ఆధునిక గ్రీకుభాషలో ఒక క్రొత్త బైబిలు
“దేవుని వాక్యంలో విశ్వాసం” జిల్లా సమావేశం కోసం గ్రీసులో సమకూడిన వారికి 1997 ఆగస్టు 23 ఎంతో ప్రత్యేకమైన దినం. మధ్యాహ్న కార్యక్రమ ముగింపులో, ఒక క్రొత్త బైబిలు విడుదల చేయబడింది, అదే ఆధునిక గ్రీకుభాషలోని పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదము. ఆశ్చర్యచకితులైన ప్రేక్షకులు ఆనందబాష్పాలు రాలుస్తూ మిన్నుముట్టేలా చాలాసేపు కరతాళ ధ్వనులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు!
యెహోవాసాక్షులు 1905 నుండీ, ఒక గ్రీకు ఆర్థడాక్స్ మతగురువు రూపొందించిన 19వ శతాబ్దపు బైబిలు అనువాదాన్ని ఉపయోగించే వారు. ఆ బైబిలు వాళ్లకు ఎన్నో సంవత్సరాలపాటూ చాలా ఉపయోగకరంగా ఉంది. అయితే, మరింత కచ్చితమైన, సులభంగా అర్థం చేసుకోగల బైబిలు అనువాదం యొక్క అవసరత యెహోవాసాక్షులకు కొంతకాలం పాటు ఎంతగానో ఉండేది. 1993లో, క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతన లోక అనువాదము యొక్క గ్రీకుభాషా ప్రతులను అందుకుని వాళ్లెంతో ఆనందించారు. అయితే, ఇప్పుడు పూర్తి బైబిలు ఆధునిక గ్రీకుభాషలో లభ్యమవ్వడంతో వాళ్లు మరింత ఆనందించారు.
నూతనలోక అనువాదము పట్ల మెప్పుదలగల ఒక సాక్షి, “మొదటిసారిగా మేము మా స్వంత భాషలో స్పష్టంగా అర్థం చేసుకోగలిగే విధంగా, యెహోవా స్వరాన్ని మోసుకువస్తున్న మెత్తని గాలి తెమ్మెరలాంటి ఒక కావ్యం” అంటూ దాన్ని అభివర్ణించింది. కొంతమంది ఇళ్లకు చేరుకున్న వెంటనే తమ క్రొత్త బైబిలును చదవడం ప్రారంభించారు. సమావేశానికి హాజరై, ఆ విడుదలను బట్టి ఎంతో ఉత్తేజితుడైన ఒక వ్యక్తి, రాత్రి ఒంటిగంటయ్యే వరకు చదివి గాని ఆ బైబిలును ప్రక్కన పెట్టలేకపోయాడు, ఎందుకంటే ఆయన యోబు గ్రంథం మొత్తం చదవడం ముగించేసరికి రాత్రి ఒంటిగంటయ్యింది!
గ్రీకులో పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదమును ఉత్పత్తి చేసేందుకు దాదాపు ఏడు సంవత్సరాలు తీవ్రంగా కృషి చేయవలసి వచ్చింది. మాకు అందిన ఒక ఉత్తరం ఇలా తెలియజేసింది: “యథార్థవంతులైన ప్రజలు యెహోవా గురించి తెలుసుకునేందుకు వారికి తోడ్పడడానికి నూతనలోక అనువాదము ఎంతగానో సహాయం చేస్తుందని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.”