికి ముందు వందలాది మంది సాక్షులు ఆ హాలును శుభ్రపరిచేందుకు, సౌండ్ సిస్టమ్‌ను అమర్చడానికి, వేలకొలది కుర్చీలు వేయడానికి కష్టించి పనిచేశారు.
ఈ పనంతా గుర్తింపు పొందకుండా పోలేదు. ఆ కాంప్లెక్సు మేనేజ్మెంట్ స్టాఫ్ అంతా ఈ కార్యకలాపాలన్నిటిని గమనిస్తూనే ఉంది. శిఖరాగ్ర హాజరు 15,666 అయినప్పటికీ అంతా చాలా సవ్యంగా జరగడమూ, సాక్షులు ఎంతో క్రమం కల్గివుండడమూ కూడా వాళ్ళు గమనించారు. సమావేశానంతరం మళ్లీ అంతా శుభ్రం చేయడాన్ని చూసి కూడా స్టాఫంతా ప్రభావితమయ్యారు.
హాలు అద్దెకు తీసుకునేవారి లిస్ట్‌లో సాక్షుల పేరును ముందు పెట్టడం ద్వారా మేనేజ్మెంట్ దీనంతటి పట్ల మెప్పుదలను చూపించింది, అంటే ఆ తర్వాత సంవత్సరం అద్దెకు తీసుకొనే వారిలో వాళ్ళకు మొదటి అవకాశం లభిస్తుంది. ఆ మేనేజ్మెంట్ అంతకంటే ఎక్కువే చేసింది. 1999 జూలై 15న సమావేశ కమిటీకి వాళ్లు ఒక ప్రశంసాపూర్వక అవార్డును బహూకరించారు. ఆ ఫలకం మీద “యెహోవాసాక్షుల సంఘం” అని వ్రాయబడివుంది, బైబిలు విద్యాపని నిషేధించబడిన ఆ దేశంలో నిజంగా ఇది ఉహించని విషయం.
వందల సంఖ్యలో జరిగే, “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశాలకు 2000/2001 లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది హాజరవుతారని నిరీక్షించబడుతుంది. వాటికి మీరు కూడా హాజరై, బైబిలులో చెప్పబడినదాన్ని అత్యంతాసక్తితో చేసేవారు, దేవునికి మహిమను తెచ్చే మంచి పనులను చేయడంలో ఎలా భాగం వహిస్తారో వ్యక్తిగతంగా గమనించవచ్చు.