“అసమమైన జోడుగా ఉండకుడి”
ఇక్కడ చిత్రీకరింపబడిన రెండు ఎడ్లు, ఎక్కువ బరువులను సులభంగా లాగడానికి వాటికి సాధ్యం చేసే అత్యంత ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాయి. ఒకవేళ ఒక ఎద్దు స్థానంలో ఓ గాడిదను పెడితే ఎలా ఉంటుంది. ఓ గాడిద ఎద్దుకంటే చిన్నగా, బలహీనంగా ఉంటుంది గనుక, తనను కాడిలో పట్టి ఉంచే పగ్గాన్ని తన్నుతూ అది తిరగబడవచ్చు. మరి మంచి కారణంతో, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది: “ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.”—ద్వితీయోపదేశకాండము 22:10.
మానవులను గురించి కూడా అపొస్తలుడైన పౌలు అలాంటిదే ఒకటి చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.” (2 కొరింథీయులు 6:14) వివాహ జతను ఎన్నుకునేటప్పుడు దీన్ని ప్రత్యేకంగా మదిలో ఉంచుకోవాలి. వివాహం శాశ్వత సహచర్యం, ఎందుకంటే “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని,” యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 19:6) వివాహ దంపతులిద్దరూ ఒకేలాంటి విశ్వాసాలను, నియమాలను మరియు గమ్యాలను కలిగి ఉండకపోతే ఎంతో ఎక్కువ బాధ కలుగుతుంది. కాబట్టి, “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలన్న బైబిలు సలహాను అనుసరించడం ఎంతో సహేతుకం. (1 కొరింథీయులు 7:39) మీ మత విశ్వాసాన్ని పంచుకొనని వ్యక్తితో వివాహ సంబంధంలో చేరడం, ఎద్దును గాడిదతో కాడిలో జత చేస్తే వచ్చే దానికంటే ఎక్కువ తీవ్రమైన సమస్యను కలిగించగలదు.
మతపర నమ్మకాల్లో తేడా ఉండటం, ఒక దంపతులు అసమంగా జోడు చేయబడ్డారని అనడానికి ఒక కారణం మాత్రమే. ఒకే విశ్వాసానికి చెందిన వారైనప్పటికీ—కాబోయే దంపతులు—‘మనిద్దరికీ ఒకే గమ్యాలు ఉన్నాయా? మేము ఎక్కడ జీవిస్తాము? డబ్బు విషయాలు ఎవరు చూస్తారు? మేమిద్దరం ఉద్యోగం చేస్తామా? మరి పిల్లలను కంటామా? దయా గుణం మరియు కనికరం సంబంధాన్ని నడిపిస్తాయా?’ అని ప్రశ్నించుకోవడం మంచిది.
అలాంటి అంశాలు ఎలాంటి తరహాలో చర్చించబడతాయి అనే విషయం, ఒక కాడి సమమైనదా లేక అసమమైనదా అనేదాన్ని కొంతమేరకు సూచించవచ్చు. ఏ ఇద్దరు వ్యక్తులు సంపూర్ణంగా ఒకే విధమైన అణుగుణ్యత కలిగి ఉండరన్నది వాస్తవమే. అయితే మొత్తంమీద, వివాహం చేసుకోవాలని కలిసి ఆలోచిస్తున్న జంట ఒకవేళ తమ సమస్యలను ఎదుర్కొనగల్గి, వాటిని కలిసిమెలిసి పరిష్కరించుకోగల్గితే, మరి ధారాళంగా సంభాషించుకోగల్గితే వారు అసమంగా జోడు చేయబడరని చెప్పవచ్చు.