‘ఏమి జరుగుతుందో ముందే గ్రహించే’ తెలివి
“వారు స్వస్థబుద్ధిని కోల్పోయిన ప్రజలు, వారికి వివేచన లేదు. వారు బుద్ధిమంతులైవుంటే, దీన్ని అర్థం చేసుకుని, తమకు ఏమి జరుగుతుందో ముందే గ్రహించివుండేవారు.”—ద్వితీయోపదేశకాండము 32:28, 29, బెక్.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశపు అంచున నిలబడి ఉండగా మోషే వారితో పలికిన మాటలివి. వాళ్లు యెహోవాను విడిచిపెట్టి, తమ చర్యలను బట్టి రాగల పర్యవసానాల గురించి ఎంతమాత్రం ఆలోచించకుండా ఉండబోయే సమయాన్ని గురించి మోషే ముందుగానే తెలియజేస్తున్నాడు. ఆ తర్వాతి శతాబ్దాల్లో, అనేకమంది రాజులతో సహా ఇశ్రాయేలీయులు దేవుని హెచ్చరికలను అలక్ష్యం చేశారు.
ఉదాహరణకు, యెహోవాను గాక ఇతర దేవతలను ఆరాధించేవారిని వివాహం చేసుకోవద్దన్న దైవిక ఆజ్ఞ సొలొమోనుకు తెలుసు. (ద్వితీయోపదేశకాండము 7:1-4) అయినప్పటికీ, ఆయన “అనేకమంది పరస్త్రీలను” వివాహం చేసుకున్నాడు. ఫలితం? బైబిలు వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాకపోయెను.” (1 రాజులు 11:1, 4) సొలొమోను జ్ఞానవంతుడే అయినప్పటికీ, దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపిస్తే ‘ఏమి జరుగుతుందో ముందే గ్రహించే’ తెలివి ఆయనకు కొరవడింది.
మన సంగతేమిటి? జీవితంలో తీసుకోవలసిన నిర్ణయాల గురించి ముందుగా తగినంత ఆలోచిస్తే మనం ఎంతో మానసిక క్షోభను నివారించవచ్చు. ఉదాహరణకు, ‘శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులనుగా’ చేసుకోమని క్రైస్తవులకు ఆజ్ఞాపించబడింది. (2 కొరింథీయులు 7:1) ఇది జ్ఞానయుక్తమైనదే, కాని పౌలు ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని అలక్ష్యం చేస్తే ఏమౌతుందనే దాన్ని గురించి యోచించే సరైన వివేచన చాలామందికి ఉండదు. ఉదాహరణకు, అనేకమంది యౌవనస్థులు పొగత్రాగడం తమను జ్ఞానవంతమైనవారిగా, పెద్దవారిగా చేస్తుందని భావించి పొగత్రాగడం ద్వారా తమ శరీరాలను కలుషితం చేసుకుంటారు. ఫలితంగా, జీవితంలో అటుతర్వాత చాలామంది గుండె సంబంధమైన సమస్యలు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, లేక ఎంఫిసీమా వంటివాటికి గురవ్వడం ఎంత విచారకరం!
మన నిర్ణయాలు, చర్యల వల్ల వచ్చే పర్యవసానాల గురించి గంభీరంగా ఆలోచించడం ప్రాముఖ్యం. సరైన కారణంతోనే పౌలు ఇలా వ్రాశాడు: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛేలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.”—గలతీయులు 6:7, 8.