మాజీ న్యాయమూర్తి క్షమాపణ కోరాడు—45 ఏళ్ల తర్వాత
బెర్లిన్‌లోని ఓ కోర్టు గదిలో, 1995 ఆగస్టు నెలలో, 45 ఏళ్ల క్రితం తాను చేసిన తప్పిదం విషయమై సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి, ఒక యెహోవాసాక్షికి క్షమాపణ చెప్పుకున్నాడు.
1950 అక్టోబరులో, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (జిడిఆర్) యొక్క సుప్రీమ్ కోర్టు, దేశానికి విరుద్ధంగా ఆందోళన మరియు గూఢచర్యం చేస్తున్నారని యెహోవాసాక్షుల్లో తొమ్మిదిమందిపై అపరాధాన్ని మోపింది. ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది, మిగతా ఏడుగురికి—ఛాయాచిత్రంలో కుడినుండి నాల్గవ వాది అయిన 22 ఏళ్ల లోటార్ హౌర్నిక్ కూడా అందులో ఉన్నాడు—దీర్ఘకాల కారాగార శిక్షలు విధింపబడ్డాయి.
నలభై సంవత్సరాల తర్వాత, జిడిఆర్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో ఒక భాగమయ్యింది. పూర్వపు జిడిఆర్‌లో జరిగిన కొన్ని అన్యాయాలను గురించి దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించి, దానికి కారకులైన వారిని చట్టానికి పట్టించాలని ప్రయత్నించారు. 1950లో సాక్షులపై సుప్రీమ్ కోర్టు జరిపిన విచారణ ఒకటి అందులో ఉంది.
ఇప్పుడు 80 ఏళ్లవాడైన ఎ. టి., ఆ తొమ్మిదిమంది సాక్షులు విచారణకు రప్పించబడినప్పుడు తీర్పు తీర్చిన ముగ్గురు న్యాయమూర్తుల్లో ఒకరు. న్యాయాన్ని వక్రీకరించాడన్న నేరంపై ఇప్పుడు బెర్లిన్‌లోని రీజనల్ కోర్టు ఎదుట తన ఆదేశాన్ని గురించి వివరించేందుకు వచ్చాడు.
కోర్టు వారికి తాను ఇచ్చిన వాజ్ఞ్మూలంలో, తాను 45 సంవత్సరాల పూర్వం ఒక తప్పుడు తీర్పుకు వోటు వేశాననీ, కానీ వారికి తక్కువ తీవ్రమైన శిక్ష ఇవ్వబడాలని తాను ఇష్టపడ్డానని చెప్పాడు. అయితే ఇటీవలి విచారణ, తాను విషయాన్ని పునఃపరిశీలించేలా చేసింది. ఎందుకు? యెహోవాసాక్షులు హిట్లర్‌కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించారు గనుక వారు రెండవ ప్రపంచయుద్ధ కాలంలో నాజీల చేత హింసింపబడ్డారు. యుద్ధం తర్వాత సాక్షులు మళ్లీ హింసింపబడ్డారు, అయితే ఈసారి కమ్యూనిస్టు పరిపాలన వల్ల హింసింపబడ్డారు. న్యాయమూర్తి “తీవ్రంగా కలత చెందేందుకు” అది కారణమయ్యింది.
తాను ఐదున్నర సంవత్సరాలు ఒంటరి కారాగార వాసాన్ని అనుభవించానని, 1959 వరకూ తాను బ్రాన్డెన్బర్గ్ కారాగారం నుండి విడుదల చేయబడలేదని లోటార్ హౌర్నిక్ కోర్టు వారికి తెలియజేశాడు. హౌర్నిక్ వాజ్ఞ్మూలాన్ని విన్న మాజీ న్యాయమూర్తి కంటతడి పెట్టుకున్నాడు. “అందుకు నేను దుఃఖిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు” అంటూ అతను వెక్కివెక్కి ఏడ్చాడు. హౌర్నిక్ అతన్ని క్షమించాడు.—లూకా 23:34 పోల్చండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Neue Berliner Illustrierte