‘ఇనుము చేత ఇనుము పదునగునట్లు’
సా.శ. మూడవ శతాబ్దంతంలో “కోప్టిక్ క్రైస్తవుడు” అని వర్ణించబడిన ఆంటనీ అనే పేరుగల చిత్తశుద్ధిగల ఓ యువకుడు లోక పరిత్యాగియై ఆజ్ఞాత వాసంలో 20 సంవత్సరాలు ఏకాంతంగా గడిపాడు. ఎందుకని? దేవుని సేవించడానికి ఇదే తనకు శ్రేష్ఠమైన మార్గమని ఆయన భావించాడు. ఆయన క్రైస్తవ మత సామ్రాజ్యంలో పలుకుబడిగల మొదటి సన్యాసి లేదా యోగి.
నేడు, క్రైస్తవ మత సామ్రాజ్యంలో సన్యాసులు కొందరే ఉన్నారు. అయితే, చాలా మంది వ్యక్తులు మరో విధమైన ఏకాంతతను కోరుకుంటారు. వారు మతాన్ని గూర్చి ఇతరులతో మాట్లాడడానికి నిరాకరిస్తారు. అలాంటి సంభాషణ భేదాలకు మరియు కొట్లాటలకు దారితీస్తుందని వారు భావిస్తారు. వారి ఆరాధనలో ముఖ్యంగా పొరుగువానికి హాని చేయకూడదన్నదే ఇమిడి ఉంది.
ఒకని పొరుగువానికి హాని చేయకుండా ఉండడం నిజమైన మతం యొక్క భాగమన్నది వాస్తవమే, కాని అంత కన్నా ఎక్కువే అవసరమై ఉంది. “ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును” అని ఒక ప్రాచీన సామెత చెబుతుంది. (సామెతలు 27:17) వాస్తవానికి, క్రైస్తవులు లోకం నుండి లేదా మిగిలిన క్రైస్తవుల నుండి తమను తాము పూర్తిగా ఒంటరివారిగా చేసుకోమని కాదు గాని వారు సమాజముగా కూడుకోవాలనే బైబిలు ప్రోత్సాహిస్తుంది. (యోహాను 17:14, 15) అది ఈ విధంగా చెబుతుంది: “సమాజముగా కూడుట మానక, . . . ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) యెహోవాసాక్షులు ఆ ఉపదేశాన్ని అనుసరిస్తారు. తోటి విశ్వాసుల విశ్వాసాన్ని బలపరుస్తూ ‘ఒకరినొకరు చురుకైనవారిగా చేస్తూ’ వారంలో అనేకసార్లు వారు కలుసుకుంటారు. నిజాయితీగా బైబిలును చర్చించుకోవడంలో కొట్లాటలకు నడిపించదని వారు కనుగొన్నారు. బదులుగా, అది సంఘీభావానికి మరియు సమాధానానికి నడిపిస్తుంది. అది సత్యారాధనలో అవశ్యకమైన భాగం.