న్యూయార్క్ నగరంలో తాను అభిమానించేది
న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లో ఉన్న వాచ్‌టవర్ సొసైటీ ఫ్యాక్టరీ బిల్డింగ్స్‌లో ఒకదానిపై పైనున్న మాటలు 1950ల నుండి ప్రస్ఫుటంగా ప్రదర్శించబడుతున్నాయి. ఆ వైపుగా వెళ్తున్న ప్రయాణీకులకు, టూరిస్టులకు, ఇతరులకు బైబిలును ప్రతిరోజూ చదవమని అవి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ జ్ఞాపిక చూపే ప్రభావాన్ని సాక్షియైన ఒక అమ్మాయి నుంచి వచ్చిన ఈ క్రింది ఉత్తరం చూపిస్తుంది.
“నా హైస్కూల్ చదువు పూర్తయ్యాక నేనేమి చేయాలనుకుంటున్నానో నా క్లాస్‌మేట్‌తో మాట్లాడుతూ ఉన్నాను. నేను యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం గురించి అంటే బేతేలు గురించి మాట్లాడటం మొదలు పెట్టాను, ఆమె ఎంతో అబ్బురపడింది. తాను ఎంతోకాలంపాటు న్యూయార్క్ సిటీలో ఉన్నదని నాకు చెప్పింది. ఆమె ఇంట్లోవారు అంత మతనిష్ఠగలవారేమీ కాదు, కానీ ఆమె ప్రతిరోజూ ఉదయం కిటికీలో నుంచి చూసినప్పుడల్లా, ‘దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును ప్రతిరోజూ చదవండి’ అనే మాటలు (ఆంగ్లంలో) అక్కడ కనిపించేవి. దాని మూలంగా ఆమె ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్లబోయేముందు బైబిలు చదివేది.
“ఆ సిటీ నుంచి వచ్చేశాక, తాను న్యూయార్క్ నగరంలో లేని లోటును గుర్తు చేసేదేమిటంటే, ఆమె నిద్ర లేచిన వెంటనే ఆ బోర్డును చూడలేకపోవడమే. వాచ్‌టవర్ బిల్డింగ్ పైనున్న ఆ మాటల మూలంగానే, బైబిలును చదవటం అనేది ఒక అలవాటుగా మారింది, అలా ఆమె బైబిలును రోజూ చదువుతూ ఉంది!”
దేవుని వాక్యంలోని కొంత భాగాన్ని చదివి రోజును ప్రారంభించటం కన్నా శ్రేష్ఠమైన మార్గం ఏమి ఉంది! అలా చేయటంవల్ల, అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటల్ని మీరు అభినందిస్తారనటంలో సందేహం లేదు: “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను . . . నీ వెరుగుదువు.”—2 తిమోతి 3:14-15.