దౌర్జన్యాన్ని ఎవరు అంతమొందిస్తారు?
1999 సెప్టెంబర్లో, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్, జనరల్ అసెంబ్లీ యొక్క 54వ వార్షిక కార్యక్రమానికి ప్రతినిధులను ఆహ్వానించారు. ద టోరంటో స్టార్ పత్రికలో నివేదించబడినట్లుగా, “ప్రపంచ ప్రజల నుండి కేవలం సానుభూతి వచనాల కన్నా ఎక్కువే అవసరమైనవారు చాలామంది ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిపడుతున్న దౌర్జన్యాల పరంపరను అంతమొందించి, వాళ్లను ఆనంద తీరాలకు తీసుకువెళ్లే మార్గాలపై నడిపించే నిజమైన నమ్మదగిన నిబద్ధత వాళ్లకు కావాలి” అంటూ ఆయన ప్రపంచ నాయకులకు ఒక సవాలు విసిరారు.
దౌర్జన్యాన్ని అంతమొందించటానికి అవసరమైన “నిజమైన నమ్మదగిన నిబద్ధత”ను ఐక్యరాజ్య సమితి, దాని సభ్య దేశాలు అందజేయగలవా? అదే స్టార్ పత్రికలో, అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ ఇలా అన్నట్లు నివేదించబడింది: “ఈ శతాబ్దంలో ఇన్ని రక్తపుటేర్లు ప్రవహించిన తర్వాత, ‘మళ్లీ ఇంకెప్పుడూ అలా జరగకూడదు’ అని చెప్పడం సులభమే గానీ దాన్ని సాధించడం మాత్రం చాలా కష్టమని మనకు తెలుసు.” ఆయనింకా ఇలా అన్నాడు: “తీర్చలేని వాగ్దానాలు చేయడం, అస్సలు పట్టించుకోకపోవడమంత క్రూరమైనదే కాగలదు.”
దాదాపు 2,500 సంవత్సరాల క్రితం, మానవ ప్రయత్నాల గురించి ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) మరి దౌర్జన్యాన్ని అంతమొందించే విషయంలో ఏ నిరీక్షణ ఉంది?
మనం యెషయా 60:18 నందు చదువుతున్నట్లు దేవుడు ఈ హామీనిచ్చాడు: “ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు.” దేవుడు తన ప్రజలను చెర నుండి విడిపించి తమ స్వదేశానికి తీసుకువచ్చినప్పుడు ఆ ప్రవచనం మొదటిగా నెరవేరింది. అయితే దానికి మనం ఆనందించగల ఘనమైన నెరవేర్పు కూడా ఉంది. యెహోవా దేవుడు “తీర్చలేని వాగ్దానాలు చేయడం” లేదు. సర్వోన్నతునిగా, మానవజాతి సృష్టికర్తగా, ఆయన “ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిపడుతున్న దౌర్జన్యాల పరంపరను” అంతమొందించటానికి సరైన స్థానంలో ఉన్నాడు. దేవుని రాజ్యంలో శాంతి సర్వత్రా వ్యాపిస్తుంది. దౌర్జన్యం ఇక ఎన్నడూ ఉండకుండా నిర్మూలమౌతుంది!—దానియేలు 2:44.