పది ఆజ్ఞలు
ఇంగ్లాండు నందలి గ్లూసెస్టర్ బిషప్పు, తన డయోసిస్‌లోని సగంకంటే ఎక్కువమంది పది ఆజ్ఞలను వల్లించలేరని, బైబిలులో అవి ఎక్కడున్నాయో 10 శాతం మందికి తెలియదని కనుగొన్నాడు. కానీ అది 450 సంవత్సరాల క్రిందటి విషయం. అప్పటి నుండి పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా? సండే టైమ్స్ ఆంగ్లేయ మతనాయకులపై ఇటీవల జరిపిన యాదృచ్చిక సర్వే తెలియజేస్తున్నట్లుగా, మార్పు ఎంతమాత్రం రాలేదు.
ఇంటర్‌వ్యూ చేయబడిన 200 మంది మతనాయకుల్లో, కేవలం 34 శాతం మందే మొత్తం పది ఆజ్ఞలనూ ఉదాహరించగలిగారు. మిగిలినవారిలో ఒక వ్యక్తి అవి మరీ ప్రతికూలంగా ఉన్నాయన్నాడు. అవి ఆధునిక నైతిక సవాళ్లకు తగిన విధంగా లేవని కొట్టేశారు.
మీకు పది ఆజ్ఞలు తెలుసా, వాటినెక్కడ కనుగొనవచ్చో తెలుసా? అవి బైబిలు నందలి రెండవ పుస్తకమైన నిర్గమకాండము నందలి 20వ అధ్యాయంలోని మొదటి 17 వచనాల్లో వ్రాయబడివున్నాయి. వాటినెందుకు చదవకూడదు? వాటిని వర్గీకరించడానికి ఇక్కడొక సుళువైన మార్గం ఉంది. మొదటి నాలుగు దేవునికి మనం చేసే ఆరాధనతో సంబంధం కలిగివున్నాయి, ఐదవది కుటుంబ జీవితాన్ని ఉన్నతపరుస్తుంది, ఆరు నుండి తొమ్మిది వరకున్నవి మన తోటి వ్యక్తితో మన సంబంధాన్ని గురించినవి, పదవది విశేషమైనది, అది మన హృదయాలను పరిశోధించుకొనేలా మన ఉద్దేశాలను పరిశీలించుకొనేలా చేస్తుంది. ఆ సూత్రాలను క్రైస్తవులు ఎలా అన్వయించుకోవచ్చుననే దాన్ని గురించిన క్లుప్త సమీక్ష ఇక్కడ ఇవ్వబడింది.
మొదటిది: మన సృష్టికర్తకు అనితర భక్తిని చెల్లించండి. రెండవది: ఆరాధనలో విగ్రహాలను ఉపయోగించకండి. మూడవది: దేవుని నామాన్ని ఎల్లప్పుడూ గౌరవించి ఘనపర్చండి. నాలుగవది: పరధ్యాస లేకుండా ఆధ్యాత్మిక విషయాలపై దృష్టినిల్పడానికి సమయం తీసుకోండి. ఐదవది: పిల్లలారా, మీ తలిదండ్రులను గౌరవించండి. ఆరవది: హత్య చేయకూడదు. ఏడవది: వ్యభిచరించ కూడదు. ఎనిమిదవది: దొంగిలించకూడదు. తొమ్మిదవది: నిజమే మాట్లాడాలి. పదవది: దురాశను విసర్జించండి.
పది ఆజ్ఞలు మోషేకివ్వబడిన ధర్మశాస్త్రంలో ఒక భాగం. కాని అవి తెలియజేసే సూత్రాలు మాత్రం కాలపరిమితి లేనివి. (రోమీయులు 6:14; కొలొస్సయులు 2:13, 14) ఈ కారణంగానే, యేసు అనుచరులు పది ఆజ్ఞలనుండి ఎత్తి చెప్పారు, వాటిని ఉదాహరించారు. (రోమీయులు 13:8-10) అందరూ ఈ దైవ ప్రేరేపిత సూత్రాలను గౌరవించి, వాటి అనుసారంగా జీవిస్తే నేడు జీవితం ఎంత ఆనందభరితంగా, సురక్షితంగా ఉంటుందో కదా!