ఉపాధ్యాయుని దురభిమానానికి తల్లిదండ్రుల అభ్యంతరం
ఇటలీలోని కాసానో మూర్జీలోని ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్లో కొందరికి స్టిక్కర్లను ఇచ్చి ఇళ్లకు పంపించాడు. వీధి తలుపులపై అంటించాల్సిన ఆ స్టిక్కర్లపై “మేము క్యాథలిక్కులము. యెహోవాసాక్షులు ఈ తలుపును తట్టవద్దు” అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి.
కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు, వారు యెహోవాసాక్షులు కాకపోయినప్పటికీ, ఉపాధ్యాయుని చర్యకు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ‘పిల్లలకు ఇటువంటివి నేర్పించడం మూలంగా వారు, తమలా ఆలోచించని వారందరినీ, అలాగే తమ మతం కాని వారందరినీ దూరంగా ఉంచడం ప్రారంభిస్తారని’ తల్లిదండ్రులు ఆరోపణలు చేసినట్లు మూవోవీటీ మూవో అనే వార్తాపత్రిక తెలియజేస్తుంది. ఆ పత్రికకు వ్రాసిన ఒక తల్లి ఆ స్టిక్కర్ని “ఒక కలుపు విత్తనం, మూఢత్వానికీ మూర్ఖత్వానికీ నిదర్శనం” అని పిలిచింది.
ఈ నివేదిక చూపిస్తున్నట్లుగా న్యాయాన్ని కోరే అనేకమంది ప్రజలు, పిల్లల మనస్సుల్లో దురభిమాన విత్తనాలు నాటడం వల్ల కలిగే ప్రమాదాల్ని గుర్తిస్తున్నారు. అంతేగాక వారికి ఇటలీ అంతటా, అలాగే పూర్తి ప్రపంచమంతటా యెహోవాసాక్షులు నిర్వహిస్తున్న క్రైస్తవ పరిచర్యపట్ల గౌరవం ఉంది. మీరు ఒక యెహోవాసాక్షిని ‘తనకున్న నిరీక్షణకు హేతువు’ ఎందుకు అడుగకూడదు? వారు తమ నిరీక్షణను గురించి మీతో ప్రగాఢమైన ‘గౌరవంతో’ చర్చించటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు.—1 పేతురు 3:15, పరిశుద్ధ బైబల్.