యౌవనంలో కాడిని మోయడం
వ్యవహరించేందుకు కష్టతరంగా ఉండే ఈ “అపాయకరమైన కాలముల”లో యౌవనస్థులు అనేక గంభీరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. (2 తిమోతి 3:1) అనైతికతను, పొగ త్రాగడాన్నీ ఇతర విధాలైన విపత్కర ప్రవర్తనలను ప్రోత్సహించే ప్రకటనలు వారిపై ప్రతిరోజూ దాడి చేస్తాయి. బైబిలు ప్రమాణాలను అనుసరించే వారు ఇతరులవలె ఉండడానికి నిరాకరించినందుకు బహుశ అపహాస్యం చేయబడుతుండవచ్చు, మరి కొందరు క్రైస్తవులు లొంగిపోవడం సులభమని భావించవచ్చు.
సా.శ.పూ. ఏడవ శతాబ్దం చివరి భాగంలో, యిర్మీయా ఇలా వ్రాశాడు: “యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.” (విలాపవాక్యములు 3:27) ఆయన మాటల భావమేమిటి? యౌవనంలో ఉన్నప్పుడు వచ్చే కష్టాలను సహించడాన్ని నేర్చుకోవడం, పెద్ద వయస్సులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒకరిని సిద్ధం చేస్తాయి. కష్టకాలాలు, అప్రీతికరంగా ఉన్నప్పటికీ, క్రైస్తవ యౌవనులకు అలాగే పెద్దలకు కూడా తప్పనిసరి. (2 తిమోతి 3:12) అయితే నమ్మకంగా ఉండటం యొక్క ప్రయోజనాలు, రాజీపడటం వలన వచ్చే ఎలాంటి తాత్కాలిక ఉపశమనానికంటే కూడా ఎంతో గొప్పవి.
మీరు యౌవనులైతే, విశ్వాసం యొక్క పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనండి. చెడు ప్రవర్తనలో పాల్పంచుకోవాలని శోధింపబడినప్పుడు, రాజీపడేందుకు నిరాకరించండి. అలా చేయడం ఆ క్షణంలో కష్టంగానే ఉండవచ్చు, అయితే దీర్ఘ కాలంలో మీకు ఎక్కువ కష్టాలు ఉండవు. యేసు ఇలా వాగ్దానం చేశాడు: “మీ మీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; . . . ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:29, 30.
బైబిలు సూత్రాలకనుగుణంగా జీవించడమనే సవాలును అంగీకరించండి. అలా చేయడం మీకు ఇప్పుడు అతి శ్రేష్ఠమైన జీవిత విధానాన్నిస్తుంది, భవిష్యత్తు కొరకు దృఢమైన నిరీక్షణనిస్తుంది. బైబిలు పేర్కొన్న విధంగా, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17.