మంచి ప్రవర్తన స్తుతిని తెస్తుంది
“మాటెర—విశేషమైన గుహ నివాసాల నగరం” అనే శీర్షికను ప్రచురించినందుకు లా గాడ్జెటా డెల్ మెడ్జోజర్నో అనే ఇటాలియన్ వార్తాపత్రిక యెహోవాసాక్షులను ప్రశంసించింది. ఈ శీర్షిక జూలై 8, 1997 తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికలో ప్రచురించబడింది, ఈ పత్రిక అనేక భాషల్లో విస్తృతంగా పంపిణీ చేయబడుతుంది. తేజరిల్లు! ప్రస్తుతం 81 భాషల్లోకి అనువదించబడుతోంది, ప్రపంచవ్యాప్తంగా 1.9 కోట్ల ప్రతులు పంపిణీ చేయబడుతున్నాయి. ఆ వేసవిలో “[మాటెర] నగర చారిత్రక మరియు కళాత్మక వారసత్వాన్ని వృద్ధి చేయడానికి చేయబడిన ప్రచారం విషయానికి వస్తే” తేజరిల్లు! అగ్రస్థానంలో ఉందని ఆ వార్తాపత్రిక వ్యాఖ్యానించింది.
1997లో మాటెరలో జరిగిన “దేవుని వాక్యంలో విశ్వాసం” అనే జిల్లా సమావేశానికి సంబంధించి ఆ వార్తాపత్రిక సాక్షులను ప్రశంసించింది. సాక్షులు “వేసవి మధ్య భాగంలో, మండిపోతున్న ఎండలో, [నగరంలోని] XXI సెట్టెంబర్ స్టేడియంకు 4,000 మంది వచ్చేలా” చేయగలిగారనీ, “వాళ్లు ఈ స్టేడియంను శుభ్రపర్చడం, తిరిగి పెయింట్ వేయడం, ప్రాథమికంగా అవసరమైన వాటిని (ప్రాముఖ్యంగా టాయ్‌లెట్ సౌకర్యాలను) బాగుచేయడం వంటివన్నీ పూర్తిగా స్వచ్ఛందంగా చేశారనీ, అవసరమైన వస్తువులను కొనడానికైన ఖర్చును వాళ్లే భరించారనీ” ఆ శీర్షిక పేర్కొంది.
యెహోవాసాక్షులు మంచి పొరుగువారిగా ఉండడానికి కృషి చేస్తారు. (మత్తయి 22:37-39) “వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలె”నన్న లేఖనాధార ఆజ్ఞను కూడా వాళ్లు అనుసరిస్తారు.—1 పేతురు 2:12.