“యెహోవాసాక్షులను గూర్చిన నా అభిప్రాయాన్ని మీరు మార్చేశారు”
మా అక్టోబరు 15, 1998 సంచిక యెహోవాసాక్షుల పనిని గురించిన ఒక శీర్షికకు పోలాండ్లోని ఒక కారాగార అధికారి అలా ప్రతిస్పందించాడు. “కరుడు హృదయాలు కరిగినప్పుడు” అనే శీర్షిక పోలాండ్లో వోవూఫ్ పట్టణంలోని ఒక కారాగారంలోవున్న ఖైదీలతో యెహోవాసాక్షులు పనిచేస్తూ పొందిన విజయాన్ని గురించి నివేదించింది.
పైన పేర్కొనబడిన కావలికోట పత్రికను ప్రజలలోకి విడుదల చేయడానికి ముందు, దాన్ని అక్కడి ఖైదీలకు అందజేయడానికి 1998, సెప్టెంబరు 13న వోవూఫ్ చెరసాలలో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆహ్వానితుల్లో స్థానిక సాక్షులు, బాప్తిస్మం తీసుకున్న ఖైదీలు, ఆసక్తివున్న ఇతర ఖైదీలు, అనేకమంది చెరసాల అధికారులు ఉన్నారు. హాజరైన వారు చేసిన కొన్ని వ్యాఖ్యానాలు క్రింద ఉన్నాయి.
ఐదు సంవత్సరాల క్రితం చెరసాలలో బాప్తిస్మం తీసుకున్న యెర్జీ అనే యెహోవాసాక్షి ఇలా అన్నాడు: “నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే దగ్గర్లోవున్న సంఘాల్లోని సహోదరులు మాకు సహాయం చేయడానికి ఎంత కృషి చేశారో నేనీరోజు చదవగల్గుతున్నాను.” ఆయనింకా ఇలా అన్నాడు: “నేను రోజు రోజుకీ నాలో మెరుగులు దిద్దుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంటాను, యెహోవా నన్ను ఎలా మలుస్తున్నాడో నేను గ్రహించగల్గుతున్నాను.”
జెష్వాఫ్ అనే మరో ఖైదీ కారాగారంలోని సాక్ష్యపు పనిని గురించి ఇలా అన్నాడు: “ప్రస్తుతం నలుగురు ఖైదీలు బాప్తిస్మానికి సిద్ధపడుతున్నారు, ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నవారు మా హాల్లో కూటాలకు హాజరౌతున్నారు. ఈ క్షేత్రంలో మరింత ఎక్కువ కార్యకలాపాలు కొనసాగించడానికి ఈ శీర్షిక శక్తివంతమైన పురికొల్పుగా ఉంది.” జెష్వాఫ్ చెరసాలలో ఇంకా 19 సంవత్సరాలు గడపాల్సి ఉన్నదాని దృష్ట్యా అదెంతటి అనుకూల దృక్పథం!
వోవూఫ్ చెరసాలను గురించిన శీర్షిక చదివిన తర్వాత ఒక చెరసాల అధికారి ఇలా అన్నాడు: “ఇది మాకు చాలా మంచి పేరును తెచ్చింది. ఈ చెరసాలకు ప్రపంచవ్యాప్తంగా 130 భాషల్లో ఇంతటి అనుకూలమైన ప్రచారం లభిస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడతాను, ఖైదీల పక్షంగా మీరు చేస్తున్న ప్రయత్నాల్ని నేను మెచ్చుకుంటున్నాను.” మరో అధికారి ఇలా అన్నాడు: “యెహోవాసాక్షులను గూర్చిన నా అభిప్రాయాన్ని మీరు మార్చేశారు. ఇంతకు మునుపు మిమ్మల్ని మతఛాందసులుగా దృష్టించేవాడిని. మీరు సరియైన సూత్రాలకు కట్టుబడివున్న ప్రజలని ఇప్పుడు అర్థం చేసుకున్నాను.”
వోవూఫ్ చెరసాల డైరెక్టరు అయిన మారెక్ గాయూస్ చిరునవ్వుతో ఇలా అన్నాడు: “మీరు ఏమీ సాధించలేరని మొదట్లో మేము అనుకున్నాము. బైబిలు సంబంధిత సమాచారంతో ఖైదీలను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్న మత సంస్థల్లో ఇదొకటి అని అనుకున్నాము. అయితే, మీ తొలి ప్రయత్నాల ఫలితాలను చూసిన తర్వాత మేము మీతో పూర్తిగా సహకరించాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికి దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా మీరు అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తూ ఇక్కడికి వస్తున్నారు, మీరిప్పటి వరకు చేసిన దాన్ని నేనెంతో మెచ్చుకుంటున్నాను.”
అయితే, వోవూఫ్లోని ఖైదీ జనాంగం ఈ శీర్షికపట్ల ఎలా ప్రతిస్పందించింది? ఖైదీల్లో ఆసక్తి ఎంతగా ఎక్కువయ్యిందంటే చెరసాలలోని సాక్షుల దగ్గర పత్రికల స్టాకు అయిపోయింది. చెరసాల అధికారులు అదనంగా మరి 40 పత్రికలు తమకోసం కోరటం ద్వారా తమ ఆసక్తిని చూపించారు. పెరుగుతున్న డిమాండును తీర్చడానికి స్థానిక సంఘాలు అదనంగా 100 పత్రికలను చెరసాలలోని సహోదరులకు అందించి సహాయపడ్డాయి. అదే సమయంలో చెరసాలలోని కూటాల హాజరు పెరిగింది.
యెహోవాసాక్షులతో పూర్తిగా సహకరించిన ప్యోటా హోడ్యూ అనే చెరసాల అధికారి ఇలా అన్నాడు: “మా చెరసాలలోని షోకేసులన్నిటిలో ఈ శీర్షికను ప్రదర్శించటానికి నిర్ణయించుకున్నాము. మీతో ఇంకా బైబిలు పఠించని ఖైదీలందరూ ఈ పత్రికను చదువుతారని ఆశిస్తున్నాము.”
యెహోవాసాక్షుల చక్కని మాదిరి, ప్రకటనా పని చేయాలన్న వారి కృత నిశ్చయంతో కూడిన ప్రయాసలు మంచి ఫలితాలను తీసుకువస్తున్నాయి. బాప్తిస్మం వరకు చేరుకున్న 15 మంది ఖైదీలు కాక, ఇద్దరు చెరసాల అధికారులు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నారు, మరో చెరసాల అధికారి బైబిలు పఠనం కోసం అడిగాడు. వోవూఫ్ చెరసాలలో ప్రకటిస్తున్న సహోదరులు లభించిన విజయానికి ఘనత అంతటినీ యెహోవా దేవునికే చెల్లిస్తారు.—పోల్చండి 1 కొరింథీయులు 3:6, 7.
[28వ పేజీలోని చిత్రం]
చెరసాల లెక్చర్ హాల్లో పత్రికను ప్రదర్శిస్తున్న ముగ్గురు సాక్షులు, ఒక ఖైదీ