ప్రయోజనకరంగా ఉన్న నిద్రలేని రాత్రులు
రాజులు సహితం నిద్రలేని రాత్రుల్ని గడిపారు. అలా గడిపినవారిలో, సా.శ.పూ ఐదవ శతాబ్దంలో పర్షియాను పరిపాలించిన ఓ శక్తిమంతుడైన పాలకుడు ఉన్నాడు. తాను చదివించుకోవాల్సిన రాజ సంబంధమైన రికార్డుల్ని చదివించుకోవడాన్ని అలక్ష్యంచేశానని బహుశా ఆయన భావించి ఉంటాడు. రాజును చంపాలనే పన్నాగాన్ని నమ్మకమైన సేవకుడైన మొర్దెకై బయల్పర్చాడు కానీ దానికి తగిన విధంగా అతను సన్మానించబడలేదని రాజు గ్రహించాడు. దీన్ని వెంటనే సరిదిద్దాలని అహష్వేరోషు నిశ్చయించుకున్నాడు. దైవికంగానే రాజుకు నిద్రపట్టలేదనే విషయాన్ని, దేవుని ప్రజలపై ఆయన తీసుకున్న చర్యలు చూపించిన ప్రయోజనకరమైన ప్రభావాలు సూచిస్తున్నాయి.—ఎస్తేరు 6:1-10.
దక్షిణ ఆఫ్రికాలోని కోస్తాతీరాన నెలకొన్న హార్మానస్ పట్టణంలో ఉన్న యెహోవాసాక్షుల సంఘానికి బైబిల్లోని ఈ భాగాన్ని గుర్తుంచుకోవడానికి తగిన కారణమేవుంది. వాళ్లు అద్దెకు తీసుకున్న హాల్లో కూడుకుంటూ ఉండేవారు. తమ స్వంత రాజ్యమందిరాన్ని నిర్మించుకునేందుకు స్థలాన్ని కొనడానికి అనేక సంవత్సరాలుగా వాళ్లు ప్రయత్నించారు. చివరకు, 1991లో పట్టణ పాలక సంస్థ ఎంతో విలువైన స్థలాన్ని అమ్మజూపింది.
అయితే, ఈ స్థలాన్ని యెహోవాసాక్షులకు అమ్మడాన్ని కొంతమంది వ్యతిరేకించారు. అనేక నెలలపాటు జాప్యం చేసిన తర్వాత, స్థలాన్ని చర్చీలకు అమ్మడం విషయంలో మూడు సంవత్సరాల మారిటోరియం (ప్రత్యేక గడువు) అమలులో ఉందనీ, స్థలాన్ని అమ్మే ఉద్దేశాన్ని ఉపసంహరించుకుంటున్నామనీ సంఘానికి తెల్పబడింది. వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి పునఃపరిశీలించమని పట్టణ పాలక సంస్థను అర్థిస్తూ సంఘం మరలా ఒక ఉత్తరాన్ని మే 1993లో రాసింది. ప్రత్యుత్తరంగా మారిటోరియం ఇంకా అమలులో ఉందని తెలియజేస్తూ ఒక్క వాక్యమున్న ఉత్తరం వాళ్లకు వచ్చింది.
అదే సంవత్సరం అక్టోబరు నెలలో, పట్టణ కౌన్సిలర్లలో ఒకరికి నిద్రపట్టలేదు. శ్రద్ధ చూపించాల్సిన విషయాలేమైనా ఉన్నాయేమోనని పరిశీలించేందుకు పట్టణ పాలక సంస్థలో జరిగిన మీటింగ్‌లకు సంబంధించిన పాత మినిట్స్‌ను చూస్తూ ఆమె సమయాన్ని గడిపింది. పట్టణ పాలక సంస్థ నిర్ణయాన్ని పునఃపరిశీలించమని అర్థిస్తూ సాక్షులు రాసిన ఉత్తరం ఆమె అవధానాన్ని ఆకట్టుకుంది. ఆ విధంగా, ఆమె తరువాత జరగబోయే తమ మీటింగ్ కొరకైన ఎజెండాలో ఈ విషయాన్ని ఉంచాలని నిర్ణయించుకొంది. చర్చీల కొరకైన స్థలాలపై మారిటోరియం అమలులోనికి రాకముందే స్థలం కొరకు యెహోవాసాక్షులు అభ్యర్థన చేశారనే విషయాన్ని ఆమె సూచించాలనుకొంది.
సకాలంలో, 1991లో మొదట తమకు అమ్మజూపిన అదే స్థలం సంఘానికి కేటాయించబడింది! అది ప్రధాన రహదారిపై ఉన్నందున సంఘ సభ్యులూ, ఆసక్తికల్గిన వ్యక్తులూ సులభంగా రావడానికి వీలవుతుంది. వాళ్లు ఆకర్షణీయమైన ఒక రాజ్యమందిరాన్ని నిర్మించారు, అది 1996, అక్టోబరు 5న యెహోవాకు సమర్పించబడింది.
నిద్రలేని రాత్రి మూలంగా కౌన్సిలర్ అసౌకర్యానికి గురైందని సంఘం నొచ్చుకున్నా, అలా నిద్రలేని రాత్రిని గడిపినవారిలో రాజైన అహష్వేరోషు కూడా ఉన్నాడనే వాస్తవాన్ని గ్రహించి ఆమె ఊరడింపు పొందవచ్చు. రెండు సందర్భాల్లోనూ ఫలితం, ప్రయోజనకరమైంది. పవిత్ర ఆరాధన కొరకైన, ఈ ప్రసిద్ధిగాంచిన కోస్తాతీర పట్టణంలో దైవపరిపాలనా తర్ఫీదు కొరకైన కేంద్రమగు తమ రాజ్యమందిరాన్ని కల్గివున్నందుకు హార్మానస్లోని సంఘం ఎంతో కృతజ్ఞత కల్గివుంది.—హెబ్రీయులు 10:24, 25.