మానవులు—ఉన్నత జంతువులు మాత్రమేనా?
“జీవావిర్భావాన్ని గురించి మనం ఏం నమ్ముతున్నామన్నది మనమీద ఏమైనా ప్రభావం చూపుతుందా?”
బ్రెజిల్లో పదహారేండ్ల ఒక అమ్మాయి, “మానవులు ఉన్నత జంతువులు మాత్రమేనా” అనే తన ప్రసంగానికి ఉపోద్ఘాతంగా పై ప్రశ్నను వేసింది. ఆమె టీచర్, జూలై 8, 1998 సంచిక తేజరిల్లు! అందుకున్న తర్వాత, ఆ ప్రశ్నను తరగతి పిల్లలను అడగమని ఆ అమ్మాయిని ఆహ్వానించింది.
ప్రకృతివరణంపై ఆధారపడిన పరిణామసిద్ధాంతపు బోధ ఎంత నాశనకరమైనది అన్న విషయాన్ని ఆ యువ సాక్షి తెలియజేసింది. ఉదాహరణకు, మనుగడ కొరకైన శాశ్వత పోరాటంలో యుద్ధం సహజమని కొందరు దృష్టించేందుకు ఈ పరిణామ సిద్ధాంతం కారణమయ్యిందనీ, అలా అది ఫాసిజమ్కి నాజిజమ్కి దారి తీసిందనీ అనేక మంది భావిస్తున్నారు.
మానవులకూ జంతువులకూ చాలా అంతరం ఉంది అని ఆ విద్యార్థిని చూపించింది. “కేవలం మానవులు మాత్రమే ఆధ్యాత్మికతను పెంపొందించుకోగలరు. జీవితానికి అర్థాన్నీ, ఉద్దేశాన్ని కనుగొనడానికి మానవులు మాత్రమే ప్రయత్నిస్తారు. మానవులు మాత్రమే మరణం మూలంగా బాధపడతారు, తమ ఆవిర్భావాన్ని గురించి చింతిస్తారు, వాళ్ళకు మాత్రమే సదాకాలం జీవించాలన్న కోరిక ఉంది. మన ఆవిర్భావాన్ని గురించి మరి కొంత తెలుసుకునేందుకు మనం కొంచెం సమయాన్ని కనుగొనడం ఎంత ప్రాముఖ్యం!” అని ఆ అమ్మాయి పేర్కొంది.
ఆ అమ్మాయి సమర్పించిన చక్కని సమాచారానికి టీచర్ ఆమెను మెచ్చుకుంది. కౌమార ప్రాయంలో ఉన్న ఈ అమ్మాయి ఇంత చక్కగా మాట్లాడగలగడానికి కారణం, ఆమె చదవడానికి ఇష్టపడడమేనని ఆ టీచర్ చెప్పింది. తేజరిల్లు!, కావలికోట వంటి బైబిలు ఆధారమైన ప్రచురణలను ఆతురతగా చదివే వ్యక్తిగా పాఠశాలలో ఆ అమ్మాయి పేరుగాంచింది.
పరిణామ సిద్ధాంతం, యౌవనస్థుల హృదయాలపై మనస్సులపై చూపే ప్రభావాన్ని గురించి యెహోవాసాక్షులు యథార్థంగా చింతిస్తున్నారు. ఈ కారణం వల్లే, ఈ అమ్మాయి సహవసించే సంఘం, జూలై 8, 1998 సంచిక తేజరిల్లు!ను తమ టీచర్లకూ తోటి విద్యార్థులకూ ఇవ్వమని యువసాక్షులను ప్రోత్సహించింది. ఆ నగరంలోని వివిధ పాఠశాలల్లో దాదాపు 230 పత్రికలు పంపిణీ చేయబడ్డాయి. ఒక స్కూల్లోని సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ తేజరిల్లు! పత్రికకు చందా కట్టారు.
అవును, జీవావిర్భావాన్ని గురించి మనం ఏం నమ్ముతున్నామన్నది మనపై ప్రభావం చూపుతుంది! సృష్టికర్తపై విశ్వాసం తమ జీవితాల్లో నిజంగా చాలా తేడా చూపించిందని ఈ అమ్మాయీ, ఈమె స్నేహితురాళ్ళూ చూపిస్తున్నారు.