దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేసేందుకు ఒక క్రొత్త ఉపకరణం
“దాని సరళమైన, సూటియైన, దయాపూర్వకమైన శైలి ఊహకందని ఫలితాలను ఉత్పన్నం చేస్తుంది. దానిలోని అంశాలు ఎంత సుళువైన, ఆహ్లాదకరమైన విధానంలో అందజేయబడ్డాయంటే, యథార్థవంతుడైన, పరిశీలించే స్వభావంగల ఏ వ్యక్తియైనా, ‘దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు’ అని చెప్పేలా కదిలించబడతాడు.” (1 కొరింథీయులు 14:25) దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే క్రొత్త బ్రొషూరును వర్ణిస్తూ థాయిలాండుకు చెందిన యెహోవాసాక్షులలో ఒకరు అలా తెలియజేశారు. దాన్ని వాచ్‌టవర్ సొసైటీ 1996/97 సంవత్సరాలలో జరిగిన “దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశాల్లో విడుదల చేసింది.
32 పేజీల ఈ పూర్తి రంగుల బ్రొషూరు బైబిలు పఠన కోర్సు కొరకు రూపొందించబడింది. దానిలో బైబిలు యొక్క ప్రాథమిక బోధలు పొందుపర్చబడ్డాయి. దానిలోని పదజాలం, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో స్పష్టంగా వివరిస్తూ సరళంగా, సంక్షిప్తంగా ఉంది. దాన్ని అర్థం చేసుకోవడం పాఠకులకు ఏమాత్రం కష్టం కాదు. ఈ క్రొత్త బ్రొషూరుతో మీరు బైబిలు పఠనాన్ని ఎలా చేయవచ్చు?
ప్రశ్నలను ఉపయోగించండి. ప్రతి పాఠం ఆరంభంలోనూ ప్రశ్నలున్నాయి. ప్రతి ప్రశ్న తర్వాత బ్రాకెట్లలో, జవాబులను ఏ పేరాలలో కనుగొనవచ్చో తెలియజేసే నెంబర్లను మీరు కనుగొంటారు. ఈ ప్రశ్నలను పూర్వపరిశీలన మరియు పునఃపరిశీలన బోధనా సహాయకాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఒక గృహ బైబిలు పఠనారంభంలో విద్యార్థి వ్యాఖ్యానాలను రాబట్టడానికి మీరు ఆయనను ప్రశ్నలు అడుగవచ్చు. తప్పు సమాధానాలను వెంటనే సరిచేసే బదులు, మీరు పఠనాన్ని కొనసాగించవచ్చు. పాఠం చివరలో, ఇప్పుడు విద్యార్థి వాటికి బైబిలుతో పొందికగల సమాధానాలను ఇవ్వగల్గుతున్నాడా అనేది తెలుసుకోవడానికి మీరు మళ్లీ ప్రశ్నలు వేయవచ్చు.
లేఖనాలను తెరిచి చూడండి. ప్రతి పాఠంలోను, బైబిలు సత్యం యొక్క క్లుప్త వ్యాఖ్యానాలతోపాటు వాటిని సమర్థించే లేఖనాలు ఉన్నాయి. లేఖనాల్లో ఎక్కువ భాగం ఎత్తి వ్రాయబడలేదు గాని కేవలం ఉదాహరించబడ్డాయి గనుక తన స్వంత బైబిలులో ఈ లేఖనాలను చూసుకోమని విద్యార్థిని ప్రోత్సహించడం ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని అతడు తన జీవితంలో అన్వయించుకోవడానికి ముందు అతడు దానిని చదివి, ధ్యానించవలసిన అవసరం ఉంది.—యెహోషువ 1:8.
చిత్రాలను చూపించండి. ఈ బ్రొషూరులో ఫోటోలు, పెయింటింగ్‌లు విరివిగా వాడబడ్డాయి—మొత్తం కలిపి 50 కంటే ఎక్కువ చిత్రాలున్నాయి. ఇవి కేవలం దృష్టినాకర్షించడానికే గాక అదనపు బోధనా సహాయకాలుగా కూడా అందజేయబడ్డాయి. ఉదాహరణకు, చివరి రెండు పాఠాల (ఒకొక్కటి ఒక పేజీ ఉండి ఎదురుబదురు ఉన్న పేజీలు) శీర్షికలేమిటంటే, “దేవుని చిత్తాన్ని చేయడానికి ఇతరులకు సహాయం చేయడం” మరియు “దేవుని సేవ చేయాలన్న మీ నిర్ణయం.” రెండు పేజీలనిండా ఉన్న చిత్రాలు ఒక వ్యక్తి అనియతంగా సాక్ష్యమివ్వడం, ఇంటింటి పరిచర్యలో భాగం వహించడం, సమర్పించుకోవడం, చివరికి బాప్తిస్మం తీసుకోవడం వంటివి చూపిస్తూ ఒకే వ్యక్తి యొక్క ఆత్మీయ అభివృద్ధిని తెలియజేస్తాయి. విద్యార్థి అవధానాన్ని ఈ చిత్రాల వైపు మళ్లించడం ద్వారా, దేవుని సేవ చేసేందుకు తీసుకోవలసిన చర్యలను అతడు తెలుసుకోవడానికి మీరు సహాయం చేస్తారు.
ఆసక్తిగల ఒక వ్యక్తి సరిగా చదవలేనివాడైతే లేక అసలే చదువురానివాడైతే అప్పుడేమిటి? సంస్థ ఈ క్రొత్త బ్రొషూరును అనేక భాషల్లో ఆడియో క్యాసెట్ల రూపంలో లభ్యమయ్యేలా చేస్తుంది. క్యాసెట్లో బ్రోషూరులోని సమాచారంతోపాటు ఉదాహరింపబడిన అనేక లేఖనాలు కూడా ఉంటాయి. అది ఇలా రికార్డు చేయబడింది: మొదటి ప్రశ్న చదువబడుతుంది, దాని తర్వాత దానికి సమాధానమిచ్చే పేరా (లేదా పేరాలు) దానితోపాటు ఉదాహరింపబడిన కొన్ని లేఖనాలు చదువబడతాయి. ఆ తర్వాత తర్వాతి ప్రశ్న, దాని తర్వాత దానికి సమాధానమిచ్చే సమాచారం మరియు లేఖనాలు అలా ఒకదాని తర్వాత ఒకటి చదువబడతాయి. విద్యార్థి పఠనం కొరకు సిద్ధమౌతూ రికార్డింగును వినవచ్చు. పఠనం నిర్వహించేటప్పుడు కూడా క్యాసెట్‌ను ఉపయోగించవచ్చు.
సమావేశానికి హాజరైనవారు తమ ప్రాంతీయ పరిచర్యలో ఈ క్రొత్త బ్రొషూరును ఉపయోగించాలనే ఉత్సుకత కలిగివున్నారు. ఉదాహరణకు, బ్రొషూరును పొందిన కేవలం కొన్ని రోజుల తర్వాత, అమెరికాకు చెందిన ఇద్దరు పయినీర్లు (పూర్తికాల సువార్తికులు) తాము పునర్దర్శనాలు చేస్తుండిన ఒక యువ జంటకు దాన్ని ఇచ్చారు. ఆ జంట విషయసూచికను చూసినప్పుడు, “దేవుడు ద్వేషించే అలవాట్లు” అనే పాఠం వారిని ఆకట్టుకుంది. “దేవుడు ఎన్నడూ ద్వేషించడు—ఆయన పూర్తిగా ప్రేమామయుడు అని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, నేను ముందు ఇదే చదువుతాను” అని ఆ యువతి చెప్పింది. తర్వాతి వారం ఆ ఇద్దరు పయినీర్లు తిరిగి వెళ్లినప్పుడు, ఆ యువతి ఇలా తెలియజేసింది: “నేను క్రొత్త బ్రొషూరును చదివాను. మనం చేయవలసినవన్నీ చేయడం ఎంతో కష్టం. మమ్మల్నిబట్టి యెహోవా ఆనందించడం లేదు—మేము వివాహం చేసుకోలేదు. కాని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. వచ్చే శుక్రవారం వివాహం చేసుకోవడానికి మేము ఏర్పాట్లు చేసుకున్నాము.” పయినీరు జంటను కౌగలించుకుని, వారు ఇంకా ఇలా తెలియజేశారు: “క్రమంగా పఠనాన్ని కొనసాగించనందుకు మేము క్షమాపణలు కోరుతున్నాము, కాని ఈ నిర్ణయం మాకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది.”
దేవుడు . . . కోరుతున్నాడు అనే క్రొత్త బ్రొషూరును తప్పకుండా ఉపయోగించండి. దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేసేందుకు ఇది ఒక చక్కని ఉపకరణం.
[17వ పేజీలోని చిత్రం]
క్రొత్త బ్రొషూరును మీరెలా ఉపయోగిస్తారు?